Bandi Sanjay : బతుకమ్మ పేరుతో డిస్కో డ్యాన్సులు

ABN , First Publish Date - 2022-12-13T03:42:28+05:30 IST

దొంగ సారా, పత్తాల దందా చేసిన కేసీఆర్‌ బిడ్డ సమరయోధురాలా? తప్పు చేసినోళ్లు ఎంతటి వారైనా సీబీఐ అరెస్టు చేసి జైలుకు పంపుతుంది. బతుకమ్మ పేరుతో డిస్కో డాన్సు చేయించి, బతుకమ్మ తల్లిని కించపరిచిన పాపం ఊరికే పోదు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిప్పులు చెరిగారు.

Bandi Sanjay : బతుకమ్మ పేరుతో   డిస్కో డ్యాన్సులు

ఆ తల్లిని కించపరిచిన పాపం ఊరికేపోదు

దొంగసారా, పత్తాల దందా చేసిన

కేసీఆర్‌ బిడ్డ సమరయోధురాలా?

తప్పు చేసినోళ్లు ఎంతటివారైనా

సీబీఐ జైలుకు పంపి తీరుతుంది: బండి

జగిత్యాల, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘‘దొంగ సారా, పత్తాల దందా చేసిన కేసీఆర్‌ బిడ్డ సమరయోధురాలా? తప్పు చేసినోళ్లు ఎంతటి వారైనా సీబీఐ అరెస్టు చేసి జైలుకు పంపుతుంది. బతుకమ్మ పేరుతో డిస్కో డాన్సు చేయించి, బతుకమ్మ తల్లిని కించపరిచిన పాపం ఊరికే పోదు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిప్పులు చెరిగారు. కవితను విచారిస్తే రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసాలు చేయడానికి సీఎం కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఆయన జగిత్యాల జిల్లా చల్‌గల్‌, జగిత్యాల పట్టణం, దరూర్‌, రాజారాం, తారాకరామనగర్‌, నూకపల్లి తదితర ప్రాంతాల్లో ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించారు. చల్‌గల్‌లో బీడీ పరిశ్రమను సందర్శించి కార్మికులతో ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగిత్యాల నుంచి ముంబైకి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో ప్రయాణికులతో మాట్లాడారు. జగిత్యాల బస్టాండు చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌ షోలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. జగిత్యాలకు ఇటీవల వచ్చిన సీఎం కేసీఆర్‌ ఈ ప్రాంతం సంఘ విద్రోహులకు అడ్డాగా మారిన వైనంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

కేసీఆర్‌ భారత్‌ రాష్ట్ర సమితి పార్టీ.. నిషేదిత పీఎ్‌ఫఐ సంస్థకు నిధులు సమకూరుస్తోందని ఆరోపించారు. పీఎ్‌ఫఐ సంస్థ సభ్యులు కార్యకలాపాలు చేస్తుంటే.. పాకిస్థాన్‌ జిందాబాద్‌ అంటూ ర్యాలీలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన నిలదీశారు. ఇక్కడి పోలీసులకు ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలన్న ఆలోచన ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వారి చేతులు కట్టేస్తోందని విమర్శించారు. గతంలో అజం ఘోరి అనే ఉగ్రవాదిని ఇక్కడే ఎన్‌కౌంటర్‌ చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అయ్యప్ప, హనుమాన్‌, భవానీ దీక్షా భక్తులకు విధుల్లో వెసులుబాటు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. వేములవాడ, ధర్మపురి, బాసర, కొండగట్టు ఆలయాల నిధుల హామీ ఏమైందని నిలదీశారు.

ఎప్పుడైనా ఎన్నికలు..

రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని బండి సంజయ్‌ అన్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు కలిసి కాంట్రాక్టులు, కమీషన్లు దోచుకుంటూ సెంటిమెంట్‌ రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ తల్లికి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి గద్దెనెక్కిన సీఎం కేసీఆర్‌ ప్రజలను మోసం చేశాడన్నారు. తెలంగాణ ఏర్పాటుతో కేసీఆర్‌ కుటుంబానికి ఉద్యోగాలు దొరికాయని, అలాంటి వ్యక్తి ఇప్పుడు తన పార్టీ పేరు నుంచి తెలంగాణ అనే పదం తొలగించాడని సంజయ్‌ విమర్శించారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్‌ నాయకులు సైతం ఆలోచించి ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పాటుకు బీజేపీతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, కాషాయ జెండాను గోల్కొండ కోటపై రెపరెపలాడించాలని కోరారు.

కరీంనగర్‌ సభతో సవాల్‌

ఈ నెల 15న కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ మైదానంలో పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహించి, విజయవంతం చేసి సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసరబోతున్నామని చల్‌గల్‌ వద్ద మీడియాతో మాట్లాడిన బండి సంజయ్‌ అన్నారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారన్నారు. కేసీఆర్‌ కుట్రలు, కుతంత్రాలను తెలంగాణ సమాజం గ్రహించిందని.. బీఆర్‌ఎ్‌సను పట్టించుకోదని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి రాజశ్యామల యాగం చేస్తాడట. చేస్తే తప్పులేదు ఎవరైనా చేసుకోవచ్చు. పట్టు వస్త్రాలు ధరించి యాగానికి కూర్చునే ముందు.. తెలంగాణకిచ్చిన హామీల్లో ఏవి నెరవేర్చారో ప్రమాణం చేసి ప్రకటించాలి. అప్పుడే ఆ యాగానికి సార్థకత. ప్రజలూ నమ్ముతారు.

-బండి సంజయ్‌

Updated Date - 2022-12-13T03:42:28+05:30 IST

Read more