యథావిధిగానే ‘పోలీస్‌ ప్రిలిమ్స్‌’

ABN , First Publish Date - 2022-07-05T09:47:28+05:30 IST

తెలంగాణలో 16,875 పోలీస్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే ప్రిలిమినరీ రాత పరీక్షలు యథావిధిగానే కొనసాగుతాయని రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామాక మండలి(టీఎస్‌ఎల్పీఆర్బీ) వెల్లడించింది.

యథావిధిగానే ‘పోలీస్‌ ప్రిలిమ్స్‌’

  • ఆగస్టు7న ఎస్సై, 21న కానిస్టేబుల్‌ పరీక్ష
  • 30 నుంచి సైట్‌లో ఎస్సై హాల్‌ టికెట్లు
  • వెల్లడించిన పోలీస్‌ నియామక మండలి 


హైదరాబాద్‌, జూలై 4(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 16,875 పోలీస్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే ప్రిలిమినరీ రాత పరీక్షలు యథావిధిగానే కొనసాగుతాయని రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామాక మండలి(టీఎస్‌ఎల్పీఆర్బీ) వెల్లడించింది. గతంలో ప్రకటించినట్లుగానే ఆగస్టు 7న ఎస్సై, అదే నెల 21న కానిస్టేబుల్‌ రాత పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. రెండు పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటాయని తెలిపింది. ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలకు సంబంధించి పోలీస్‌ నియామక మండలి సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 554 ఎస్సై, 16,321 కానిస్టేబుల్‌ పోస్టులకు వేర్వేరుగా రాత పరీక్షలుంటాయని తెలిపింది. ఎస్సై పరీక్షకు 2.45 లక్షలు, కానిస్టేబుల్‌కు 6.50 లక్షలు.. రెండింటికీ 8.95 లక్షల దరఖాస్తులు వచ్చాయని వివరించింది. ఎస్సై హాల్‌టికెట్లు ఈ నెల 30 నుంచి, కానిస్టేబుల్‌ హాల్‌టికెట్లు ఆగస్టు 10 నుంచి తమ అధికారిక వెబ్‌సైట్‌ ఠీఠీఠీ.్టటజూఞటఛ.జీుఽ లో అందుబాటులో ఉంచుతామని వివరించింది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఇచ్చిన మొబైల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అయి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. పోలీస్‌ ప్రిలిమినరీ రాత పరీక్షలకు సంబంధించి కేంద్రాలను ఇప్పటికే గుర్తించామని, ఎస్సై పరీక్షను హైదరాబాద్‌ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20 పట్టణాల్లో, కానిస్టేబుల్‌ పరీక్షను 40 పట్టణాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపింది. హోంశాఖలోని 15,644, ఎక్సైజ్‌ శాఖలోని 614, రవాణా శాఖలోని 63 కానిస్టేబుల్‌ పోస్టులకు ఒకే పరీక్ష ఉంటుందని తెలిపింది.


యూపీఎస్సీ, ఐబీపీఎస్‌ పరీక్షలున్నా..!

పోలీస్‌ నియామక మండలి ప్రకటించిన ఆగస్టు 7, 21 తేదీల్లో ఇతర రాత పరీక్షలుండటం గమనార్హం. ఎస్సై పరీక్ష జరిగే ఆగస్టు 7న  పారామిలటరీ బలగాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులకు యూపీఎస్సీ.. ఆఫీస్‌ అసిస్టెంట్‌తో పాటు గామీణ బ్యాంకుల్లో క్లర్క్‌ పోస్టుల కోసం ఐబీపీఎస్‌ ప్రిలిమినరీ రాత పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వీటి కోసం తెలంగాణ నుంచి చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. ఐబీపీఎస్‌ క్లర్క్‌ పరీక్షలు సెప్టెంబరు 4 వరకు కొనసాగనున్నాయి. కానిస్టేబుల్‌ పరీక్ష జరిగే ఆగస్టు 21న కూడా ఐబీపీఎస్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌తో పాటు క్లర్క్‌ పోస్టులకు పరీక్షలున్నాయి. ఆ పరీక్షలు హైదరాబాద్‌ సహా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో జరగనున్నాయి. అయితే, ఐబీపీఎస్‌, యూపీఎస్సీ దేశవ్యాప్తంగా ఒకేసారి పరీక్షలు నిర్వహిస్తుంటాయి. వాటిని వాయిదా వేయడం కుదరదు. ఆ పరీక్షలున్న తేదీల్లో కాకుండా.. మిగతా తేదీల్లో రాష్ట్ర స్థాయి బోర్డులు పరీక్షలు నిర్వహిస్తుంటాయి. ఇటీవల టీఎ్‌సపీఎస్సీ కూడా అదే పనిచేసింది. సెప్టెంబరు వరకు దేశవ్యాప్తంగా వివిధ పరీక్షలున్నాయని, ఈ నేపథ్యంలోనే అక్టోబర్‌ 16న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.


ఈ విషయం తెలిసి కూడా ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష తేదీలను పోలీస్‌ నియామక మండలి ప్రకటించింది. దీనిపై పోలీస్‌ అధికారులను వివరణ కోరగా.. ‘‘యూపీఎస్సీ అసిస్టెంట్‌ కమాండెంట్‌, ఐబీపీఎస్‌ పరీక్షలకు తెలంగాణ నుంచి చాలా తక్కువ మంది హాజరవుతున్నారు. రాష్ట్రంలో 16,875 పోలీస్‌ పోస్టులకు దాదాపు 8.95 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో ఒక్క శాతం కూడా యూపీఎస్సీ, ఐబీపీఎస్‌ పరీక్షలను రాయడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రిలిమినరీ రాత పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తున్నాం’’ అని సమాధానమిచ్చారు. 

Read more