Cm Kcr Astrology Horoscope: కేసీఆర్ పాలన విషయంలో మరో చిక్కు?

ABN , First Publish Date - 2022-09-01T01:27:33+05:30 IST

సీఎం కేసీఆర్‌కు జ్యోతిషం, జాతకాలపై అపారమైన నమ్మకం. ఇక వాస్తుపై కేసీఆర్‌కు ఉన్నంత విశ్వాసం మరే సీఎంకు ఉండదేమో.. కేసీఆర్‌కు వాస్తు పిచ్చి ఎక్కువగా ఉందని...

Cm Kcr Astrology Horoscope: కేసీఆర్ పాలన విషయంలో మరో చిక్కు?

హైదరాబాద్ (Hyderabad): సీఎం కేసీఆర్‌ (Cm Kcr)కు జ్యోతిషం, జాతకాల (Astrology Horoscopes)పై అపారమైన నమ్మకం. ఇక వాస్తుపై కేసీఆర్‌కు ఉన్నంత విశ్వాసం మరే సీఎంకు ఉండదేమో.. కేసీఆర్‌కు వాస్తు పిచ్చి ఎక్కువగా ఉందని.. వాస్తు భయంతోనే సచివాలయానికి వెళ్లడం లేదని విపక్షాలు ఎంతగా విమర్శించినా ఆయన పట్టించుకోలేదు. అభ్యంతరాలు, ఆరోపణలు వెల్లువెత్తినా కొత్త సచివాలయం నిర్మాణం కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను పరిశీలించారు. విపక్షాలు విమర్శించినా.. కోర్టు మొట్టికాయలు వేసినా కేసీఆర్ లెక్క చేయలేదు. చివరకు పాత సచివాలయాన్ని కూలదోసి కొత్త నిర్మాణాలకు పూనుకున్నారు.


పరిపాలనా వ్యవస్థలతో ఐకాన్‌ భవనంగా సచివాలయం

పరిపాలనా వ్యవస్థలతో ఐకాన్‌ భవనంగా సచివాలయాన్ని నిర్మించాలని కేసీఆర్‌ తలపోశారు. ఇందుకోసం పలు డిజైన్లను పరిశీలించారు. నిర్మాణ కాంట్రాక్ట్‌ను కమాండ్‌ కంట్రోల్‌ భవనాన్ని నిర్మించిన .. షాపూర్‌ జీ పల్లోంజి సంస్థ (Shapoorji Pallonji Group)నే దక్కించుకుంది. ఇక కొత్త సచివాలయాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సకల సదుపాయాలతో నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. దాంతో సచివాలయ భవంతిని కేవలం రెండు ఏళ్ల వ్యవధిలోనే పూర్తి చేయాలని మొదట భావించారు. అయితే కరోనా, ఇతర కారణాల కారణంగా నిర్మాణం వాయిదా పడింది.


సచివాలయానికి వెళ్లే విషయంలో..

అయితే సచివాలయానికి వెళ్లే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు తీవ్రస్థాయికి చేరాయి. మరోవైపు నిర్మాణ అంచనాలు కూడా పెరిగాయి. దాంతో అనుకున్న సమయానికి సచివాలయ భవనం పూర్తవుతుందా అనే సంశయాలు టీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలను చుట్టుముట్టాయి. ఆ తర్వాత కరోనా తగ్గుముఖం పట్టడంతో నిర్మాణ పనులు మొదలయ్యాయి.. వేగం కూడా పెరిగింది. అయితే ఇప్పుడు మరో చిక్కు వచ్చిందట.. ఇక పనుల పూర్తి, ప్రారంభంతో పాటు పాలన విషయంలో కేసీఆర్‌కు జ్యోతిషులు సూచనలు చేశారట. లేదంటే చిక్కులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారట.


 కేసీఆర్‌‌లో టెన్షన్...

సహజంగానే వాస్తులు , దోషాలు, యజ్ఞయాగాలను ఎక్కువగా నమ్మే కేసీఆర్‌కు జ్యోతిషులు చెప్పిన మాటలు టెన్షన్‌ పుట్టిస్తున్నాయట. ఆయనకు కొత్తగా 90రోజుల భయం పట్టుకుందట. అనుకున్న సమయానికి సచివాలయం ప్రారంభించాలన్న జ్యోతిషుల మాటలపై కేసీఆర్‌ సీరియెస్‌గా దృష్టి పెట్టారట. దసరాకు కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని.. అక్కడి నుంచి 90రోజుల పాటు పరిపాలన చేసి అనంతరం ముందస్తు ఎన్నికలకు వెళ్తే కేసీఆర్‌కు అనూహ్య విజయం చేకూరుతుందని జ్యోతిష్యులు చెప్పారట. దీంతో ఎలాగైనా ఈ విజయ దశమిలోగా నిర్మాణ పనులు పూర్తిచేయాలని లేదంటే.. కనీసం తన ఛాంబర్ అయినా సిద్దం చేయాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారని తెలుస్తోంది. ఇందుకోసం మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇతర కార్యక్రమాల్ని పక్కన పెట్టి కేవలం సెక్రటేరియట్ పనులపై మాత్రమే నిమగ్నమయ్యారు.


దసరాకు నిర్మాణ పనులు పూర్తి..!

దసరాకు నిర్మాణ పనులు పూర్తి చేయాలన్న టార్గెట్‌‌లో భాగంగా ఇప్పటికే ఎనిమిది సార్లు కేసీఆర్ కొత్త సెక్రెటరీయేట్‌ను విజిట్ చేశారు. మరోవైపు దసరా నాటికి కొత్త సచివాలయం ఆరో అంతస్తులో కేసీఆర్‌ ఛాంబర్‌ను ప్రారంభించేలా అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. అయితే దసరాకు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉంది. మరోవైపు మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల కానుంది. ఇదంతా పూర్తి కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే మునుగోడు ఉప ఎన్నికతో సంబంధం లేకుండా కొత్త సెక్రెటరియేట్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ సూచించారు.


కేసీఆర్‌కు జ్యోతిషులు చెప్పిన మాటలపై రాజకీయ వర్గాల్లో చర్చ

ఇక సీఎం కేసీఆర్‌కు జ్యోతిషులు చెప్పిన మాటలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొత్త సచివాలయం నుంచి 90రోజుల పాలనతో రాబోయే రోజులు కూడా కేసీఆర్‌కు అనుకూలంగా ఉంటాయనే విషయంపై పలు రకాల ప్రచారం మొదలైంది. 





Updated Date - 2022-09-01T01:27:33+05:30 IST