రాష్ట్రం చేసిన ఖర్చులో కేంద్రం ఇచ్చింది గోరంత

ABN , First Publish Date - 2022-08-12T09:01:35+05:30 IST

‘‘సొంత ఆదాయ వృద్ధిలో దేశంలోనే తెలంగాణ నంబర్‌-1 స్థానంలో ఉంది. దేశ జనాభాలో మన వాటా 2.5 శాతమే.

రాష్ట్రం చేసిన ఖర్చులో కేంద్రం ఇచ్చింది గోరంత

 • గత ఆర్థిక సంవత్సరంలో 1.84 లక్షల కోట్లు ఖర్చు చేశాం
 • కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది రూ.5200 కోట్లే
 • రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చులో ఇది 3 శాతం కంటే తక్కువ
 • కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 12.9 శాతం కోత
 • అయినా.. సొంతంగా 15.3 శాతం వృద్ధిలో రాష్ట్రం 
 • కేంద్రం నిధులు వచ్చి ఉంటే వృద్ధి రేటు 22 శాతాన్ని తాకేది
 • సొంత ఆదాయ వృద్ధిలో మనమే నంబర్‌ 1
 • దేశ మొత్తం ఆదాయంలో తెలంగాణ వాటా 5 శాతం
 • దేశ జనాభాలో మనం 2.5%.. కేబినెట్‌ భేటీలో సీఎం
 • 10 లక్షల కొత్త పింఛన్లు.. ఈ నెల 15 నుంచే అమలు
 • 5,111 అంగన్‌వాడీ ఆయాలు, టీచర్‌ పోస్టులు భర్తీ
 • పంద్రాగస్టు సందర్భంగా 75 మంది ఖైదీలకు క్షమాభిక్ష
 • రాష్ట్ర కేబినెట్‌ భేటీలో నిర్ణయం.. ఆర్థిక స్థితిపై సుదీర్ఘ చర్చ
 • ఐటీ రంగంలో బెంగళూరు కంటే ఎక్కువ ఉద్యోగాలు
 • మంత్రి కేటీఆర్‌, అధికారులకు కేసీఆర్‌ అభినందనలు
 • నేడు కేసీఆర్‌ చిత్రపటానికి రాఖీలు కట్టాలి
 • ఆడబిడ్డల అభ్యున్నతికి అనేక చర్యలు
 • మహిళా లబ్ధిదారులతో మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు


హైదరాబాద్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ‘‘సొంత ఆదాయ వృద్ధిలో దేశంలోనే తెలంగాణ నంబర్‌-1 స్థానంలో ఉంది. దేశ జనాభాలో మన వాటా 2.5 శాతమే..! అయినా.. దేశ ఆదాయంలో మన వాటా 5శాతంగా ఉంది. కేంద్రం మనకు రావాల్సిన నిధుల్లో కోత పెడుతోంది. అయినా.. సొంతంగా వృద్ధిలో రాష్ట్రం కొనసాగుతోంది. కేంద్రం ఈ విషయంలో సహకరించి ఉంటే.. మన వృద్ధి రేటు 22శాతాన్ని తాకి ఉండేది’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం రూ.1.84 లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. కేంద్రం నుంచి వచ్చింది రూ.5200 కోట్లేనని విమర్శించారు. రాష్ట్రం పెట్టిన ఖర్చులో ఇది 3% కంటే తక్కువ అని.. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 12.9% కోత విధించారని దుయ్యబట్టారు. అయినా.. రాష్ట్రం సొంతంగా 15.3% వృద్ధిలో ఉందని గుర్తుచేశారు. సొంత పన్నుల విషయంలో 11.5% వృద్ధిలో ఉందన్నారు. ఈ విషయంలో కూడా తెలంగాణ నంబర్‌-1 అని పేర్కొన్నారు. గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, అధికారులు ఈ వివరాలను వెల్లడించారు. సుమారు ఐదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో.. రాష్ట్ర ఆర్థిక స్థితి, రావాల్సిన వాటా/నిధులు ఇవ్వడంలో కేంద్రం మొండిచేయి చూపడం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 


