తెలంగాణలో మందిర్, దర్గా, చర్చిలకు రాహుల్

ABN , First Publish Date - 2022-10-01T19:05:03+05:30 IST

కాంగ్రెస్ అగ్ర‌నేత‌, వ‌యానాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్రకు దేశ‌వ్యాప్తంగా విశేష స్పంద‌న ల‌భిస్తుంది.

తెలంగాణలో మందిర్, దర్గా, చర్చిలకు రాహుల్

Hyderabad, అక్టోబ‌ర్ 1 : కాంగ్రెస్ అగ్ర‌నేత‌, వ‌యానాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్రకు దేశ‌వ్యాప్తంగా విశేష స్పంద‌న ల‌భిస్తుంది. ఇప్ప‌టికే త‌మిళ‌నాడు క‌న్యాకుమారి (Kanyakumari)లో ప్రారంభమైన యాత్ర, ఆ రాష్ట్రంలో ఉత్స‌హాభ‌రితంగా సాగిన విష‌యం తెలిసిందే. అదే జోరు... హోరుతో భార‌త్ జోడో యాత్ర కేర‌ళ‌ (Kerala)లో కూడా కొన‌సాగుతోంది. అక్టోబ‌ర్ 24వ తేదీన తెలంగాణ‌ (Telangana)లోకి భార‌త్ జోడో యాత్ర‌ రాహుల్ బృందం రానుంది. అందుకోసం తెలంగాణ కాంగ్రెస్ (Congress Party) పెద్ద ఎత్తున స్వాగ‌తం ప‌లికేందుకు ఏర్పాట్లు సైతం చేస్తుంది. 


ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోకి యాత్ర‌ వ‌చ్చాక ఓ కీల‌క ప‌రిణామం చోటు చేసుకోనుంది. అన్ని మ‌తాల మ‌ధ్య ఐక్య‌తా భావాన్ని నింపేందుకు కాంగ్రెస్ ప్ర‌ణాళిక‌లు ర‌చించింది. అందుకోసం దేవాల‌యాలు, చ‌ర్చిలు, మ‌సీదుల‌ను రాహుల్ గాంధీ సంద‌ర్శించ‌నున్నారు. మ‌త సామ‌ర‌స్యానికి ప్ర‌తీక‌గా ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవాల‌ని కాంగ్రెస్ భావిస్తున్న‌ది. ఈ చ‌ర్య‌ల్లో భాగంగా హైద‌రాబాద్ (Hyderabad) న‌గ‌ర శివారులో ఉన్న చిలుకూరి బాలాజీ దేవాల‌యాన్ని (Chilukuru Balaji temple) ద‌ర్శించుకొని స్వామివారి ఆశీస్సులు రాహుల్‌ పొంద‌నున్నారు. ఆ త‌ర్వాత ఆసియా ఖండంలోనే అతి పెద్ద‌దైన మెద‌క్ చ‌ర్చి (Medak Church)కి వెళ్ళ‌నున్నారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి 44 కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఉన్న జ‌హంగీర్ ద‌ర్గా (Jahangeer Darga)ను కూడా సంద‌ర్శిస్తార‌ని భార‌త్ జోడో యాత్ర వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. వీటిని సంద‌ర్శించ‌డం ద్వారా బీజేపీ దేశంలో చేస్తున్న మ‌త విభ‌జ‌న రాజ‌కీయాల‌కు గట్టి సమాధానం ఇచ్చిన‌ట్టువుతుంద‌ని కాంగ్రెస్ అంచ‌నా వేస్తోంది.


Read more