నమ్మలేకపోయా!

ABN , First Publish Date - 2022-08-19T07:29:33+05:30 IST

బిల్కిస్‌ బానో కేసులో దోషుల విడుదలపై ముఖ్యమంత్రి కార్యదర్శి, ఐఏఎస్‌ అధికారి స్మిత సభర్వాల్‌ స్పందించారు.

నమ్మలేకపోయా!

బిల్కిస్‌ బానో కేసులో దోషుల విడుదల వార్త చదివి అపనమ్మకంతో అలా కూర్చుండిపోయా

ముఖ్యమంత్రి కార్యదర్శి స్మిత సభర్వాల్‌ ట్వీట్‌

పంద్రాగస్టు రోజే గ్యాంగ్‌ రేప్‌ దోషుల విడుదలా?: కవిత

సన్మానించడానికి వాళ్లేమైనా యుద్ధవీరులా: కేటీఆర్‌

వారందరినీ మళ్లీ జైలుకు పంపండి: అసదుద్దీన్‌


హైదరాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): బిల్కిస్‌ బానో కేసులో దోషుల విడుదలపై ముఖ్యమంత్రి కార్యదర్శి, ఐఏఎస్‌ అధికారి స్మిత సభర్వాల్‌ స్పందించారు. ఆ వార్తను చదివాక.. ఒక మహిళగా, ఒక సివిల్‌ సర్వెంట్‌గా దాన్ని నమ్మలేక అలా కూర్చుండిపోయానని ట్వీట్‌ చేశారు. స్వేచ్ఛగా, భయం లేకుండా జీవించడానికి ఆమెకు ఉన్న హక్కును మనం తిరస్కరించలేమని.. అలా చేసి మనది స్వేచ్ఛాయుత దేశంగా చెప్పుకోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో దోషుల విడుదలను నిరసిస్తూ బిల్కి్‌సబానో విడుదల చేసిన ప్రకటనను స్మిత పోస్ట్‌ చేశారు. మరోవైపు.. గ్యాంగ్‌ రేప్‌ కేసు దోషులను పంద్రాగస్టు నాడే విడుదల చేయడమేమిటని గుజరాత్‌ సర్కారుపై ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. దేశమంతా స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకొంటున్న వేళ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం.. స్వాతంత్య్ర దినోత్సవానికే కళంకమని అన్నారు. జైలు నుంచి విడుదలైన అత్యాచార దోషులు, హంతకులను సన్మానించడం సభ్యసమాజానికే చెంపపెట్టని ఆగ్రహం వెలిబుచ్చారు. ఒక మహిళగా బిల్కిస్‌ బానో బాధను, భయాన్ని తాను అర్థం చేసుకోగలనని కవిత ట్వీట్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే.. న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలగాలంటే గుజరాత్‌ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కవిత డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై మంత్రి కేటీఆర్‌ గురువారం మరోమారు స్పందించారు. ‘‘హేయమైన నేరానికి పాల్పడి జైలుకెళ్లిన దోషులను సన్మానించడానికి వాళ్లేమైనా యుద్ధవీరులా, స్వాతంత్ర సమరయోధులా?’’ అని ప్రశ్నించారు. నేడు బిల్కిస్‌ బానోకు జరిగింది రేపు మనలో ఎవరికైనా జరగవచ్చని, దీనిపై దేశం స్పందించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. ఇక.. బిల్కిస్‌ బానో కేసు దోషుల విడుదల ఉత్తర్వులను తక్షణం రద్దు చేయాలని  ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు. ఆమెకు న్యాయం చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో మొత్తం పదకొండు మంది దోషులనూ తిరిగి జైలుకు పంపాలన్నారు.

Updated Date - 2022-08-19T07:29:33+05:30 IST