గల్ఫ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ABN , First Publish Date - 2022-10-03T09:39:18+05:30 IST

కరోనా ఆంక్షల వల్ల మూడేళ్లుగా పండుగ వేడుకలు, సాంస్కృతిక ఉత్సవాలకు దూరంగా ఉన్న గల్ఫ్‌లోని తెలంగాణ ప్రవాసీలు ఈసారి బతుకమ్మ ఉత్సవాల్లో రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటున్నారు.

గల్ఫ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

దుబాయ్‌ సహా పలు చోట్ల ఉత్సవాలు 

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి: కరోనా ఆంక్షల వల్ల మూడేళ్లుగా పండుగ వేడుకలు, సాంస్కృతిక ఉత్సవాలకు దూరంగా ఉన్న గల్ఫ్‌లోని తెలంగాణ ప్రవాసీలు ఈసారి బతుకమ్మ ఉత్సవాల్లో రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటున్నారు. రెండు రోజులుగా సౌదీ అరేబియా సహా పలు గల్ఫ్‌ దేశాల్లో బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దుబాయ్‌, అబూ ధాబి, మస్కట్‌, కువైత్‌, దోహా, జెద్ధా, బహ్రెయిన్‌ నగరాల్లో తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలు ఎడారి దేశంలో తెలంగాణ సంస్కృతిని చాటి చెబుతున్నాయి. గతంతో పోల్చితే ఈసారి దుబాయ్‌లో బతుకమ్మ వేడుకలు పోటాపోటీ సాగుతున్నాయి. ఖతర్‌లో తెలంగాణ జాగృతి అధ్వర్యంలో జరిగిన బతుకమ్మ సంబరాలను భారత రాయబారి దీపక్‌ మిట్టల్‌ లాంఛనంగా ప్రారంభించారు.


అబూధాబిలోని ఐ.ఎ్‌స.సీ.సీ ప్రాంగణంలో తెలంగాణ ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో భారత ఎంబసీ సీనియర్‌ దౌత్యవేత్త డాక్టర్‌ బాలాజీ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. కవి, గాయకుడు, గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ సాయిచంద్‌ వేడుకలకు హాజరయ్యారు. ఒమన్‌ రాజధాని మస్కట్‌లో ఒమన్‌ తెలంగాణ సమితి అధ్వర్యంలో జరిగిన సంబరాల్లో భారత సీనియర్‌ అధికారిణి రీనా జైన్‌ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. మస్కట్‌, అబూధాబిలో అంచనాలకు మించి జనం రావడంతో సభా ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. సోమవారం బహ్రెయిన్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి గల్ఫ్‌ అధ్యక్షుడు హరిప్రసాద్‌ పేర్కొన్నారు. 

Read more