cm kcr: కొత్త పార్టీ పేరుతోనే మునుగోడు బైపోల్‌కు కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-10-05T00:34:00+05:30 IST

కొత్త పార్టీ పేరుతోనే సీఎం కేసీఆర్ (cm kcr) మునుగోడు బైపోల్‌కు వెళ్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

cm kcr: కొత్త పార్టీ పేరుతోనే మునుగోడు బైపోల్‌కు కేసీఆర్‌

హైదరాబాద్: కొత్త పార్టీ పేరుతోనే సీఎం కేసీఆర్ (cm kcr) మునుగోడు బైపోల్‌కు వెళ్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బుధవారం మునుగోడు (munugode) అభ్యర్థిని కేసీఆర్‌ ప్రకటించనున్నారు. మునుగోడు బైపోల్‌పై ప్రగతిభవన్‌లో కేసీఆర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. నామినేషన్‌, చండూరు బహిరంగ సభ తేదీల ఖరారుపై చర్చించినట్లు తెలుస్తోంది. మునుగోడులో గెలిచి జాతీయ పార్టీగా తొలి విజయాన్ని ఖాతాలో వేసుకోవాలనే కేసీఆర్‌ యోచిస్తున్నట్లు సమాచారం. నామినేషన్ వేసే నాటికి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని పార్టీ ముఖ్యులకు కేసీఆర్ తెలిపినట్లు చెబుతున్నారు. కేసీఆర్‌ విజయదశమినాడు..  బుధవారం జాతీయ పార్టీ పెట్టబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మార్చుతూ తెలంగాణ భవన్‌ లో జరిగే సమావేశంలో తీర్మానిస్తారు. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూలు విడుదలైనా.. దసరా రోజున సర్వసభ్య సమావేశం యథావిథిగా ఉంటుందని కేసీఆర్‌ తన పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఈ భేటీలోనే పార్టీ పేరు మార్పుపై తీర్మానం చేస్తారు.


మర్నాడు దానిని ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాని(సీఈసీ)కి సమర్పిస్తారు. ఎన్నికల సంఘం దీనిని ఆమోదించడానికి కొంత సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు చేసినా వచ్చే నెలలో జరిగే మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ తరఫునే అభ్యర్థి బరిలో ఉంటారని తెలుస్తోంది. ఎందుకంటే పార్టీ పేరు మార్పు ప్రక్రియ నామినేషన్ల నాటికి పూర్తికాదని, కనీసం నెల రోజులు పట్టవచ్చని.. అందుకే టీఆర్‌ఎస్‌ అభ్యర్థినే పోటీకి దించుతామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా.. కేసీఆర్‌ ఏర్పాటు చేసే జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుపెట్టనుంది. ఆయన ఇప్పటికే ఏపీలోని టీడీపీ నేతలను సంప్రదించారని సమాచారం. 

Updated Date - 2022-10-05T00:34:00+05:30 IST