కేంద్రం సీఎ్‌సఎస్‌, వివిధ పథకాల కింద రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల్లో కోత విధించినా.. రాష్ట్రం వృద్ధి దిశలో దూసుకుపోయిందని సీఎం వ్యాఖ్యానించారు. ‘‘కేంద్రం నిధుల విడుదలకు ఎస్‌ఎన్‌ఏ అకౌంట్‌ అనే పద్ధతిని పరిచయం చేసింది. దీనివల్ల రాష్ట్రాలకు ఇచ్చే నిధుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అంతేకాదు.. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు సంబంధించి అనుమతులను సకాలంలో ఇవ్వడం లేదు. వాటిల్లోనూ కోతలు విధించారు. ఆ కోతలు లేకుంటే.. రాష్ట్ర వృద్ధి రేటు 22శాతాన్ని తాకేది’’ అని ఆయన వివరించారు. కేంద్రం అవలంబిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల రాష్ట్రాల వృద్ధి రేటు కుంటుపడుతోందని విమర్శించారు. ‘‘రాష్ట్రం సాధించిన ప్రగతిని కేంద్ర ప్రభుత్వం కూడా సాధించి ఉంటే.. జీఎస్డీపీ మరో రూ. 3 లక్షల కోట్లు పెరిగేది. రూ. 14.50 లక్షల కోట్లకు చేరుకునేది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల మంది పలు పెన్షన్‌ స్కీమ్‌ల పరిధిలో ఉన్నారు. గురువారం నాటి కేబినెట్‌ భేటీలో మరో 10 లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు.


 పంద్రాగస్టు సందర్భంగా సోమవారం నుంచే దీన్ని అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో పింఛన్‌ పథకాల లబ్ధిదారుల సంఖ్య 46 లక్షలకు చేరుకోనుంది. మరోవైపు అంగన్‌వాడీల్లో ఖాళీగా ఉన్న 5,111 ఆయాలు, టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని సీఎ్‌సను ఆదేశించారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరిన తొలినాళ్లలో ప్రకటించిన జీవో 58, 59ల కింద వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించి.. పేదలకు పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి సీఎ్‌సను ఆదేశించారు. గ్రామ కంఠంలో నూతన ఇళ్ల నిర్మాణానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులతో ఒక కమిటీని వేసి, 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలన్నారు. గత నాలుగు సంవత్సరాల్లో రైతుబంధు  కింద రూ.58,024 కోట్ల మేర పంట పెట్టుబడి సాయం అందించినట్లు అధికారులు కేబినెట్‌కు వివరించారు.


ఐటీ రంగంలో 1.55 లక్షల కొలువులు

2014-15లో ఐటీ రంగం ద్వారా రాష్ట్ర ఆదాయం రూ.62 వేల కోట్లుగా ఉండేదని.. గత ఏడాదికి అది రూ. 1.84 లక్షల కోట్లకు చేరుకుందని రాష్ట్ర ఐటీశాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్‌రంజన్‌ కేబినెట్‌కు వివరించారు. ఏడేళ్లలో మూడు రెట్ల వృద్ధి నమోదైందని తెలిపారు. దేశంలోనే తెలంగాణ ఐటీ వృద్ధిలో అగ్రగామిగా నిలిచిందన్నారు. బెంగళూరు నగరాన్ని మించి, ఐటీలో ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నామని తెలిపారు. ‘‘గత ఏడాది 1.55 లక్షల మందికి కొత్తగా ఐటీరంగంలో ఉద్యోగాలు కల్పించాం. బెంగళూరులో ఆ సంఖ్య 1.48 లక్షలుగా ఉంది. తెలంగాణలో ఐటీ రంగానికి ఇస్తున్న రాయితీలు, ప్రత్యేక విధానాలు, ప్రోత్సాహకాలు, పెట్టుబడి మిత్ర విధానాలు, మౌలిక వసతుల కల్పన, సుస్థిర శాంతిభద్రతలు, అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తు సరఫరా, మానవ వనుల లభ్యత వల్ల ఐటీ రంగం లో అభివృద్ధి సాధ్యమైంది’’ అని ఆయన వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఈ ఘనత మీదేనంటూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్‌రంజన్‌ను అభినందించారు.


