భట్టుగూడెంలో 1200 ఏళ్లనాటి దేవాలయం

ABN , First Publish Date - 2022-02-19T07:06:25+05:30 IST

సాధారణంగా శివాలయంలో గర్భగుడి ముందు

భట్టుగూడెంలో 1200 ఏళ్లనాటి దేవాలయం

  •  నల్గొండ జిల్లాలో కొలువైన కామేశ్వరాలయం
  •  బాదామి చాళుక్యుల కాలంనాటిదిగా గుర్తింపు
  •  ద్వారశాఖలపై స్త్రీమూర్తుల రూపంలో శంఖ, పద్మనిధి శిల్పాలు


హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా శివాలయంలో గర్భగుడి ముందు ద్వారపాలకులుగా శృంగి, భృంగి లేదా దిండి, ముండి ప్రతిమలు కనిపిస్తాయి. కానీ బ్రహ్మ, భైరవుడు ద్వారపాలకులుగా ఉన్న ఓ అరుదైన దేవాలయం నల్గొండ జిల్లాలో ఉంది. పెద్దపూర మండలంలోని భట్టుగూడెం గ్రామంలో కామేశ్వరాలయంగా కొలువై ఉన్న ఈ గుడి వయసు సుమారు 1200 ఏళ్లని చరిత్రకారులు చెబుతున్నారు. ఆలయ ద్వారశాఖలపై స్త్రీమూర్తి రూపంలో శంఖ, పద్మనిధి శిల్పాలనూ చూడవచ్చని పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు.


స్థానికులు అందించిన సమాచారం మేరకు ఆ ఆలయాన్ని శుక్రవారం సందర్శించినట్లు ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన శిల్పాలు చాలా ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. భైరవుడు, బ్రహ్మ ద్వారపాలకులుగా ఉండటం తెలంగాణ ఆలయ కట్టడాల్లోనే అత్యంత అరుదైనదని చరిత్రకారులు అభివర్ణిస్తున్నారు. పల్లవ శిల్పశైలిని పోలిన ఆ విగ్రహాలు క్రీ.శ 7-8 శతాబ్దాల మధ్య కాలంలోని బాదామి చాళుక్యుల నాటివని అంచనా వేస్తున్నారు. ఇక్కడ కొలువైన భైరవుడి శిల్పం, భైరవకోన గుహలో మాదిరిగానే కోరపళ్లను కలిగి ఉండటం మరో విశేషం. అక్కడి శివాలయానికి బ్రహ్మ, విష్ణుమూర్తి ద్వారపాలకులుగా ఉంటే, భుట్టుగూడెంలోని కామేశ్వరాలయానికి భైరవుడు, బ్రహ్మ ద్వారపాలకులుగా ఉన్నారు. చారిత్రకంగానూ ప్రాధాన్యం కలిగిన ఈ ఆలయ శిల్పాలను ఆలయ ప్రాంగణంలోని పీఠాలపై నిలబెట్టి భద్రపరచాలని శివనాగిరెడ్డి భట్టుగూడెం గ్రామస్థులను కోరారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం ప్రాజెక్టు అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.  


Read more