ప్రజలపై కేసీఆర్‌కు ఉన్న కపట ప్రేమ అర్థమైంది...

ABN , First Publish Date - 2022-07-13T02:50:08+05:30 IST

ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించినా.. తెలంగాణలో తగ్గించకపోవడంతో ప్రజలపై కేసీఆర్‌కు ఉన్న కపట ప్రేమ అర్థమైందని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు..

ప్రజలపై కేసీఆర్‌కు ఉన్న కపట ప్రేమ అర్థమైంది...

హైదరాబాద్: ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించినా.. తెలంగాణలో తగ్గించకపోవడంతో ప్రజలపై కేసీఆర్‌కు ఉన్న కపట ప్రేమ అర్థమైందని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు. ప్రధాని మోదీని విమర్శించినంత మాత్రాన.. కేసీఆర్ నేషనల్ లీడర్ అవ్వలేడన్నారు. కేసీఆర్ దొరల పాలనకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా మంగళవారం ఆమె.. కేసీఆర్‌పై పలు విమర్శలు చేశారు. అవి ఆమె మాటల్లోనే.. 


‘‘తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పని అయిపోయింది. "కొందరిని ఎల్లకాలం మోసం చేయవచ్చు, అందరినీ కొంత కాలం మోసం చేయవచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు..." అనే నానుడి తెలంగాణ సీఎం కేసీఆర్ విషయంలో నూటికి నూరు శాతం నిజమవుతోంది. కేసీఆర్ మోసాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించారు. ఇక సార్‌ను ఇంటికి సాగనంపాలని డిసైడ్ చేసుకున్నరు. ఈ వాస్తవాన్ని గుర్తించారు కాబట్టే కేసీఆర్ బీఆర్ఎస్ అంటూ జాతీయ పార్టీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. తెలంగాణాలోనే ఖేల్ ఖతం కావడంతో కేసీఆర్‌ను దేశవ్యాప్తంగా ఎవరూ పట్టించుకోరన్న విషయం అందరికీ తెలుసు. అందుకే జాతీయ మీడియాను ఆకర్షించడానికి, తనను తాను నేషనల్ లీడర్‌గా పరిచయం చేసుకోవడానికి కేసీఆర్ ఇటీవలి కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ గారిపై విమర్శలు చేస్తున్నరు.


‘‘దేశ ప్రధాని హోదాలో వచ్చిన మోదీ గారికి స్వాగతం పలకనప్పుడే కేసీఆర్ కుళ్లు రాజకీయాలు దేశ ప్రజలకు అర్థమయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించినా తెలంగాణలో తగ్గించకపోవడంతో ప్రజలపై కేసీఆర్‌కు ఉన్న కపట ప్రేమ అర్థమైంది. కొవిడ్ సృష్టించిన సమస్యల వలయం నుంచి ఇంకా బయటపడని ప్రజలను ఆదుకోవలసిందిపోయి.. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వకపోవడం, విద్యుత్ చార్జీలు పెంచడం, ఆర్టీసీ చార్జీలు పెంచడంతో ఇక కేసీఆర్ దొర పాలనకు ముగింపు పలకాలని జనం నిర్ణయించుకున్నరు. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, మర్యాదగా మెలిగితే పరువు కాస్తయినా మిగులుతుందని... లేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోక తప్పదని కేసీఆర్‌కు సూచిస్తున్నాము’’.. అని విజయశాంతి పేర్కొన్నారు.Read more