భద్రాజలం

ABN , First Publish Date - 2022-07-16T08:39:56+05:30 IST

ఉగ్రరూపు దాల్చిన గోదావరి నది భద్రాచలం వద్ద మరింత ఉప్పొంగి ప్రవహిస్తోంది! నిన్నటి దాకా భద్రాచలం చుట్టూ ఉన్న దారులన్నీ మూసుకుపోగా ఇప్పుడు భద్రాచలంలోకే వరద పోటెత్తింది.

భద్రాజలం

  • 71.9 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవాహం
  • 1990లో 70.8 అడుగుల ఎత్తులో ఉధృతి
  • భద్రాచలం పట్టణంలో నాలుగు కాలనీలు మునక
  • పరీవాహక ప్రాంతంలోని 95 గ్రామాలు ముంపులో
  • పునరావాస కేంద్రాలకు 21వేల మంది తరలింపు
  • సహాయక చర్యలు వేగవంతం చేయండి: సీఎం 
  • నేటి ఉదయానికి వరద తగ్గుముఖం: అధికారులు
  • బూర్గంపాడులో పడవ బోల్తా.. ఒకరి గల్లంతు
  • మేడిగడ్డ వద్ద తగ్గిన గోదావరి ఉధృతి
  • బ్యారేజీలోకి 24.85 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
  • శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద
  • ప్రాజెక్టులోకి 2.70 లక్షల క్యూసెక్కుల నీరు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): ఉగ్రరూపు దాల్చిన గోదావరి నది భద్రాచలం వద్ద మరింత ఉప్పొంగి ప్రవహిస్తోంది! నిన్నటి దాకా భద్రాచలం చుట్టూ ఉన్న దారులన్నీ మూసుకుపోగా ఇప్పుడు భద్రాచలంలోకే వరద పోటెత్తింది. పట్టణంలోని సుభా్‌షనగర్‌, శాంతినగర్‌, అయ్యప్ప కాలనీ, ఆశోక్‌నగర్‌ కొత్త కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లచుట్టూ నీళ్లు చేరాయి.. కొన్ని ఇళ్లు సగం దాకా మునిగిపోతే.. మరికొన్ని ఎనిమిది అడుగుల దాకా మునిగిపోయాయి! షెడ్లు, చిన్న చిన్న రేకుల ఇళ్లయితే పూర్తిగా మునిగిపోయాయి! ఇళ్లలో నీరు.. బయటకొస్తే కాలనీ చుట్టూ నీరు.. కనుచూపు మేర అంతా నీళ్లే! ఈ కాలనీల్లోనే కాదు.. గోదావరి నది పరీవాహక ప్రాంతంలోని 95 గ్రామాలు గోదావరి వరదలో మునిగిపోయాయి. గురువారం రాత్రి 64 అడుగుల ఎత్తుతో సాగిన గోదారమ్మ ప్రవాహం.. శుక్రవారం ఉదయం నుంచి మరింత పెరుగుకుంటూ సాగి రాత్రి 11 గంటల సమయానికి 71.9 అడుగులకు చేరింది. ఈ ప్రవాహం 32 ఏళ్ల నాటి రికార్డును అధిగమించిందని చెబుతున్నారు. 1986లో రికార్డు స్థాయిలో 75.6 అడుగుల ఎత్తుతో, 1953లో 72.5 అడుగుల ఎత్తుతో, 1990లో 70.8 అడుగుల మునిగిపోయాయి. 


గురువారం రాత్రి 64 అడుగుల ఎత్తుతో సాగిన గోదారమ్మ ప్రవాహం.. శుక్రవారం ఉదయం నుంచి మరింత పెరుగుకుంటూ సాగి రాత్రి 11 గంటల సమయానికి 71.9 అడుగులకు చేరింది. ఈ ప్రవాహం 32 ఏళ్ల నాటి రికార్డును అధిగమించిందని చెబుతున్నారు. 1986లో రికార్డు స్థాయిలో 75.6 అడుగుల ఎత్తుతో, 1953లో 72.5 అడుగుల ఎత్తుతో, 1990లో 70.8 అడుగుల ఎత్తుతో గోదావరి ప్రవహించింది. కాగా  భద్రాచలంలో 4,884 మంది ముంపు బాధితులు సహా దుమ్ముగూడెం, బూర్గంపాడు, ఆశ్వాపురం, చర్ల, అశ్వాపురం మండలాల్లోని గ్రామాల నుంచి మొత్తంగా 20,922 మందిని 77 పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వృద్ధులు, గర్భిణులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నందున సహాయక చర్యలు వేగవంతంగా చేపట్టాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.


