సీఎం రాకకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-10-01T05:41:44+05:30 IST

సీఎం రాకకు సర్వం సిద్ధం

సీఎం రాకకు సర్వం సిద్ధం
ప్రతిమ ఆస్పత్రిలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తదితరులు, దామెరలోని బిల్లా ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్స్‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌

నేడు దామెర క్రాస్‌రోడ్డులో ప్రతిమ క్యాన్సర్‌ ఆస్పత్రి, వైద్య కళాశాలకు ప్రారంభోత్సవం

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలు, అధికారులు

మూడు గంటల పాటు సాగనున్న పర్యటన


హనుమకొండ (ఆంధ్రజ్యోతి)/ దామెర, సెప్టెంబరు 30 : హనుమకొండ జిల్లా దామెర క్రాస్‌రోడ్డు, జాతీయ రహదారి-163లో నూతనంగా ఏర్పాటైన ప్రతిమ రిలీఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌, ఆస్పత్రిని  శనివారం  సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.  సీఎం హైదరాబాద్‌ నుంచి ఉదయం 11 గంటలకు నేరుగా హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకోనున్నారు. ఆ తరువాత అక్కడి నుంచి దామెర క్రాస్‌ రోడ్‌లోని ప్రతిమ రిలీఫ్‌ ఆస్పత్రికి చేరుకుని ప్రారంభిస్తారు. సీఎం ఇక్కడ మూడు గంటల పాటు గడుపుతారు. మధ్యాహ్న భోజనం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌కు తిరిగి వెళతారు. 


ఏర్పాట్ల పరిశీలన

సీఎం పర్యటన నేపథ్యంలో శుక్రవారం దామెర క్రాస్‌ రోడ్‌లోని ప్రతిమ రిలీఫ్‌ ఆసత్రిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సందర్శించారు. ప్రతిమ ఆస్పత్రిలోని వివిధ భవన సముదాయాలను కలియ తిరిగి ఏర్పాట్లను పరిశీలించారు. ఆస్పత్రి ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రమేష్‌, డైరెక్టర్లు డాక్టర్‌ అవినాష్‌, డాక్టర్‌ ప్రతీక్‌లతో ఏర్పాట్లపై సమీక్షించారు. సభా వేదిక, ప్రారంభోత్సవ కార్యక్రమాలను పరిశీలించారు. హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లోని సంబంధిత ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. 

ఈ కార్యక్రమంలో పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్‌, రైతు రుణ విమోచన రాష్ట్ర చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్‌రావు, ‘కుడా’ మాజీ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, రైతుబంధు జిల్లా కోఆర్టినేటర్‌ ఎల్లావుల లలితాయాదవ్‌, వరంగల్‌ ఆర్డీవో సీహెచ్‌. మహేందర్‌జీ, ఎంపీపీ శంకర్‌, జడ్పీటీసీ కల్పనకృష్ణమార్తి, వైస్‌ ఎంపీపీ జాకీర్‌, రైతుబంధు కోఆర్డినేటర్‌ రమణారెడ్డి, దళితబంధు చైర్మన్‌ కృష్ణమూర్తి, కార్పొరేటర్లు షీభారాణిఅనిల్‌, ఇండ్ల నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 


అధికారుల రాక

అలాగే దామెర మండల కేంద్రంలోని బిల్లా ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్స్‌ (బిల్లా ఎస్టేట్‌) ప్రాంగణంలో సీఎం హెలీ ప్యాడ్‌ నిర్మాణం కోసం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి, ఆర్డీవో సీహెచ్‌.మహేందర్‌జీ, వరంగల్‌ మనిసిపల్‌ కమిషనర్‌ ప్రావీణ్య, బిల్లా ఇన్‌ఫ్రా చైర్మన్‌ బిల్లా రమణారెడ్డి, దామెర తహసీల్దార్‌ రియాజుద్దీన్‌తో పాటు సంబంధిత ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌, పోలీస్‌, రెవెన్యూ అధికారులు స్థల పరిశీలన చేశారు. 


350 పడకలతో ఆస్పత్రి


క్యాన్సర్‌ రోగులకు అందనున్న ఆధునిక వైద్యసేవలు

150 ఎంబీబీఎస్‌ సీట్లతో వైద్య కళాశాల

మెడికల్‌ హబ్‌గా మారుతున్న గ్రేటర్‌ వరంగల్‌


హనుమకొండ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌ చికిత్సను అందించేం దుకు గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో అత్యాధునికమైన మరో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి రాబోతున్నది. ప్రతిమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ పేరుతో ఏర్పాటవుతున్న మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా ఈ ఆస్పత్రి పని చేస్తుంది. ఇప్పటికే వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో క్యాన్సర్‌ విభాగానికి అనుబంధంగా కాకతీయ వైద్యకళాశాలలోని సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి క్యాన్సర్‌ రోగులకు చికిత్స అందుబాటులో ఉంది. దీనితో పాటు నగరంలో మరో ప్రైవేటు క్యాన్సర్‌ ఆస్పత్రి కూడా వైద్యసేవలను అందిస్తోంది. తాజాగా నగర శివార్లలోని దామెర క్రాస్‌ రోడ్డు వద్ద అన్ని హంగులతో కూడిన ప్రతిమ క్యాన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటైంది. 350 పడకల ఈ సెం ట్రల్‌ ఎయిర్‌ కండిషన్‌ హాస్పిటల్‌లో క్యాన్సర్‌ చికిత్సకు అవసరమైన అన్ని అత్యాధునిక వైద్యపరికరాలు అందుబాటులో ఉన్నాయి. మొబైల్‌ క్లినిక్‌ కూడా ఉంది. 20 యేళ్లుగా కరీంనగర్‌లో ప్రతిమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ వైద్య విద్య అం దిస్తున్న అనుభవంతో వరంగల్‌ నగరంలో ప్రతిమ రిలీఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ మెడికల్‌ కాలేజీ, హాస్పిటల్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రతిమ గ్రూప్‌ చైర్మన్‌ బోయినిపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం ఆందిస్తున్న ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ సేవలను రోగులకు అందిస్తామన్నారు.


మెడికల్‌ కాలేజీ

ప్రతిమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కాలేజీకి వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అనుమతిని ఇచ్చింది. ఈ కాలేజీ ఏర్పాటుతో విద్యార్థులకు కొత్తగా 150 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు కల్పించనున్నారు. కళాశాలకు అనుబంధంగా 330 పడకల ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు.  ఆస్పత్రితో పాటు మెడికల్‌ కాలేజీకి సంబంధించిన భవన నిర్మాణాలు పూర్తయ్యాయి.  ప్రతిమ గ్రూప్‌ కరీంనగర్‌లో 20 యేళ్లుగా 1100 పడకలతో వైద్య కళాశాలను నిర్వహిస్తోంది. అదే విధంగా 300 పడకలతో హైదరాబాద్‌లోని కాచిగూడ, కూకట్‌పల్లిలో మల్టీస్పెషాలిటీ వైద్యశాలను నడుపుతోంది.

Updated Date - 2022-10-01T05:41:44+05:30 IST