చిలుక్కొయ్యలపాడుపై చిన్నచూపేల..?

ABN , First Publish Date - 2022-10-01T05:51:40+05:30 IST

చిలుక్కొయ్యలపాడుపై చిన్నచూపేల..?

చిలుక్కొయ్యలపాడుపై చిన్నచూపేల..?
మన్నెగూడెం నుంచి చిలుక్కొయ్యలపాడు గ్రామానికి వెళ్లే గుంతలమయమైన రోడ్డు

మినరల్‌ సెస్‌ ద్వారా ప్రభుత్వ ఖాజానాకు రూ.కోట్ల నిధులు

గుంతలమయమైన చిలుక్కొయ్యలపాడు రోడ్డు 

గ్రామంలో మౌలిక వసతుల కరువు

అధికారులు, ప్రజాప్రతినిధులకు పట్టని గ్రామం


డోర్నకల్‌,  సెప్టెంబరు 30: గ్రామ స్వరాజ్యమే.. దేశ స్వరాజ్యం.. భారతదేశమంతా పల్లెల్లోనే ఉంది... పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని మహాత్మాగాంధీ చెప్పిన మాటలు 70 ఏళ్లు గడిచినా అవి పాఠ్యపుస్తకాల్లో కనబడుతూ... నాయకుల ప్రసంగాల్లో వినబడుతూ ఉంటాయి. గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రతీ ఏటా బడ్జెట్‌లో కేటాయిస్తున్న రూ.వేల కోట్ల నిధులు ఎటుపోతున్నాయో.. ఏమవుతున్నాయో.. అంతుబట్టని విషయం. నిత్యం ప్రజా సేవలోనే తనమునకలమయ్యామని మాటలు చెప్పే నాయకుల ఏళ్లు తరబడి అధికారుల నిర్లక్ష్యం వల్ల వెనుకబాటుకు గురైనప్పటికీ సరైన రోడ్డు సౌకర్యం లేని గ్రామం పరిస్థితిని వెలుగులోకి తెస్తోంది ఆంధ్రజ్యోతి...  డోర్నకల్‌ మండలంలోని ఆ గ్రామమే చిలుక్కొయ్యలపాడు...


గ్రామంలో 3 వేల జనాభా...

డోర్నకల్‌ మండల కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో విసిరేసినట్లుగా ఉండే గ్రామం. జనాభా సుమారు మూడు వేలు ఉంటుంది. ఆ గ్రామంలో 8వ తరగతి వరకు మాత్రమే విద్యనభ్యసించే ఒక్క పాఠశాల మాత్రమే ఉంది. రూ.వందల కోట్ల గ్రానైట్‌ నిల్వలు, నిక్షేపాలు కలిగిన ఊరు. మినరల్‌ సెస్‌ ట్యాక్సీల రూపంలో రూ.కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు సమకూరుస్తున్న గ్రామం కానీ, అభివృద్ధిలో మాత్రం ఆమెడ దూరంలో ఉంది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా కార్యక్రమాలు చేపట్టినప్పుడే అధికారులకు, ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులకు డోర్నకల్‌ మండలంలో ఆ గ్రామం ఒకటి ఉందని గుర్తుకు వస్తుంది. మిగతా సమయాల్లో గ్రామాన్ని గానీ... గ్రామ ప్రజల అవసరాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. 


గ్రానైట్‌ క్వారీలు.. నిక్షేపాల పన్నులతో...

గ్రామాల్లో ఉన్న క్వారీల నుంచి లక్షలాది టన్నుల గ్రానైట్‌ తరలిపోతుంది. వాటిపై విధించే సెస్‌, పన్నులను ప్రభుత్వం గ్రామపంచాయతీ ఖాతాలో సరిగ్గా జమచేస్తే చాలు మండలంలోనే అన్ని రంగాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన గ్రామంగా చిలుక్కొయ్యలపాడు నిలుస్తుంది. స్థానిక సంస్థలకు నెలనెలా నిధులు బదలాయిస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలు ఆర్భాటానికి పరిమితమయ్యాయి. చేసిన పనులకు నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అభివృద్ధి పనులు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. మహబూబాబాద్‌ - కోదాడ జాతీయ రహదారి 365/ఏ మీద ఉన్న మన్నెగూడెం నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కడ్నుంచి చిలుక్కొయ్యలపాడుకు చేరుకోవాలంటే సరైన రోడ్డుమార్గం లేదు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం నిర్మించిన తారురోడ్డు గ్రానైట్‌ లారీల బరువుకు దెబ్బతిని అనవాలు లేకుండా పోయింది. తారు లేసి పోవడంతో కంకర, మట్టి పైకి తేలింది. ఆ దారి మీదుగా ప్రయాణించాలంటే వాహానదారులకు నరకం కన్పిస్తోందని వాపోతున్నారు. 


అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యటన కరువు..

అధికారులు, ప్రజాప్రతినిధులు చిలుక్కొయ్యలపాడు అనే ఒక గ్రామం ఉందన్న విషయం కూడా మరిచిపోయారు. తమ బాధలు అధికారులకు పలుసార్లు మొరపెట్టుకున్న వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో వారి బాధలను ‘ఆంధ్రజ్యోతి’ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పించి వాటి రూపురేఖలు మార్చడానికి రూ. కోట్లు ఖర్చు పెడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ ఈ గ్రామాన్ని చూస్తే అవి నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గుంతలమయమైన రోడ్డుపై గ్రానైట్‌ క్వారీల యాజమానులు వారి వాహనాలు వెళ్లడానికి మట్టిపోస్తున్నారే తప్పా ప్రభుత్వం మాత్రం గుంతలు కూడా పూడ్చకపోవడంతో నానా ఇబ్బం దులు పడుతున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చిన్న జిల్లాల ద్వారా పాలన వికేంద్రీకరణ జరిగి అభివృద్ధి జరుగుతుందే మోనని ఆశించిన ఆ గ్రామస్థులకు ఎప్పటికీ నిరాశే మిగులుతోంది. ఎవరైనా అధికారులు రాకపోతారా... ప్రజాప్రతినిధులు తమ గోడు వినకపోతారా... మా ఊరును బాగు చేయకపోతారా అంటూ ఆ ఊరి ప్రజలు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు.  అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ ఊరి పై దృష్టి సారించలని గ్రామస్థులు కోరతున్నారు. 


గ్రామాన్ని బాగు చేయండి : ఉడుగుల వెంకన్న, చిలుక్కొయ్యలపాడు 

డోర్నకల్‌ మండలంలో చిలుక్కొయ్యాలపాడు గ్రామానికి ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు, పథకాల పేరుతో అధికారులు అప్పుడప్పుడు మాత్రమే వస్తున్నారు. గ్రామానికి రావాలంటే సరైన రోడ్డు సౌకర్యం లేదు. దీంతోపాటు గ్రామంలో సైడ్‌ కాల్వలు, వీధిలైట్లు, తాగునీరుతో పాటు ఇతర మౌలిక సదుపాయలు లేవు. పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు మా గ్రామాన్ని సందర్శించి రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలి. 

Read more