రక్షణ కవచంగా నిలిచిన కరకట్ట

భద్రాచలం పట్టణానికి కరకట్ట రక్షణ కవచంగా నిలిచింది. సుమారు 10 వేల కుటుంబాలు వరద ముంపునకు గురవకుండా కాపాడింది. చంద్రబాబు హయాంలో రూ.53కోట్లతో యటపాక నుంచి సుభా్‌షనగర్‌ వరకు పది కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మాణం జరిగింది. ప్రస్తుతం కరకట్ట లేని ప్రాంతంతోపాటు కరకట్టలో ఉన్న స్లూయి్‌సల లీకుల కారణంగా వస్తున్న నీటితోనే దిగువ ప్రాంతం జలమయమైంది. అదే ఈ కరకట్టే లేకపోతే భద్రాచలం మూడొంతులు జలమయమయ్యే పరిస్థితి ఉండేది. కాగా, ఎగువ నుంచి ప్రవాహం తగ్గడంతో భద్రాచలం వద్ద తాజా వరద శనివారం ఉదయానికి కొంత తగ్గవచ్చునని అధికారులు చెప్పారు.  ప్రస్తుతం భద్రాచలం వద్ద 24,13,509 క్యూసెక్కులతో గోదావరి ఉప్పొంగుతోంది. తెలంగాణ, ఏపీ మధ్య భద్రాచలం నుంచి యాటపాక వరకు అనుసంధానంగా ఉన్న కరకట్టపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జలదిగ్బంధంలో ఉన్న మణుగూరు, పినపాక, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలంలో విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. 


మేడిగడ్డ వద్ద తగ్గిన ప్రవాహం

మేడిగడ్డ వద్ద గోదావరి ఉధృతి తగ్గింది. శుక్రవారం తెల్లవారుజామున 28,70,720 క్యూసెక్కులతో మేడిగడ్డ బ్యారేజీకి రికార్డుస్థాయిలో వరద పోటెత్తగా అది సాయంత్రానికి 24.25 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. తుపాకులగూడెం బ్యారేజీకి 24.85 లక్షల క్యూసెక్కులు, దుమ్ముగూడేనికి 23.68 లక్షల క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీకి 4.58 లక్షల క్యూసెక్కులు, సుందిళ్ల బ్యారేజీకి 4.43లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 3.39లక్షల క్యూసెక్కుల వరద రాగా... దిగువకు 3.88 లక్షలు వదిలిపెడుతున్నారు. శ్రీరాంసాగర్‌  ప్రాజెక్టుకు 96265 క్యూసెక్కులు వస్తుండగా...90 వేల క్యూసెక్కులు వదిలేస్తున్నారు.


బూర్గంపాడు వద్ద పడవ బోల్తా ఒకరి మృతి

బూర్గంపాడులో ఓ నాటు పడవ బోల్తా పడింది. గోదావరి వరద నుంచి బయటపడేందుకు బూర్గంపాడు నుంచి పడవలో సురక్షిత ప్రాంతానికి 12మందితో బయలుదేరింది. అయితే కాసేపటికే అది ఓ విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాపడింది.  ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని 11 మందిని ఒడ్డుకు చేరారు. మేక వెంకటనర్సింహా అనే వ్యక్తి మాత్రం గల్లంతయ్యాడు. భద్రాచలం సమీపంలో సీఆర్‌పీఎఫ్‌ 141 బెటాలియన్‌కు చెందిన 65 మంది వరదలో చిక్కుకుపోగా రెస్క్యూ టీం పడవల్లో వెళ్లి సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చింది. 


శ్రీశైలానికి 2.70 లక్షల క్యూసెక్కులు

కృష్ణా బేసిన్‌లోని  ప్రాజెక్టులకు వరద పెరుగుతోంది. కృష్ణాలో ఎగువన ఉన్న ఆల్మట్టికి 1.25 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా... వచ్చింది వచ్చినట్లే దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 1.35 లక్షల క్యూసెక్కులు వస్తుండగా... 1.33 లక్షల క్యూసెక్కులకు వదులుతున్నారు. తుంగఽభద్ర జలాశయానికి 1.21  లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా... 1.52  లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు 1.41 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా... 1.38 లక్షల క్యూసెక్కులను గేట్లు ఎత్తడం ద్వారా, విద్యుదుత్పాదన కోసం కిందికి వదిలేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 2.70 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది.  విద్యుదుత్పత్తి కోసం 31 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కాగా, ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం మూడో ప్రమాద హెచ్చరికను దాటింది. కాటన్‌ బ్యారేజీకి 22.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.

Updated Date - 2022-07-16T08:39:56+05:30 IST