జ్వరాలొస్తున్నాయి జాగ్రత్త

ABN , First Publish Date - 2022-06-20T08:56:56+05:30 IST

వాతావరణం మారడంతో.. రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు మొదలయ్యాయి. జ్వర బాధితులు పెరుగుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు

జ్వరాలొస్తున్నాయి జాగ్రత్త

పిల్లల్లో మొదలైన వైరల్‌ జ్వరాలు..

కొద్దిరోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో 5ు మేర పెరిగిన బాధితులు

కొవిడ్‌ ప్రభావమా లేక వైరల్‌ జ్వరమా?

వైద్యశాఖ అప్రమత్తం.. నెలాఖరు దాకా మలేరియా, డయేరియాపై ప్రత్యేక డ్రైవ్‌


హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): వాతావరణం మారడంతో.. రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు మొదలయ్యాయి. జ్వర బాధితులు పెరుగుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. కొద్దిరోజుల వ్యవధిలోనే జ్వరబాధితుల సంఖ్య 5 శాతం మేర పెరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాఽధికారులు చెబుతున్నారు. జిల్లా డీఎంహెచ్‌వోలు కూడా దీన్ని ధ్రువీకరిస్తున్నారు. సాధారణంగా సీజనల్‌ వ్యాధులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంటాయి. కానీ ఈసారి ఏజెన్సీ, నాన్‌ ఏజెన్సీ అన్న తేడా లేకుండా అంతటా జ్వరాలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుకు వస్తున్న జ్వరబాధితుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పిల్లల్లో వైరల్‌ జ్వరాలు అధికంగా వస్తున్నాయి.


బాధితుల గుర్తింపు

ఒకవైపు కొవిడ్‌ కేసులు పెరుగుతుండగా.. మరోవైపు జలుబు, దగ్గు లక్షణాలున్న జ్వర బాధితులు ఎక్కువవుతున్నారు! దీంతో తమకు వచ్చింది సీజనల్‌ జ్వరమా లేక కరోనా సోకిందా అనే విషయం తెలియక చాలామంది తికమకపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య శాఖ అప్రమత్తమైంది. ఆశా కార్యకర్తలను రంగంలోకిదించి ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. జలుబు, జ్వరం, దగ్గు బాధితులను గుర్తించి అనుమానం ఉన్న వారికి కొవిడ్‌ టెస్టులు చేయించి, మెడికల్‌ కిట్లు ఇస్తోంది. దీంతో పాటు డయేరియాపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఇంటింటి సర్వేలో భాగంగా వాంతులు, విరేచనాలతో బాధపడేవారిని గుర్తిస్తున్నారు. వారికి ఓఆర్‌ఎ్‌సతోపాటు, జింక్‌, మెట్రోజిల్‌ టాబ్లెట్లను ఇస్తున్నారు. నెలాఖరు వరకూ ఈ డ్రైవ్‌ కొనసాగుతుందని వైద్యవర్గాలు తెలిపాయి. అలాగే, యాంటీ మలేరియా క్యాంపెయిన్‌ కూడా అధికారులు చేపట్టారు. నెలాఖరు వరకూ ఈ క్యాంపెయిన్‌ కొనసాగుతుందని వారు వెల్లడించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా డెంగీ, మలేరియా కేసులు పెరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టి, ఆ ప్రాంతాల్లో వారానికి రెండుసార్లు దోమలమందు ఫాగింగ్‌ చేస్తున్నారు. ఇతర చోట్ల వారంలో ఒక రోజు ఫాగింగ్‌ చేస్తున్నారు. 


గత నెలరోజుల్లో...

హైదరాబాద్‌లో సీజనల్‌ వ్యాఽధులతో పాటు కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. రోజూ 150 వరకూ కరోనా పాజిటివ్‌లు ఒక్క హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి. మేడ్చల్‌, రంగారెడ్డి కూడా కలిపితే ఆ సంఖ్య మరింత ఎక్కువ. ఇక ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా 158 వరకూ డెంగీ కేసులు రాగా.. వాటిలో ఎక్కువ భాగం గత నెలరోజుల్లో నమోదైనవేనని జీహెచ్‌ఎంసీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రోజుకు ఐదు నుంచి పది డెంగీ కేసులు హైదరాబాద్‌లో నమోదవుతున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. డెంగీ కేసులు నిరుటి కంటే ఎక్కువగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. 




ఈ లక్షణాలుంటే డెంగీగా అనుమానించాలి

తీవ్రజ్వరం, ఒళ్లునొప్పులు, కీళ్ల నొప్పులు, కంటివెనుక భాగంలో నొప్పి ఉంటే డెంగీగా అనుమానించి వెంటనే ఆస్పత్రుల్లో చేరాలి. డెంగీ వచ్చిన వారిలో 80 శాతం మందికి తీవ్రమైన లక్షణాలుండవు. 20 శాతం మందికే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. డెంగీ వస్తే ఎక్కువగా డీహైడ్రేషన్‌ అవుతుంది. అందుకే ఎక్కువగా నీళ్లు, ద్రవపదార్థాలు తీసుకోవాలి. ఓఆర్‌ఎస్‌ తీసుకోవాలి. ఇంట్లో ఒక్కరికి డెంగీ వస్తే మిగిలివారు కూడా దాని బారినపడే అవకాశాలు 90 శాతం ఉంటాయి. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.             

 డాక్టర్‌ అమర్‌సింగ్‌ నాయక్‌, అదనపు సంచాలకుడు, మలేరియా విభాగం

Updated Date - 2022-06-20T08:56:56+05:30 IST