కేసీఆర్‌కు మతిభ్రమించింది

ABN , First Publish Date - 2022-07-18T08:47:11+05:30 IST

సీఎం కేసీఆర్‌కు మతిభ్రమించినట్లుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఆయనను వెంటనే ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వెనుక

కేసీఆర్‌కు మతిభ్రమించింది

భారీ వర్షాలపై వ్యాఖ్యలు ఈ శతాబ్దపు జోక్‌

విదేశీ కుట్ర ఉందనడం సీఎం కొత్త డ్రామా: సంజయ్‌

ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే యత్నం

కుట్రలకే అతిపెద్ద కుట్రదారు కేసీఆర్‌: సంజయ్‌

శ్రేణులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపు

శవరాజకీయాలకే టీఆర్‌ఎస్‌ ప్రాధాన్యం: డీకే అరుణ


న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌కు మతిభ్రమించినట్లుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఆయనను వెంటనే ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్య ఈ శతాబ్దపు జోక్‌ అని ఆదివారం ఒక ప్రకటనలో సంజయ్‌ విమర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన.. బాధితులకు భరోసా కలిగించాలని, కానీ.. ఆయన వ్యాఖ్యలు జోకర్‌ను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ‘‘గోదావరికి వరదలు గతంలో వచ్చాయి. ఇప్పుడు వచ్చాయి.. భవిష్యత్తులోనూ రావని చెప్పలేం. కానీ, కేసీఆర్‌కు మాత్రం ఇవి మానవసృష్టిలా కనిపిస్తున్నాయి. వాస్తవానికి కుట్రలకే అతిపెద్ద కుట్రదారు కేసీఆర్‌. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విదేశీ కుట్ర పేరుతో మరో డ్రామాకు తెరతీశారు’’ అని సంజయ్‌ మండిపడ్డారు.  జీహెచ్‌ఎంసీలో వరద ముంపు బాధితులకు రూ.10 వేల సాయం చేస్తానని ప్రకటించి ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్‌దని దుయ్యబట్టారు.


సర్వం కోల్పోయిన బాధితులకు రూ. 10వేల సాయం ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని సీఎం.. 10 వేల ఇళ్లతో కాలనీ ఎలా నిర్మిస్తారని నిలదీశారు. సర్వస్వం కోల్పోయినవారిని ఎలా ఆదుకుంటారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని సంజయ్‌ పిలుపునిచ్చారు. కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాల్సింది పోయి శవ రాజకీయాలకే టీఆర్‌ఎస్‌ ప్రాధాన్యం ఇస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించనందునే పంప్‌హౌస్‌లు మునిగిపోయాయన్నారు. 
వర్షాలు కురిపించడంలో విదేశీ కుట్ర ఉంటదా?: ఈటల 

వర్షాలు కురిపించడంలో విదేశీ కుట్ర ఉంటదా? అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.. సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రాజాసింగ్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వరదపరిస్థితిని సమీక్షించి జాతీయ విపత్తుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌.. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళితే.. రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు హెలికాప్టర్‌ ఏర్పాటు చేయలేదని, రైల్లో వెళితే కనీసం పోలీసు భద్రత కూడా ఇవ్వలేదని, ఈ విధానం సరికాదని ఆయన అన్నారు.  

Read more