డిస్కమ్‌ల డీలైసెన్సింగ్‌పై వెనక్కి!

ABN , First Publish Date - 2022-07-07T10:04:09+05:30 IST

డిస్కమ్‌ల డీలైన్సింగ్‌పై కేంద్రం వెనక్కి తగ్గనుంది. విద్యుత్తు సవరణ బిల్లు-2022లో ఈ మేరకు మార్పులు ప్రతిపాదించినట్లు తెలిసింది.

డిస్కమ్‌ల డీలైసెన్సింగ్‌పై వెనక్కి!

  • ఒకే ప్రాంతంలో మల్టిపుల్‌ లైసెన్స్‌ తెరపైకి
  • ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లులో తాజా మార్పులు

హైదరాబాద్‌,  జూలై 6 (ఆంధ్రజ్యోతి): డిస్కమ్‌ల డీలైన్సింగ్‌పై కేంద్రం వెనక్కి తగ్గనుంది. విద్యుత్తు సవరణ బిల్లు-2022లో ఈ మేరకు మార్పులు ప్రతిపాదించినట్లు తెలిసింది. డీలైసెన్సింగ్‌ స్థానంలో మల్టిపుల్‌ లైసెన్సింగ్‌ విధానం తేనున్నట్లు, ఆ మేరకు బిల్లులో సవరణలు చేసినట్లు కేంద్రం తాజా ప్రతిపాదనల్లో పేర్కొంది. అంటే దక్షిణ తెలంగాణలో విద్యుత్తు వ్యాపారానికి ఎస్పీడీసీఎల్‌కు లైసెన్స్‌ ఉండగా, ఈ ప్రాంతంలో ఏదైనా సంస్థ కొత్తగా విద్యుత్తు సరఫరా కంపెనీ ఏర్పాటు చేసుకొని, లైసెన్స్‌ల కోసం తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(టీఎ్‌సఈఆర్‌సీ)కి దరఖాస్తు చేసుకుంటే.. మండలి అనుమతి తీసుకొని వ్యాపారం చేసుకునే వెసులుబాటు కలగనుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంతోపాటు నేరుగా బహిరంగ విపణి నుంచి కరెంట్‌ కొనుగోలు చేసుకొని, అమ్ముకునే అధికారం కూడా ఇవ్వనున్నారు. డీ లైసెన్సింగ్‌ను బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తాజాగా ప్రతిపాదించిన సవరణ ప్రాధాన్యం సంతరించుకుంది. రెండేళ్లుగా ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి సంకేతాలు ఇస్తున్నప్పటికీ ... రానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఎలాగైనా ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ముహూర్తంగా పెట్టుకుంది. 


కొత్త ప్రతిపాదనలు ఇవీ..

డీ లైసెన్సింగ్‌ రద్దుతో డిస్కమ్‌ల విద్యుత్‌ వ్యాపారానికి ఇచ్చిన లైసెన్సుల రద్దు స్థానంలో మల్టీపుల్‌ లైసెన్సింగ్‌ విధానం రానుంది. ప్రస్తుతం డిస్కమ్‌ల లైసెన్సులు యథాతథంగా ఉంటాయి. డిస్కమ్‌లతో పాటే ఇతర సంస్థలు విద్యుత్‌ వ్యాపారం చేసుకుంటాయి. దీనికోసం డిస్కమ్‌ల లైన్లు, సబ్‌స్టేషన్లు వాడుకున్నందుకు గాను ఫీజులు చెల్లించి... ఆ తర్వాత విద్యుత్‌ను కొనుగోలు చేసి...  విద్యుత్‌ వ్యాపారం చేసుకునే అవకాశం లభించనుంది. విద్యుత్‌ నియంత్రణ మండళ్ల ఎంపిక కమిటీకి చైర్మన్‌గా హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి ఉంటారు. హైకోర్టు సిట్టింగ్‌ జడ్జిల తో నియంత్రణ మండళ్ల చైర్మన్ల ఎంపిక ఇక ముందు ఉండదు. వాస్తవిక విద్యుత్‌ వ్యయానికి అనుగుణంగా కరెంట్‌ చార్జీలు పెంచకపోతే ఆ వ్యయాన్ని పరిగణనలోకి చార్జీల పెంపు ఉండదు. కేంద్రం నిర్దేశించిన పునరుద్ధరణీయ ఇంధన వనరులు వాటా ఉండకపోతే జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.  ఒక రాష్ట్రంలో విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌, సభ్యులు లేకుండా మండలి ఖాళీగా ఉంచితే... పక్క రాష్ట్రం చైర్మన్‌, సభ్యులు ఖాళీగా ఉన్న రాష్ట్రంలోని  మండలి కార్యకలాపాలు నడిపించే అధికారం ఉండనుంది.

Read more