డబుల్‌ పేరుతో కోటి వసూలు!

ABN , First Publish Date - 2022-10-03T09:56:33+05:30 IST

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇప్పిస్తామని పేదల నుంచి రూ.కోటి వరకు కొట్టేశారు ముగ్గురు ఘరానా మోసాగాళ్లు. బాధితుల ఫిర్యాదుతో వీరి గుట్టురట్టయింది. సరూర్‌నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

డబుల్‌ పేరుతో కోటి వసూలు!

సిటీ బస్తీల్లో పేదలే టార్గెట్‌గా మోసం

ప్రభుత్వ ఉద్యోగి, ఆటో డ్రైవర్‌ అరెస్ట్‌

120 మంది వరకు బాధితులు


దిల్‌సుఖ్‌నగర్‌, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇప్పిస్తామని పేదల నుంచి రూ.కోటి వరకు కొట్టేశారు ముగ్గురు ఘరానా మోసాగాళ్లు. బాధితుల ఫిర్యాదుతో వీరి గుట్టురట్టయింది. సరూర్‌నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మియాపూర్‌ న్యూ హఫీజ్‌పేట ప్రేమ్‌నగర్‌కు చెందిన పండరి బాలరాజు(29) లక్డీకపూల్‌లోని ఏజీ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు సమీప బంధువైన బడంగ్‌పేట వరలక్ష్మీనగర్‌లో నివసించే ఆటోడ్రైవర్‌ రాజు(47)తో కలిసి ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై)ను మార్గంగా ఎంచుకున్నాడు. పీఎంఏవై కింద ఉచితంగా ఇళ్లు మంజూరు చేయిస్తామంటూ బాలరాజు, రాజు 2016లో 50 మంది పేదల నుంచి సుమారు రూ.25లక్షలు వసూలు చేశారు. ఎంతకాలానికి ఇళ్లు మంజూరు చేయించకపోవడంతో డబ్బులు చెల్లించిన వారు ఒత్తిడి చేయసాగారు. దీంతో 2017లో రూ.20 లక్షలు తిరిగి చెల్లించారు. ఇదే సమయంలో బాలరాజు, రాజుకు ఆనంద కిషోర్‌ అనే వ్యక్తి కలిశాడు.


ఈ ముగ్గురూ కలిసి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇప్పిస్తామని సరూర్‌నగర్‌, బడంగ్‌పేట, మీర్‌పేట, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో బస్తీల్లో నివాసం ఉంటున్న పేదల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. బాలరాజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని, ఆనందకిషోర్‌ హౌసింగ్‌ సొసైటీ ఉద్యోగి అని, తమకున్న పలుకుబడితో ఇళ్లు మంజూరు చేయిస్తామని నమ్మబలుకుతూ ఆటోడ్రైవర్‌ రాజు డబ్బుల వసూలు మొదలుపెట్టారు. 2017లో మూడు ఇండిపెండెంట్‌ ఇళ్లను మంజూరు చేయిస్తామని సరూర్‌ నగర్‌ భగత్‌సింగ్‌ నగర్‌లో నివసించే పుట్ట శివలక్ష్మి వద్ద నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారు. సంవత్సరాలు గడుస్తున్నా ఇళ్లు రాకకపోవడంతో శివలక్ష్మి శనివారం సరూర్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు బాలరాజు, రాజులను అరెస్ట్‌ చేశారు. వారిని విచారించగా 100- 120 మంది వద్ద నుంచి రూ.కోటి వరకు వసూలు చేసినట్లు తేలింది. మరో నిందితుడు ఆనంద్‌ కిషోర్‌ పరారీలో ఉన్నాడు. 

Updated Date - 2022-10-03T09:56:33+05:30 IST