75 మంది ఖైదీలకు క్షమాభిక్ష

75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని.. 75 మంది ఖైదీలకు పంద్రాగస్టు రోజున క్షమాభిక్ష ప్రసాదించాలని కేబినెట్‌ నిర్ణయించింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో విధివిధానాలను రూపొందించే అవకాశాలున్నాయి. ఇందుకోసం హోంశాఖ, జైళ్లశాఖ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జీవిత ఖైదు పడ్డ ఖైదీల్లో ఏడేళ్ల శిక్షను పూర్తిచేసుకున్న యువత, ఐదేళ్లు పూర్తి చేసుకున్న మహిళలు, వృద్ధులకు సాధారణంగా క్షమాభిక్ష కింద ఉపశమనం ఉంటుంది. అయితే.. తీవ్రమైన నేరాలు చేసిన వారు క్షమాభిక్షకు అర్హులు కారని గత జీవోలు స్పష్టం చేస్తున్నాయి.


16న రాష్ట్రమంతటా జనగణమన

స్వాతంత్య్ర వజ్రోత్సవ సంబురాలను పురస్కరించుకుని ఈ నెల 16న రాష్ట్రమంతటా సామూహికంగా జనగణమన గీతాలాపన చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. సరిగ్గా ఉదయం 11.30కు రాష్ట్ర ప్రజలంతా ఎక్కడికక్కడే ఈ గీతాలాపనలో పాల్గొనాలని స్పష్టం చేసింది. అదే సమయంలో ఈ నెల 21న స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా శాసన సభ ప్రత్యేక సమావేశానికి ఇదివరకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్‌ రద్దు చేసింది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు శ్రావణ మాసంలో ఈ నెల 21న చివరి ముహూర్తం ఉన్నాయి. ఈ నేపథ్యంలలో పెద్దఎత్తున వివాహాది శుభకార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉందంటూ ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్‌ స్పష్టం చేసింది.


ఈఎన్‌టీ ఆస్పత్రి టవర్‌..

కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులు మంజూరు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. అంతేకాకుండా కోఠిలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయం సముదాయంలో అధునాతన ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని తీర్మానించింది. కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలతో ఈఎన్‌టీ టవర్‌ నిర్మించాలని ఆదేశాలు జారీ చేసింది. సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు చేసింది.


ఆటోనగర్‌కు 15 ఎకరాలు...

వికారాబాద్‌లో ఆటోనగర్‌ నిర్మాణానికి 15 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. తాండూరు మార్కెట్‌ కమిటీకి యాలాలలో 30 ఎకరాల ఎకరాల స్థలం కేటాయించింది. షాబాద్‌లో షాబాద్‌ బండల పాలిషింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయడానికి టీఎ్‌సఐఐసీ ఆధ్వర్యంలో స్థలాల కేటాయింపునకు 45 ఎకరాలను కేటాయిస్తూ కేబినెట్‌ తీర్మానించింది.


వైద్య కళాశాల ఏర్పాటుపై పువ్వాడ హర్షం 

ఖమ్మం జిల్లాలో రూ.166 కోట్ల అంచనా వ్యయంతో వైద్య కళాశాల ఏర్పాటుతోపాటు అనుబంధంగా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని అప్‌గ్రేడ్‌ చేయడం పట్ల రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. మెడికల్‌ కాలేజీ మంజూరు చేయడం పట్ల ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన అజయ్‌కుమార్‌ ముఖ్యమంత్రి కెసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల, విద్యార్ధుల చిరకాల కోరిక నెరవేరిందన్నారు. వంద సీట్లతో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి మెడికల్‌ కాలేజీ తరగతులు ప్రారంభం కానున్నాయని తెలిపారు.

Read more