క్యాసినో హవాలా గుట్టు వీడేనా?

ABN , First Publish Date - 2022-08-01T08:31:31+05:30 IST

సంచలనం సృష్టించిన క్యాసినో వ్యవహారంలో ప్రధాన నిందితులైన చీకోటి ప్రవీణ్‌, మాధవరెడ్డి, వారితోపాటు ట్రావెల్‌ ఏజెంట్‌ సంపత్‌ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌..

క్యాసినో హవాలా గుట్టు వీడేనా?

నేడు ఈడీ ఎదుటకు ప్రవీణ్‌, మాధవ్‌రెడ్డి, సంపత్‌

చీకోటికి ప్రాణహిని అంటూ కుటుంబసభ్యుల ఆందోళన

ప్రవీణ్‌, సంపత్‌తో అంబర్‌పేట ఎమ్మెల్యే.. మీడియాలో వైరల్‌


హైదరాబాద్‌, జూలై 31(ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన క్యాసినో వ్యవహారంలో ప్రధాన నిందితులైన చీకోటి ప్రవీణ్‌, మాధవరెడ్డి, వారితోపాటు ట్రావెల్‌ ఏజెంట్‌ సంపత్‌ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరు కానున్నారు. విదేశాల్లో క్యాసినోలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై వివరణ ఇవ్వాలంటూ ఈడీ వారికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గోవాలో ప్రవీణ్‌, మాధవ రెడ్డి నిర్వహిస్తున్న బిగ్‌డాడీ క్యాసినో వివరాలతో పాటు, వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల స్టేట్‌మెంట్‌లను కూడా తీసుకురావాలని ఆదేశించింది. నోటీసుల్లో పేర్కొన్న విధంగా హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు సోమవారం హాజరవుతామని ప్రవీణ్‌, మాధవ్‌రెడ్డి, సంపత్‌  అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. వారితో పాటు మరో ఇద్దరు హవాలా ఏజెంట్లు విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయి.


వారందరినీ ఈడీ అధికారులు వేర్వేరుగా విచారించనున్నారు. నేపాల్‌, శ్రీలంక, తదితర దేశాల్లో క్యాసినోలను నిర్వహించిన చీకోటి ప్రవీణ్‌..   ఇప్పటివరకు 1500 మంది జూదరులను విదేశాలకు తీసుకెళ్లినట్లు గుర్తించిన నేపథ్యంలో చీకోటి కేంద్రంగానే ఈడీ ఈ విచారణ చేయనున్నట్టు సమాచారం. రాజకీయ నాయకులతో ఉన్న ఆర్థిక సంబంధాలపైన.. నేపాల్‌ క్యాసినోలో బాలీవుడ్‌, టాలీవుడ్‌ ప్రముఖులకు చేసిన చెల్లింపులపైన, క్యాసినోలో గెలిచిన జూదరులకు హవాలా మార్గంలో నగదు చెల్లింపులపైన ప్రధానంగా ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. కాగా.. చీకోటి ప్రవీణ్‌కు ప్రాణహాని ఉందని అతడి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తమ ఇంటి దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు తిరుగుతున్నారని.. ప్రవీణ్‌కు భద్రత కల్పించాలని కోరుతూ ఈడీ అధికారులతో పాటు స్థానిక పోలీసులనూ వారు సంప్రదించినట్లు తెలిసింది. మరోవైపు.. చీకోటికి సన్నిహితుడైన ట్రావెల్‌ ఏజెంట్‌ సంపత్‌, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో దిగిన ఫొటో ఆదివారం సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అయ్యింది. సంపత్‌ ఇంట్లో జరిగిన ఒక కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరైనప్పటి ఫొటో అది. దీంతో.. సంపత్‌ ఇంటికి ఎమ్మెల్యే ఎందుకు వెళ్లారు? వారి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే అంశాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. 

Read more