పోలీసుకు పోటీ !

ABN , First Publish Date - 2022-08-17T09:51:21+05:30 IST

ఈసారి ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ సివిల్‌, ఏఆర్‌ తదితర విభాగాల్లో పోస్టులకు అనూహ్య స్పందన లభిస్తోంది.

పోలీసుకు పోటీ !

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులకు భారీగా దరఖాస్తులు

ఒక్కో పోస్టుకు బరిలో 70 మంది అభ్యర్థులు

వడబోతకు పోలీసు నియామక బోర్డు కసరత్తు

ఇప్పటికే పూర్తయిన ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష

ఈ నెల 28న కానిస్టేబుల్‌ పోస్టులకు రాత పరీక్ష 

రేపట్నుంచి బోర్డు వెబ్‌సైట్‌లో హాల్‌ టిక్కెట్లు 


హైదరాబాద్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : ఈసారి ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ సివిల్‌, ఏఆర్‌ తదితర విభాగాల్లో పోస్టులకు అనూహ్య స్పందన లభిస్తోంది. అంచనాలకు మించి వచ్చిన దరఖాస్తుల వడబోతకు పోలీసు నియామక బోర్డు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష ముగిసింది. కానిస్టేబుల్‌ పోస్టులకూ ఈ నెల 28న పరీక్ష నిర్వహించేందుకు బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. హాల్‌ టిక్కెట్లు  గురువారం నుంచి బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. కాగా సివిల్‌, తదితర విభాగాల్లో 554 ఎస్సై పోస్టులకు నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు 2,25,759 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. కానిస్టేబుల్‌ సివిల్‌, ఏఆర్‌ తదితర విభాగాల్లో 16,321 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 9,54,064 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ లెక్కన ఎస్సై, కానిస్టేబుల్‌  మొత్తం పోస్టులు 16875 కాగా ఆయా పోస్టులకు పోటీ పడుతున్నవారు 11,79,823 మంది అభ్యర్ధులు. అంటే ఒక్కో పోస్టుకు 70 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నట్లు లెక్క. నియామక బోర్డు వీరందరినీ వడబోసి ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. 


పోస్టులు వేరు... పీఈటీ ఒక్కటే...

ప్రాథమిక రాత పరీక్షలో 30-40 శాతం మంది అభ్యర్థుల సంఖ్య తగ్గుతుంది. రెండో దశలో నిర్వహించే శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ) అత్యంత కీలకమైంది. కానిస్టేబుళ్లతోపాటు ఎస్సై, అగ్నిమాపక శాఖ, డిప్యూటీ జైలర్లు, వార్డెన్లు, కమ్యూనికేషన్‌ విభాగంలో ఎస్సై, కానిస్టేబుల్‌ తదితర విభాగాలకు పీఈటీ ఒకే విధంగా ఉంటుంది. ప్రాథమిక, తుది రాత పరీక్ష విషయంలో అభ్యర్ధులు ఎంత జాగ్రత్తగా చదువుకుంటారో పీఈటీకి అంతే జాగ్రత్తగా కసరత్తు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.  ఏఆర్‌, ఏపీఎస్పీ, ఎస్పీఎఫ్‌ తదితర విభాగాలకు ఈవెంట్స్‌ మార్కులు అభ్యర్థుల ఎంపికలో కీలకంగా మారుతాయి. పీఈటీలో 5 ఈవెంట్లు అత్యంత కీలకం. ఒక్కో ఈవెంట్‌కు 15 మార్కుల చొప్పున 5 విభాగాలకు కలిపి 75 మార్కులుంటాయి. 


వాతావరణం అనుకూలించాకే...

శారీరక దారుఢ్య పరీక్షలను వాతావరణం అనుకూలించాకే నిర్వహించేందుకు బోర్డు అధికారులు ప్రణాళికలు సిద్థం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో గ్రౌండ్లు వర్షపు నీటితో బురదమయం కావడంతో ఈ పరీక్షలు నిర్వహించేందుకు అనుకూలంగా లేవు. ఆగస్టు చివరి నాటికి కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష పూర్తి చేస్తే ఆ తర్వాత ప్రిలిమినరీ కీ... ఫైనల్‌ కీ విడుదల ప్రక్రియ పూర్తయ్యేందుకు సెప్టెంబరు చివరి వరకు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబరు-నవంబరులో పీఈటీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

Read more