ఆరోగ్య శ్రీపై చిన్న చూపు తగదు

ABN , First Publish Date - 2022-10-02T10:06:53+05:30 IST

రాష్ట్రంలో పేద ప్రజలు ఆస్పత్రులకు బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని...

ఆరోగ్య శ్రీపై చిన్న చూపు తగదు

  • పేదోళ్లు ఆస్పత్రి బిల్లులు కట్టలేక పోతున్నారు
  • అనేక కుటుంబాలు వైద్యానికి దూరమవుతున్నయ్‌
  • పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయండి
  • సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌లను కోరిన జగ్గారెడ్డి  

హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పేద ప్రజలు ఆస్పత్రులకు బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ తరుణంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి వారిని ఆదుకోవాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలు కావట్లేదని చెప్పినా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, ఈ పథకం పట్ల సీఎం కేసీఆర్‌ చిన్నచూపు చూస్తున్నారని, ఇది తగదని శనివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ పథకం అమలు కాకపోవడం వల్ల అనేక కుటుంబాలు వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మనిషినీ బతికించే ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దరఖాస్తు చేసుకుంటే.. రూ. 10 లక్షల మేరకు ఆస్పత్రి బిల్లుకు.. కేవలం రూ. 30 వేలు మాత్రమే మంజూరవుతున్నాయని పేర్కొన్నారు.


ఇదే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం రూ.8 లక్షల వరకు మంజూరవుతుండేవని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ పథకమూ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో అమలైందన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎ్‌సఆర్‌ ఎంతో ఆలోచన చేసి పేదల కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. ఆ తర్వాత సీఎంలు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలూ ఈ పథకాన్ని బాగానే అమలు చేశారన్నారు. వైఎ్‌సఆర్‌తో పాటుగా రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల హయాంలో నూ పేదవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి డబ్బులు ఎక్కువ మొత్తంలో అందాయన్నారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. గతంలో ఇంటెలిజెన్స్‌ డిపార్ట్‌మెంట్‌.. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాల్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళేదన్నారు. ప్రస్తుత ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఎప్పుడైనా ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో సీఎం దృష్టికి తీసుకెళ్లిన సందర్భం ఉందా అని ప్రశ్నించారు. ఇకనైనా ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌ రావులు చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి కోరారు. 

Updated Date - 2022-10-02T10:06:53+05:30 IST