కాళేశ్వరం డీపీఆర్‌ను పరిశీలించండి

ABN , First Publish Date - 2022-10-14T09:20:12+05:30 IST

కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి సవరించిన డీపీఆర్‌ను పరిశీలించాలని గోదావరి నది యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ)ను కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఆదేశించింది.

కాళేశ్వరం డీపీఆర్‌ను పరిశీలించండి

గోదావరి బోర్డుకు సీడబ్ల్యూసీ ఆదేశం.. డీపీఆర్‌లన్నీ ఆమోదం పొందేలా చూడండి: రజత్‌ కుమార్‌ 


హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి సవరించిన డీపీఆర్‌ను పరిశీలించాలని గోదావరి నది యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ)ను కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఆదేశించింది. ప్రాజెక్టుపై న్యాయస్థానాల్లో కేసులు ఉన్నందున తాము డీపీఆర్‌ను చూడబోమని గతంలోనే తెలంగాణకు జీఆర్‌ఎంబీ లేఖ రాసిం ది. అయితే, డీపీఆర్‌ పరిశీలనకు, కోర్టు కేసులకు ఏం సంబంధమని గోదావరి బోర్డు తీరు పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. బోర్డుతో పాటు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు తెలంగాణ ఇదివరకే లేఖ రాసింది. దాంతో తె లంగాణ డీపీఆర్‌ను పరిశీలించాలని బోర్డుకు సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది.కాస్ట్‌ బెన్‌ఫిట్‌ రేషియో, హైడ్రాలజీ అనుమతులు తీసుకున్న అనంతరం కాళేశ్వరం సవరణ డీపీఆర్‌ కొన్ని రోజుల క్రితం గోదావరి బోర్డుకు చేరింది. తాజాగా సీడబ్ల్యూసీ ఆదేశాలతో పరిశీలన అనంతరం ఈ డీపీఆర్‌ మళ్లీ కేంద్రానికి చేరనుంది. గోదావరి బోర్డు పరిశీలన అనంతరమే రోజుకు 2 టీఎంసీలు తరలించే ప్రధాన పథకంతో పాటు అదనంగా ఒక టీఎంసీ తరలించే పనులను ఒకే ప్రాజెక్టుగా పరిగణనలోకి తీసుకుంటూ గెజిట్‌ను సవరించాలా..? లేక రెండింటినీ వేర్వేరు ప్రాజెక్టులుగా పరిగణించాలా..? అన్న దానిపై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది.


త్వరలో గోదావరి బోర్డు సమావేశం..

త్వరలో జీఆర్‌ఎంబీ సమావేశం జరగనుంది. అనుమతుల కోసం, అనుమతి లేని జాబితాలో చేర్చిన ప్రాజెక్టులను గెజిట్‌ నుంచి తొలగించాలని కోరుతూ తెలంగాణ సమర్పించిన మూడు డీపీఆర్‌లపై భేటీలో చర్చించనున్నారు. ప్రస్తుతం బోర్డులో మొండికుంటవాగు, గూడెం ఎత్తిపోతల పథకం డీపీఆర్‌లు ఉండగా.. వారం రోజుల్లో సీతారామ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ రానుంది. ఈ డీపీఆర్‌కు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చి, రెండు మూడు రోజుల్లో గోదావరి బోర్డుకు పంపించనున్నట్లు సమాచారం కూడా ఇచ్చింది. ఇక సీడబ్ల్యూసీలో ఉన్న సమ్మక్క బ్యారేజీ(తుపాకులగూడెం) డీపీఆర్‌ రాక కొంత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. గెజిట్‌ అమలులో భాగంగా ప్రాజెక్టుల డీపీఆర్‌లను అప్పగించాలని గోదావరి బోర్డు తెలుగు రాష్ట్రాలను మరోమారు కోరనుంది. కాగా, కడెం ప్రాజెక్టు ఆయకట్టు స్థిరీకరణలో భాగంగానే గూడెం ఎత్తిపోతల పథకం ఉందని, దీన్ని ప్రత్యేక ప్రాజెక్టుగా చూడకూడదని తెలంగాణ ఇదివరకే కోరగా.. దీనిపై బోర్డు సమావేశంలో పరిశీలించి, నివేదికను సీడబ్ల్యూసీకి పంపించనుంది. గోదావరి ప్రాజెక్టుల అనుమతి కోసం దాఖలు చేసిన డీపీఆర్‌లన్నీ క్లియరెన్స్‌లు పొందేలా చర్యలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ అధికారులకు స్పష్టం చేశారు. డీపీఆర్‌ల పురోగతిపై గురువారం జలసౌధలో నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. చనాకా కొరటా, చిన్న కాళేశ్వరం(ముక్తేశ్వర్‌), చౌటపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లపై చర్చించడానికి వీలుగా సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ)ని సమావేశపరచాలని కేంద్ర జలశక్తి శాఖను కోరుతూ లేఖ రాయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 27న జీఆర్‌ఎంబీ సమావేశంలో సాంకేతిక పరిశీలన పూర్తి చేసుకున్న మూడు డీపీఆర్‌లు కేంద్రానికి చేరినప్పటికీ అనుమతులపై సమాచారం లేదని, దీనిపై లేఖ రాయాలని రజత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం సవరణ డీపీఆర్‌ పరిశీలనకు కేంద్రం ఆదేశాలు ఇచ్చినందున తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల ప్రక్రియపై కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల మదింపు కమిటీ(ఈఏసీ) పరిశీలనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డీపీఆర్‌ల పురోగతిపై ఆరా తీశారు. కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ ప్రకారం అనుమతి లేని ప్రాజెక్టులెన్ని..? వాటిలో జాబితా నుంచి తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన డీపీఆర్‌లెన్ని..? ఏయే డీపీఆర్‌లు ఏయే ఏయే దశలో ఉన్నాయని తెలుసుకున్నారు.

Updated Date - 2022-10-14T09:20:12+05:30 IST