బ్రిటన్‌ రాణికి భాగ్యనగరంతోనూ బంధం

ABN , First Publish Date - 2022-09-10T08:40:11+05:30 IST

క్వీన్‌ ఎలిజబెత్‌-2కు హైదరాబాద్‌తో ఆత్మీయ అనుబంధం ఉంది. మూడు సార్లు భారత్‌కు విచ్చేసిన క్వీన్‌ ఎలిజబెత్‌..

బ్రిటన్‌ రాణికి భాగ్యనగరంతోనూ బంధం

1983లో హైదరాబాద్‌లో పర్యటించిన క్వీన్‌ ఎలిజబెత్‌ దంపతులు 

అల్వాల్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): క్వీన్‌ ఎలిజబెత్‌-2కు హైదరాబాద్‌తో ఆత్మీయ అనుబంధం ఉంది. మూడు సార్లు భారత్‌కు విచ్చేసిన క్వీన్‌ ఎలిజబెత్‌.. 1983 పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు విచ్చేశారు. ఆ ఏడాది నవంబరు 20న నగరానికి వచ్చిన రాణి దంపతులకు అప్పటి సమైక్య రాష్ట్ర గవర్నర్‌ రామ్‌లాల్‌, ముఖ్యమంత్రి నందమూరి రామారావు స్వాగతం పలికారు. నాలుగు రోజులు పాటు సాగిన ఈ పర్యటనలో నగరంలోని  బీహెచ్‌ఈఎల్‌, ఇక్రిశాట్‌, కుతుబ్‌షాహి సమాధులను సందర్శించారు. అదే విధంగా సికింద్రాబాద్‌, బొల్లారంలోని హోలీట్రినిటీ చర్చికి కూడా వెళ్లారు. తమ 36వ వివాహ వార్షికోత్సవాన్ని ఎలిజబెత్‌ దంపతులు ఈ చర్చిలోనే జరుపుకున్నారు. క్వీన్‌ విక్టోరియా ఇచ్చిన నిధులతో 1847లో ఈ చర్చిని నిర్మించారు. క్వీన్‌ విక్టోరియా ముని మనవరాలైన క్వీన్‌ ఎలిజబెత్‌-2.. బిష్‌పల ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆ చర్చికి వెళ్లారు. క్వీన్‌ ఎలిజబెత్‌-2 హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా అప్పటి ఆంధ్రజ్యోతి విలేకరి నారీశెట్టి ఇన్నయ్య ఆమెను ప్రత్యేకంగా కలిశారు. 


నిజాం రాజు అరుదైన కానుక.. 

క్వీన్‌ ఎలిజబెత్‌-2 వివాహం 1947లో జరిగింది. ఈ సందర్భంగా అప్పటి నిజాం ప్రభువు. ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌అలీఖాన్‌ ఆమెకు అత్యంత విలువైన వజ్రాలహారాన్ని బహుమతిగా అందజేశారు. లండన్‌కు చెందిన నగల తయారీ సంస్థ కార్టియర్‌ ప్రతినిధులను రాణి వద్దకు పంపిన నిజాం ప్రభువు.. కానుకను ఎంచుకోవాలని కోరారు. దీంతో 300 వజ్రాలు పొదిగిన ఓ ప్లాటినం నెక్లె్‌సను ఆమెను ఎంపిక చేసుకున్నారు. క్వీన్‌ ఎలిజబెత్‌-2 వివిధ సందర్భాల్లో ఆ హారాన్ని ధరించి కనిపించారు. 

Updated Date - 2022-09-10T08:40:11+05:30 IST