ఓటర్లకు గడియారాలు

ABN , First Publish Date - 2022-08-25T07:47:29+05:30 IST

రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడన్నది ఇంకా తెలియకపోయినా.

ఓటర్లకు గడియారాలు

మునుగోడులో పంపిణీ చేస్తున్న టీఆర్‌ఎస్‌

కోయలగూడెంలో తిరస్కరించిన ఓటర్లు

గులాబీ ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’కు ఎదురుదెబ్బ!

ఈ నెల 14న టీఆర్‌ఎ్‌సలో చేరిన మునుగోడు మండలం కిష్ణాపురం ఎంపీటీసీ సభ్యుడు సైదులు

క్యాడర్‌ నిలదీయడంతో తిరిగి కాంగ్రెస్‌ గూటికి


నల్లగొండ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడన్నది ఇంకా తెలియకపోయినా.. ప్రలోభాల పర్వం మాత్రం అప్పుడే మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఓవైపు ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను తమ శిబిరంలో చేర్చుకునే పనిని కొనసాగిస్తూనే.. మరోవైపు ఓటర్లకు తాయిలాలు పంపిణీని  ప్రారంభిస్తున్నాయి. సాధారణంగా నోటిఫికేషన్‌ వెలువడ్డాక ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చేపట్టే ఈ తాయిలాల పంపిణీని మునుగోడులో అధికార టీఆర్‌ఎస్‌ అప్పుడే మొదలుపెట్టింది. నియోజకవర్గంలోని ఓటర్లకు గోడ గడియారాల పంపిణీ చేపట్టింది.


ఈ మేరకు చౌటుప్పల్‌ మండలంలోని టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షులకు ఈ గడియారాలు చేరాయి. పెద్ద గ్రామాలకు 800, చిన్నగ్రామాలకు 500, మునిసిపల్‌ వార్డుకు 300 చొప్పున గోడ గడియారాలు చేరినట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ నవ్వుతున్న ఫొటో, దాని కింద పార్టీ గుర్తు అయిన కారు బొమ్మను ముద్రించి ఉన్న ఈ గడియారాల పంపిణీని మంగళవారం రాత్రే ప్రారంభించారు. ఈ నెల 25 లోపు వీటి పంపిణీ పూర్తి చేయాలని పార్టీ నేతలకు ఆదేశాలు అందినట్లు తెలిసింది. కాగా, మండలంలోని కోయలగూడెం గ్రామంలో టీఆర్‌ఎస్‌ నేతలు పంచుతున్న గోడ గడియారాలు తీసుకునేందుకు గ్రామస్థులు నిరాకరించారు. కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు సమయంలో ఈ గ్రామాన్ని రెండు భాగాలుగా విడగొట్టినందుకు నిరసనగానే వారు గడియారాలను తిరస్కరిస్తున్నారు. అధికార పార్టీలోని నేతల ఆధిపత్య పోరులో భాగంగా పెద్ద గ్రామమైన కోయలగూడాన్ని రెండు గ్రామాలుగా విడగొట్టి ఎల్లంబావి అనే కొత్త గ్రామ పంచాయతీని సృష్టించారు. దీన్ని కోయలగూడెం గ్రామస్థులు జీర్ణించుకోలేకపోయారు. అధికార పార్టీ నేతల తీరును నిరసిస్తూ గ్రామ పంచాయతీ ఎన్నికలను సైతం బహిష్కరించారు.

 

కాంగ్రె్‌సను వీడే వారిపై క్యాడర్‌ తిరుగుబాటు..

  మునుగోడు మండలం కిష్ణాపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు భీమనపల్లి సైదులు ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచారు. ఇటీవల టీఆర్‌ఎస్‌ ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’లో భాగంగా ఈ నెల 14న సైదులు ప్రగతిభవన్‌లో గులాబీ కండువా కప్పుకొన్నారు ఈ చర్య గ్రామంలోని కాంగ్రెస్‌ క్యాడర్‌కు ఆగ్రహం తెప్పించింది. ఎంపీటీసీ సభ్యుడు గ్రామానికి చేరుకున్నప్పటి నుంచి వీరు ఆగ్రహంతో ఉన్నారు. మూడు రోజులుగా సైదులును గట్టిగా నిలదీస్తున్నారు. బుధవారం గ్రామ కాంగ్రెస్‌ నేతలంతా సమావేశమై ఆయనపై ఒత్తిడి చేయగా, ‘‘నాకు కాంగ్రెస్‌ పార్టీ అంటే ప్రాణం. ఎటువంటి ప్రలోభాలకు లొంగి పోలేదు. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ పని ఉందంటూ గ్రామ సర్పంచ్‌ ఒత్తిడి చేస్తే వెళ్లాను తీరా ప్రగతి భవన్‌కు తీసుకెళ్లారు. అక్కడ పక్కకు ఉంటానంటే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి బెదిరించి కండువా కప్పారు’’ అని గ్రామస్థులకు సైదులు వివరణ ఇచ్చారు. ఓబీసీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద లింగయ్యయాదవ్‌ ఆయనకు తిరిగి కాంగ్రెస్‌ కండువా కప్పారు.  

Read more