మా తల్లీ.. బతుకమ్మ..

ABN , First Publish Date - 2022-09-25T05:24:39+05:30 IST

మా తల్లీ.. బతుకమ్మ..

మా తల్లీ.. బతుకమ్మ..

నేటి నుంచి పూల జాతర 

సంస్కృతి ఉట్టిపడే సంప్రదాయ వేడుక

పితృ అమావాస్య వేళ  పెద్దలకు బియ్యాలు

జోరుగా పూల అమ్మకాలు

మహిళల తొమ్మిరోజుల పండుగ ఆరంభం

వరంగల్‌ కలెక్టరేట్‌, సెప్టెంబరు 24: ప్రపంచ వ్యాప్తంగా పూల పండుగగా ప్రాచుర్యం పొందిన బతుకమ్మ వేడుకలు ఆదివారం నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి.  ప్రతీ ఏటా భాద్రపద శుద్ధ అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులు బతుకమ్మను కొలుస్తారు. ఆదివారం ఎంగిలి పూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభమై తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒక్కో పేరుతో బతుకమ్మను కొలుస్తూ, ఆడిపాడుతారు.  బతుక మ్మను ముగ్గురు అమ్మ వార్ల స్వరూపంగా భావి స్తారు. గౌరీ, సరస్వతి, మహాలక్ష్మి అమ్మవారి స్వరూపంగా కొలుస్తారు. 

తొమ్మిది రోజుల వేడుక

మొదటి రోజు ఎంగిళి పడని పూల బతుకమ్మ, రెండో రోజు ఆయుష్షునిచ్చే బతుకమ్మ. మూడో రోజు ఆరోగ్య ప్రధాయని బతుకమ్మ, నాలుగో రోజు సిరి సంపదల నిచ్చే బతుకమ్మ, ఐదో రోజు సంతాన వృద్ధినిచ్చే బతుకమ్మ, ఆరో రాజు అరిష్ఠమైన రోజుగా బతుకమ్మ వేడుకను నిర్వహించుకోరు. ఏడో రోజు పాడి పంటల నిచ్చే బతుకమ్మ, ఎనిమిదో రోజు పసిడి పంట లనిచ్చే బతుకమ్మ, తొమ్మిదో రోజు సకల సౌభా గ్యాలు, మాంగల్యానిచ్చే బతుకమ్మగా కొలుస్తారు.

తొమ్మిది రోజుల నైవేద్యాలు..

అమ్మవారికి నవధాన్యాలతో నవ దినాలు అనగా తొమ్మిది రోజుల పాటు నైవేద్యాలు సమర్పిస్తారు. మొదటి రోజు గోధుమలతో చేసిన నైవేద్యం, రెండో రోజు వరి ధాన్యంతో చేసిన నైవేద్యం, మూడో రోజు కందులలో, నాలుగో రోజు పెసర్లతో, ఐదో రోజు శని గలతో ఆరో రోజు నువ్వులతో, ఏడో రోజు బొబ్బెర్లతో ఎనిమిదో రోజు మినుములతో, తొమ్మిదో రోజు ఉలువలు, నవధాన్యాలు, పిండి వంటలతో నైవేద్యాల నివేదిస్తారు. 

బతుకమ్మ పుట్టినిల్లు వరంగలే.. 

బతుకమ్మ పుట్టింది వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట నియోజక వర్గం పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామంలోని చరిత్ర ఆధారంగా చెబుతున్నారు. నిజాం రాజ్యంలో టంకశాలలో పనిచేసిన రామయ్య ఆచార్యచే నిర్మితమైన గ్రామం చౌటపల్లి. గతంలో గత్తర, కలరాతో రెండుమార్లు ఊరు జనం మృతి చెందినట్టు చెబుతారు. నిజాం రాజ్యంలో పనిచేసిన రామయ్య ఆచార్యకు వ్యవసాయ ఆధారిత భూములను రాజు కేటాయించగా వర్ధన్నపేట తాలూకాలోని చౌటపల్లిలో నివాసం ఏర్పర్చుకున్నారు. గతంలో వచ్చిన కలరా ,గత్తర ముప్పు తిరిగి వ్యాపించే పరిస్థితులు ప్రారంభం కావడంతో రామయ్య గాయత్రిమాతను పూజించి వేడుకోగా అమ్మవారు స్వప్నంలో ముగ్గురమ్మలతో బతుకమ్మ వేడుకను ఎంగిళి పడని పూలు అయిన తంగేడు పూలతో తొమ్మిది రోజుల పాటు నిర్వహించమని చెప్పినట్లు ప్రచారంలో ఉంది. ఆనాటి నుంచి జిల్లాలోనే బతుకమ్మ పుట్టినట్లు స్థానికులు చెబుతుంటారు. 

పెద్దలకు బియ్యాలు..

భాద్రపద శుద్ధ అమావాస్య రోజును పితృ అమావాస్య రోజుగా ఆచరించుకుంటారు. కుటుంబంలోని మృతి చెందిన పెద్దలకు పితృ అమావాస్య రోజున బ్రాహ్మణుడికి బియ్యం ఇచ్చే సంస్కృతి అనాది నుంచి వస్తోంది. ప్రతీ ఏటా బతుకమ్మ ప్రారంభం రోజున పితృ అమావాస్య కార్యక్రమం నిర్వహిస్తారు. 

ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ..

తొమ్మిది రోజుల పాటు జరుపుకునే బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వం ఆలయాల్లో, మైదానాల్లో ఏర్పాట్లు చేస్తోంది. స్వచ్ఛంద సంస్థల ఆఽధ్వర్యంలో బతుకమ్మలకు బహుమతులు అందజేసే కార్యక్రమం పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి వరకు నిర్వహించుకొనే నేపథ్యంలో విద్యుత్‌ లైట్లు మైదానాల శుద్ధి ఏర్పాట్లు చేస్తున్నారు. 

భారీగా పెరిగిన పూల ధరలు 

బతుకమ్మ పండుగ పురస్కరించుకుని ఉదయం నుంచే మహిళలు పెద్ద ఎత్తున పూల కొనుగోలు చే శారు. వరంగల్‌లోని పోస్టాఫీస్‌ సెంటర్‌ పూల దుకా ణాల్లో ధరలు అధికంగా ఉన్నాయి. కిలో చామంతి పూలు రూ. 300 నుంచి రూ. 400 వరకు పలికింది. గులాబీ రూ. 400 నుంచి రూ. 500 వరకు, మల్ల్లెపూ లు రూ.వేయి నుంచి రూ. 1200 వరకు, బంతి పూ లు రూ. 100నుంచి రూ. 200 వరకు ధరలు పలికా యి. మహి ళలు పెద్ద ఎత్తున పూల ధరలు అధికం గా ఉన్నా కూడా కొనుగోలు చేశారు. తంగేడు పూ లు కట్టకు రూ.10, గునుగు పూలు రూ. 10 చొప్పున నాలుగు కట్టలు విక్రయించారు. Read more