అవార్డులు అభివృద్ధికి నిదర్శనం

ABN , First Publish Date - 2022-10-05T09:10:57+05:30 IST

తెలంగాణలోని పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి నిదర్శనంగా నిలవడం వల్లే అవార్డులు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

అవార్డులు అభివృద్ధికి నిదర్శనం

  • తెలంగాణ అత్యుత్తమమని కేంద్రం ప్రశంస
  • బీజేపీ జాతీయ నేతల విమర్శలు అర్థరహితం
  • అవార్డు పొందిన మునిసిపాలిటీకి రూ.2 కోట్లు
  • ఈ నిధులు పారిశుధ్య నిర్వహణకు వినియోగం
  • ఉత్తమ పద్ధతుల కోసం జపాన్‌, సింగపూర్‌ స్టడీ టూర్‌: కేటీఆర్‌

హైదరాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి నిదర్శనంగా నిలవడం వల్లే అవార్డులు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమం అని కేంద్రం ప్రశంసిస్తోందని.. అయితే.. రాష్ట్రానికి వస్తున్న బీజేపీ జాతీయ నాయకులు మాత్రం ఇక్కడ పరిపాలన సరిగాలేదని అర్థరహిత విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్‌ అవార్డులు సాధించిన 19 మునిసిపాలిటీలకు చెందిన చైర్‌పర్సన్లు, కమిషనర్లను మంగళవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి సత్కరించారు. ఇందులో పీర్జాదిగూడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌, బడంగ్‌పేట్‌, కోరుట్ల, సిరిసిల్ల, తుర్కయాంజల్‌, గజ్వేల్‌, వేములవాడ, ఘట్‌కేసర్‌, కొంపల్లి, హుస్నాబాద్‌, ఆదిభట్ల, కొత్తపల్లి, చండూర్‌, నేరేడుచర్ల, చిట్యాల, భూత్పూర్‌, అలంపూర్‌, కోరుట్ల పురపాలికల చైర్మన్లు, చైర్‌పర్సన్లు, అదనపు కలెక్టర్లు, కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు రాష్ట్రానికి 19 దక్కడం విశేషమని, మన రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక వ్యూహంతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పలు అభివృద్ధి పనులు చేపడుతున్న కారణంగానే అవార్డులు, రివార్డులతో పాటు ప్రజల మన్ననలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు సాగాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలోని పారిశుధ్య కార్మికుల నుంచి హైదరాబాద్‌లోని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వరకు అందరూ ఒకే లక్ష్యంతో పనిచేసిన కారణంగా ఇంత పెద్ద మొత్తంలో అవార్డులు సాధించడంతోపాటు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందామని పేర్కొన్నారు. పురపాలికలు ప్రత్యేక దృష్టిపెట్టి పారిశుధ్య చర్యలు చేపట్టినప్పటికీ.. ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని, తద్వారానే పట్టణాలు, పల్లెలు చెత్తా చెదారం లేకుండా ఉంటాయన్నారు. జాతీయ అవార్డులు సాధించిన మునిసిపాలిటీలకు ఒక్కోదానికి రూ.2 కోట్ల చొప్పున ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ నిధులను పారిశుధ్య నిర్వహణ కోసం వినియోగించాలని సూచించారు. అదేవిధంగా అవార్డు పొందిన పురపాలికల చైర్‌పర్సన్లు, అదనపు కలెక్టర్లు, కమిషనర్లను, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అధ్యయనానికి పంపి మరిన్ని ఉత్తమ పద్ధతులు తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ఇందులోంచి పదిమందిని ఎంపిక చేసి జపాన్‌, సింగపూర్‌ దేశాలకు అధ్యయనానికి పంపిస్తామని వెల్లడించారు. ప్రతి గ్రామం, మునిసిపాలిటీల్లో నర్సరీలున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామని, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కారణంగా పట్టణాలు, గ్రామాలు గొప్పగా మారాయని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో 50ు రిజర్వేషన్‌ కల్పించడం వల్ల చాలా మంది మహిళలు పురపాలికలకు నాయకత్వం వహిస్తూ.. స్థానిక సంస్థలను చక్కగా అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని ఆయన చెప్పారు.   

Read more