30 నుంచి బోనాలు

ABN , First Publish Date - 2022-06-07T08:43:26+05:30 IST

నగరంలో ఈ నెల 30వ తేదీన బోనాలు ప్రారంభమవుతాయని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.

30 నుంచి బోనాలు

ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు

రూ.15 కోట్లు కేటాయింపు: తలసాని


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): నగరంలో ఈ నెల 30వ తేదీన బోనాలు ప్రారంభమవుతాయని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు చాటి చెప్పేలా ఘనంగా బోనాలు నిర్వహిస్తామని, ఇందుకోసం ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని చెప్పారు. బోనాల ఉత్సవాలపై సోమవారం నాడిక్కడ మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో కలిసి వివిధ విభాగాల అధికారులతో తలసాని సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 30వ తేదీన గోల్కొండ, 17న సికింద్రాబాద్‌ మహాంకాళి, 24న హైదరాబాద్‌లో బోనాలు జరుగుతాయన్నారు.


హైదరాబాద్‌ బోనాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ రాష్ట్ర పండుగగా ప్రకటించి వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున సహకరిస్తున్నారని చెప్పారు. కరోనా వల్ల గత రెండేళ్లు పండుగను ఘనంగా జరుపుకోలేక పోయామన్నారు. దేవాదాయ శాఖ ఆధీనంలోని ఆలయాలతో పాటు 3 వేల దేవాలయాలకు ఆర్థిక సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. రహదారుల మరమ్మత్తు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించామన్నారు. నగరంలోని 26 దేవాలయాల్లో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుందన్నారు. అమ్మ వారి ఊరేగింపునకు ప్రత్యేక అంబారీలు ఉంటాయని, ఈ ఖర్చును సర్కారు భరిస్తుందని చెప్పారు. పలు ఆలయాల వద్ద ఎల్‌ఈడీ స్ర్కీన్లు, త్రీడీ మ్యాపింగ్‌ ఏర్పాటు చేస్తామని, వేదికలపై సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలు జరిగేలా ప్రభుత్వ విభాగాలకు ప్రజలు సహకరించాలని కోరారు.

Updated Date - 2022-06-07T08:43:26+05:30 IST