అప్పు తీసుకొని.. ఎగ్గొట్టిన నరేశ్‌ భార్య!

ABN , First Publish Date - 2022-02-23T09:24:51+05:30 IST

సినీనటుడు వీకే నరేష్‌ భార్య రమ్య రఘుపతి తమ వద్ద అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదంటూ...

అప్పు తీసుకొని.. ఎగ్గొట్టిన నరేశ్‌ భార్య!

రూ.45 లక్షలు తిరిగి ఇవ్వడంలేదు

సినీ నటుడు నరేశ్‌ భార్య రమ్యపై ఐదుగురు మహిళల ఫిర్యాదు

తనకు సంబంధం లేదన్న నరేశ్‌!


రాయదుర్గం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): సినీనటుడు వీకే నరేష్‌ భార్య రమ్య రఘుపతి తమ వద్ద అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదంటూ ఐదుగురు మహిళలు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరిత అనే మహిళతోపాటు మరో నలుగురు కలిసి చేసిన ఈ ఫిర్యాదులో.. రమ్య రఘుపతి తనకు ఎనిమిదేళ్ల క్రితం సినీనటుడు నరేశ్‌తో వివాహమైందని చెప్పినట్లు,  అప్పటినుంచి నానక్‌రామ్‌గూడలో నివాసముంటూ తాను నరేశ్‌ భార్యను, విజయనిర్మల కోడలిని అని ప్రచారం చేసుకున్నట్లు తెలిపారు. నరేశ్‌కు చెందిన ఆస్తులు తనవేనని, తాను బెంగళూరు, హైదరాబాద్‌లలో పరిశ్రమలు నడుపుతున్నానని, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని  చెప్పడంతో తాము నమ్మినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో రమ్య రఘుపతి తమ ఐదుగురి వద్ద రూ.45 లక్షలను 20 శాతం వడ్డీకి అప్పు తీసుకున్నారని, కానీ.. తిరిగి చెల్లించలేదని తెలిపారు. ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అయ్యాయని పేర్కొన్నారు. ఆమె నుంచి తమ డబ్బును తిరిగి ఇప్పించాలని ఫిర్యాదులో బాధితులు కోరారు. కాగా, ఫిర్యాదును స్వీకరించామని, న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళతామని ఇన్‌స్పెక్టర్‌ సురేశ్‌ తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆ అప్పులకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, గతంలోనూ రమ్య ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని నటుడు నరేశ్‌ పోలీసులకు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ నేత రఘువీరారెడ్డి సోదరుడి కూతురు అయిన రమ్యను నరేశ్‌ ఎనిమిదేళ్ల క్రితం మూడో వివాహం చేసుకున్నారు. అయితే కొంతకాలంగా వారు వేర్వేరుగా ఉంటున్నట్లు సమాచారం. 

Read more