Cancer boom: క్యాన్సర్‌ విజృంభణ

ABN , First Publish Date - 2022-12-12T03:58:55+05:30 IST

దేశంలో క్యాన్సర్‌ మహమ్మారి విజృంభిస్తోంది. నేషనల్‌ క్యాన్సర్‌ రిజిస్ట్రీ ప్రొగ్రామ్‌లో నమోదైన వివరాల మేరకు క్యాన్సర్‌ కేసుల సంఖ్య ఏటా పెరుగుతున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లోక్‌సభకు తెలిపింది.

Cancer boom: క్యాన్సర్‌ విజృంభణ

దేశంలో ఏటా పెరుగుతున్న కేసులు, మరణాలు

13వ స్థానంలో తెలంగాణ.. 9వ స్థానంలో ఏపీ

లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ

హైదరాబాద్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): దేశంలో క్యాన్సర్‌ మహమ్మారి విజృంభిస్తోంది. నేషనల్‌ క్యాన్సర్‌ రిజిస్ట్రీ ప్రొగ్రామ్‌లో నమోదైన వివరాల మేరకు క్యాన్సర్‌ కేసుల సంఖ్య ఏటా పెరుగుతున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లోక్‌సభకు తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నమోదైన కేసులు, మరణాల వివరాలను కూడా వెల్లడించింది. 2020లో దేశంలో 13.92 లక్షల క్యాన్సర్‌ కేసులున్నట్లు తెలిపింది. 2025 నాటికి ఆ సంఖ్య 15.69 లక్షలకు పెరుగుతుందని (దాదాపు 12.8ు పెరుగుదల) అంచనా వేసింది. ఈ నేపథ్యంలో.. కొత్తగా ఏర్పాటు చేయబోయే అన్ని ఎయిమ్స్‌ ఆస్పత్రుల్లో ఆంకాలజీ సేవలను అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించింది. అలాగే ప్రధాన మంత్రి స్వస్థసురక్షా యోజన(పీఎంఎ్‌సఎ్‌సవై) కింద అప్‌గ్రేడ్‌ అయిన జిల్లా ఆస్పత్రుల్లోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించింది.

ప్రస్తుతం 22 ఏయిమ్స్‌లలో క్యాన్సర్‌ చికిత్స అందిస్తున్నామని.. 13 రాష్ట్రాల్లో ప్రభుత్వ వైద్యవిద్య కళాశాలల్లో పీఎంఎ్‌సఎ్‌సవై కింద క్యాన్సర్‌ చికిత్సా సౌకర్యాన్ని కల్పించబోతున్నామని వివరించింది. ఇప్పటికే దేశంలో 19 రాష్ట్రాల్లో స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లను, అలాగే పలు రాష్ట్రాల్లో 20 చోట్ల టెరిటరీ క్యాన్సర్‌ కేర్‌ సెంటర్స్‌ ద్వారా రోగులకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నామని తెలిపింది. అలాగే ఆయుష్మాన్‌ భారత్‌ కింద కూడా క్యాన్సర్‌ రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నామని.. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కింద రాష్ట్రప్రభుత్వాల సహకారంతో క్యాన్సర్‌ రోగులకు తక్కువ ధరలకే జనరిక్‌ మెడిసిన్స్‌ను అందిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది.

మన రాష్ట్రంలో..

కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. క్యాన్సర్‌ కేసుల పెరుగుదల, మరణాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో 13వ స్థానంలో ఉంది. క్యాన్సర్‌ కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌ 9వ స్థానంలో ఉంది. ఇప్పటికే తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేస్తున్న కేసుల్లో క్యాన్సర్‌ కేసులు మొదటిస్థానంలో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ నిధుల్లో సింహభాగం క్యాన్సర్‌, గుండె, కిడ్నీ వైద్య చికిత్సలకే వైద్య, ఆరోగ్య శాఖ వెచ్చిస్తోంది. మిగతా రాష్ట్రాల విషయానికి వస్తే..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 14,61,427 క్యాన్సర్‌ కేసులున్నాయి. వీటిలో 5,55,530 కేసులు నాలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి.

లక్షకుపైగా కేసులున్న రాష్ట్రాల వరుసలో ఉత్తరప్రదేశ్‌(210958), మహారాష్ట్ర (121717), పశ్చిమ బెంగాల్‌ (113581), బీహార్‌ (109274) ఉన్నాయి. ఆ తర్వాత తమిళనాడు, కర్నాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలున్నాయి.

క్యాన్సర్‌ మరణాల విషయానికొస్తే ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, తమిళనాడు, కర్నాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 2020, 2021, 2022

సంవత్సరాల్లో కేన్సర్‌ కేసులు మరణాల సంఖ్యను పరిశీలిస్తే..

తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌

2020 2021 2022 2020 2021 2022

కేసులు

47620 48775 49983 70424 71970 73536

మరణాలు

26038 26681 27339 38582 39443 40307

Updated Date - 2022-12-12T03:58:56+05:30 IST