సీఎం కేసీఆర్‌పై అసోంలో కేసులకు రంగం!

ABN , First Publish Date - 2022-02-16T08:12:29+05:30 IST

కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తూ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేసేందుకు అసోం పోలీసులు సిద్ధమవుతున్నారు.

సీఎం కేసీఆర్‌పై అసోంలో కేసులకు రంగం!

  • ఆర్మీని కించపరిచారంటూ ఆరోపణలు
  • తెలంగాణలో ఇప్పటికే హిమంతపై కేసులు

గువాహటి, ఫిబ్రవరి 15: కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తూ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేసేందుకు అసోం పోలీసులు సిద్ధమవుతున్నారు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆధారాలు చూపాలని డిమాండ్‌ చేయగా.. ఆ వ్యాఖ్యలపై అసోం సీఎం హింమత బిశ్వ శర్మ స్పందిస్తూ ‘‘మీరు రాజీవ్‌గాంధీ కుమారుడేననే ఆధారాలున్నాయా?’’ అంటూ ఎదురుదాడికి దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ప్రెస్‌మీట్‌లో రాహుల్‌గాంధీని సమర్థిస్తూ.. ‘‘ఇప్పుడు నేనూ ప్రశ్నిస్తున్నాను. సర్జికల్‌ స్ట్రయిక్స్‌కు ఆధారాలున్నాయా?’’ అని వ్యాఖ్యానించారు. అసోం సీఎం దీనికి కౌంటర్‌ ఇస్తూ.. ట్విటర్‌లో సర్జికల్‌ స్ట్రయిక్స్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.


కేసీఆర్‌ ఓ ద్రోహిలా మాట్లాడుతున్నారని, భారత సైన్యాన్ని కించపరిస్తే సహించేదిలేదని తేల్చిచెప్పారు. హిమంత బిశ్వ వ్యాఖ్యలపై తెలంగాణలో కేసులు నమోదు కాగా.. ఇప్పుడు అసోంలోనూ ఎఫ్‌ఐఆర్‌లు పెట్టేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలిసింది. భారత సైన్యాన్ని కించపరిచారంటూ అసోం బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకట్రెండ్రోజుల్లో అసోంలో కౌంటర్‌ కేసులు దాఖలయ్యే అవకాశాలున్నాయని పోలీసువర్గాలు తెలిపాయి.

Read more