బీజేపీ దగ్గర విషం తప్ప విషయం లేదు

ABN , First Publish Date - 2022-07-05T10:07:43+05:30 IST

తెలంగాణకు ఏం చేశారో చెప్పకుండా విజయ సంకల్ప సభలో బీజేపీ జాతీయ నాయకులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై విమర్శలకే పరిమితమయ్యారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌ రావు అన్నారు.

బీజేపీ దగ్గర విషం తప్ప విషయం లేదు

  • సభలో తెలంగాణకు ఏం చేస్తారో చెప్పలేదు.. 
  • సర్కారుపై విమర్శలకే పరిమితం
  • డబుల్‌ ఇంజన్‌ కాదు.. 
  • సింగిల్‌ ఇంజన్‌తోనే ప్రగతి: హరీశ్‌ రావు


హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు ఏం చేశారో చెప్పకుండా విజయ సంకల్ప సభలో బీజేపీ జాతీయ నాయకులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై విమర్శలకే పరిమితమయ్యారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌ రావు అన్నారు. బీజేపీ దగ్గర విషం తప్ప విషయం ఏమీ లేదని విమర్శించారు.  ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా దేశానికి, తెలంగాణకు ఏదైనా దిశానిర్దేశం చేస్తారనుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. సోమవారం టీఆర్‌ఎ్‌సఎల్పీ కార్యాలయంలో ఎంపీలు బీబీ పాటిల్‌, కొత్త ప్రభాకర్‌, విప్‌ గొంగిడి సునీత తదితరులతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. బీజేపీ నేతల ప్రసంగాల్లో కేసీఆర్‌ నామస్మరణ, అధికార యావ తప్ప మరోటి కనిపించలేదని పేర్కొన్నారు. విభజన చట్టం హామీల అమలు ఊసే లేదని, ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు వచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. తెలంగాణ కంటే ఎక్కువగా వారి రాష్ట్రాల్లో ఏం చేశారో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు చెప్పలేకపోయారన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నీళ్లు, నిధులు, నియామకాల గురించి పాత పాటనే పాడారని విమర్శించారు. ఆ మూడు అంశాలపై తెలుసుకునేందుకు అమిత్‌షా క్షేత్రస్థాయి పరిశీలకు రావాలని సవాల్‌ విసిరారు. 


ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని అన్యాయంగా మాట్లాడుతున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులిచ్చి రూ.80 వేల కోట్ల రుణానికి ఆమోదించింది కేంద్రం కాదా? పార్లమెంట్‌ సాక్షిగా కాళేశ్వరంలో అవినీతి జరగలేదని కేంద్రమంత్రి చెప్పలేదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. గడచిన ఏడేళ్లలో దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం 3ు వృద్ధి చెందగా.. తెలంగాణలో 10ు వృద్ధి చెందిందని  తెలిపారు. ఆర్థిక ప్రగతి సాధించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కారు ఉన్న యూపీలో తలసరి ఆదాయం తెలంగాణ కన్నా మూడు రెట్లు తక్కువగా ఉందని, కేసీఆర్‌ సింగిల్‌ ఇంజన్‌ సర్కారుతో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రానికి న్యాయబద్ధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకున్నా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా ఆగడం లేదని చెప్పారు.  


4 ఎకరాలకుపైగా భూమి ఉన్న రైతులకు నేటి నుంచి రైతుబంధు

నాలుగు ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులకు మంగళవారం నుంచి వర్షాకాలపు రైతుబంధు సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు వెల్లడించారు. అర్హులైన రైతులందరికీ పథకం వర్తిస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సోమవారం అరణ్య భవన్‌లో రైతుబంధుపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న 51.99 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.3,946 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు సంబంధించిన ఉపకారవేతనాల విడుదలపైనా మంత్రి హరీశ్‌ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 31వ తేదీ వరకు ఇవ్వాల్సిన రూ.362.88 కోట్ల స్కాలర్‌షిప్పుల నిధులను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. 

Read more