Bandi Sanjay: బీఆర్‌ఎస్‌ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి

ABN , First Publish Date - 2022-12-10T03:27:59+05:30 IST

కేసీఆర్‌ బీఆర్‌ఎ్‌సను ఏర్పాటు చేయడంతో తెలంగాణకు పట్టిన శని వదిలిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

Bandi Sanjay: బీఆర్‌ఎస్‌ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి

ఆవిర్భావ సభ.. సంతాప సభలా ఉంది

లిక్కర్‌ కేసును పక్కదారి పట్టించే నాటకాలు

కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నాలు

తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య..

కమీషన్ల అండర్‌స్టాండింగ్‌: బండి సంజయ్‌

జగిత్యాల, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ బీఆర్‌ఎ్‌సను ఏర్పాటు చేయడంతో తెలంగాణకు పట్టిన శని వదిలిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. తన పార్టీ పేరు నుంచి, జెండా నుంచి తెలంగాణను కేసీఆర్‌ తీసేశారని, తద్వారా తెలంగాణతో తన బంధం తీరిపోయిందని చెప్పారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీని ప్రకటించి.. కేసీఆర్‌ మీటింగ్‌ పెడితే ఒక్కరి మొహంలో కూడా సంతోషం కనిపించలేదని తెలిపారు. అది ఆవిర్భావ సభలా కాకుండా సంతాప సభలా ఉందని విమర్శించారు. బండి సంజయ్‌ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం పరిధిలోని మెట్‌పల్లి, ఆరపేట, చౌలమద్ది క్రాస్‌ రోడ్డు, చింతలపేట, యూసు్‌ఫనగర్‌ గ్రామాల్లో జరిగింది. మెట్‌పల్లిలో అంబేద్కర్‌ విగ్రహానికి సంజయ్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన రోడ్‌ షోలలో ప్రజలనుద్దేశించి, మెట్‌పల్లిలో విలేకరుల సమావేశంలో సంజయ్‌ మాట్లాడారు. పార్టీ ప్రారంభించినప్పుడు ప్రజలకు ఏం చేస్తారో చెప్పాల్సిన అవసరాన్ని కేసీఆర్‌ విస్మరించారని ఆరోపించారు. దిక్కూ, దివానం లేనోళ్లను, తుక్డే గ్యాంగ్‌ను బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం పేరుతో పట్టుకొచ్చారని, బీఆర్‌ఎస్‌ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

లిక్కర్‌ కేసును పక్కదారి పట్టించేందుకే..

కేసీఆర్‌ కూతురు కవిత ఢిల్లీలో లిక్కర్‌ దందాకు పాల్పడ్డారని, ఇప్పుడు ఇంటర్నేషనల్‌ లిక్కర్‌ దందా చేస్తారేమోనని సంజయ్‌ వ్యాఖ్యానించారు. కూతురు లిక్కర్‌ దందా కేసును పక్కదోవ పట్టించేందుకే బీఆర్‌ఎస్‌ అంటూ నాటకాలాడుతున్నారని ఆరోపించారు. జాతీయ పార్టీ పెడితే విధి విధానాలు ఉండాలని, కానీ.. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు మాత్రమే కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారని సంజయ్‌ అన్నారు. రాష్ట్రంలో ఏమీ చేయనివారు.. దేశ రాజకీయాల్లో ఏం చేస్తారని విమర్శించారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య పరస్పర కమీషన్ల అండర్‌స్టాండింగ్‌ ఉందని ఆరోపించారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 14 భారీ బహిరంగ సభలను నిర్వహించి తెలంగాణలో రికార్డు సృష్టించామని సంజయ్‌ అన్నారు. ఆయా బహిరంగ సభలను తలదన్నేలా కరీంనగర్‌లో ఈ నెల 15న జరిగే సభను విజయవంతం చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళతారనే సంకేతాలు వస్తున్నాయని, ఈ క్రమంలో 5వ విడత ముగింపు ప్రజా సంగ్రామ యాత్ర సభను సక్సెస్‌ చేద్దామని అన్నారు. కాగా, మిషన్‌-2023 పేరిట రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని కొత్తగా నియమితులైన పార్లమెంట్‌ నియోజకవర్గ విస్తారక్‌లకు సంజయ్‌ దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు విస్తారక్‌లతో మెట్‌పల్లిలో ఆయన సమావేశమయ్యారు. పార్టీ సంస్థాగత బలోపేతానికి, కరీంనగర్‌లో నిర్వహించే బహిరంగ సభ విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించి పలు సూచనలు చేశారు.

Updated Date - 2022-12-10T03:28:00+05:30 IST