బయోలాజికల్‌-ఈకి ‘ఎం-ఆర్‌ఎన్‌ఏ’

ABN , First Publish Date - 2022-04-05T09:22:56+05:30 IST

‘ఎం-ఆర్‌ఎన్‌ఏ’ రకం కొవిడ్‌ వ్యాక్సిన్లు అభివృద్ధిచెందిన దేశాల్లోనే అందుబాటులోకి వచ్చాయి.

బయోలాజికల్‌-ఈకి ‘ఎం-ఆర్‌ఎన్‌ఏ’

  • బదిలీ చేయనున్న డబ్ల్యూహెచ్‌వో 
  • కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తికే తొలి ప్రాధాన్యం
  • భవిష్యత్‌ వ్యాక్సిన్ల తయారీకి అండ : మహిమ దాట్ల


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ‘ఎం-ఆర్‌ఎన్‌ఏ’ రకం కొవిడ్‌ వ్యాక్సిన్లు అభివృద్ధిచెందిన దేశాల్లోనే అందుబాటులోకి వచ్చాయి. వ్యాక్సిన్ల తయారీకి సంబంధించిన ఈ అత్యాధునిక సాంకేతికతను త్వరలోనే మన హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఈ (బీఈ) కంపెనీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అందించనుంది. డబ్ల్యూహెచ్‌వోకు చెందిన టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ హబ్‌ నుంచి ఎం-ఆర్‌ఎన్‌ఏ పరిజ్ఞానాన్ని బయోలాజికల్‌-ఈ పొందనుంది. మనదేశం నుంచి వివిధ కంపెనీలు తమకు ఆ పరిజ్ఞానాన్ని బదిలీ చేయాలంటూ డబ్ల్యూహెచ్‌వోకు దరఖాస్తులు సమర్పించాయి. వ్యాక్సిన్‌ ఉత్పత్తుల అభివృద్ధిపై డబ్ల్యూహెచ్‌వో ఏర్పాటుచేసిన సలహా కమిటీ (ఏసీపీడీవీ) ఈ దరఖాస్తులను పరిశీలించి, బయోలాజికల్‌-ఈని ఎంపిక చేసింది. 


ఈవిషయాన్ని ఆ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహిమ దాట్ల సోమవారమిక్కడ వెల్లడించారు. తమ కంపెనీ అనుసరిస్తున్న ప్రపంచ స్థాయి ప్రమాణాలకు ఇది నిదర్శనమన్నారు. గత ఏడాది నుంచే ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీలో తాము పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఇక బయోలాజికల్‌-ఈకి ఎం-ఆర్‌ఎన్‌ఏ పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు దానితో వ్యాక్సిన్ల తయారీకి అవసరమైన శిక్షణాపరమైన మద్దతును కూడా డబ్ల్యూహెచ్‌వో అందించనుంది. ఇందుకోసం భారత ప్రభుత్వం, బీఈతో డబ్ల్యూహెచ్‌వో, దాని భాగస్వామ్య సంస్థలు కలిసి పనిచేస్తాయి. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీని వినియోగించి కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి తొలి ప్రాధాన్యమిస్తారు. అనంతరం ఇతర వ్యాక్సిన్లనూ ఈ టెక్నాలజీతో బయోలాజికల్‌-ఈ ఉత్పత్తి చేస్తుంది. 

Read more