ఈ ఒక్కరోజు మద్యం భారీగా కొనండి!

ABN , First Publish Date - 2022-09-30T08:56:13+05:30 IST

అబ్కారీశాఖ భారీ ఆదాయంపై కన్నేసిందా? దసరా నేపథ్యంలో మరింత పెద్ద మొత్తంలో మద్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకుంటోందావ...

ఈ ఒక్కరోజు మద్యం భారీగా కొనండి!

  • షాపు యజమానులపై అబ్కారీ అధికారుల ఒత్తిడి
  • దసరా నేపథ్యంలో టార్గెట్లు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): అబ్కారీశాఖ భారీ ఆదాయంపై కన్నేసిందా? దసరా నేపథ్యంలో మరింత పెద్ద మొత్తంలో మద్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకుంటోందా? ఏమోగానీ మద్యం భారీగా కొనండి అంటూ వైన్‌షాపు యజమానులపై ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఫలానా మొత్తంలో కొనాలాంటూ గ్రామాలు, పట్టణాలవారీగా టార్గెట్లు పెట్టారు. ఇదంతా శుక్రవారం (30వ తేదీ) కోసమే పరిమితం! శుక్రవారంతో సెప్టెంబరు నెల ముగుస్తుండటంతో ఆ రోజు భారీగా డీడీలు కట్టించుకొని స్టాకును అంటగట్టడం ద్వారా ఆ నెల టార్గెట్‌ను పూర్తి చేసుకోవాలని ఆబ్కారీ అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ‘మీ గోదాంలో స్టాకు ఎంత ఉందనే విషయంతో మాకు సంబంధం లేదు.. మీకు ఎంత అవసరం ఉందో కూడా తెలియదు. కానీ దసరా పండుగ నేపథ్యంలో పెద్ద మొత్తంలో స్టాకు కొనాల్సిందే’నని దుకాణాదారులకు స్పష్టం చేస్తున్నారు. గ్రామాల్లోనైతే అయితే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు, పట్టణాల్లో అయితే రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా స్టాకు కొనాల్సిందేనని పట్టుబడుతున్నారు. అయితే మద్యం షాపు యజమానుల వాదన మరోలా ఉంది.


దసరా నేపథ్యంలో ఇప్పటికే స్టాకు కొన్నాం అని.. అదే సరిపోతుందని, ఇలా టార్గెట్లు పెడితే ఎలా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరా పండగ నేపథ్యంలో ఇప్పటికే తమ గొడౌన్‌లను మద్యం స్టాకుతో నింపి పెట్టుకున్నామని, తాజాగా ఎక్సైజ్‌ శాఖ అధికారుల బెదిరింపులతో ఏం చేయాలో తోచడం లేదని ఓ వ్యాపారి చెప్పారు. ఒకవేళ అధికారుల మాటను కాదని కొనుగోలు చేయకుంటే ఆ తర్వాత వేధిస్తారేమోనని ఆవేదన వ్యక్తం చేశాడు.  

Updated Date - 2022-09-30T08:56:13+05:30 IST