ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి హత్యకు కుట్ర!

ABN , First Publish Date - 2022-08-03T10:11:41+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర జరిగిందన్న వార్త తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి హత్యకు కుట్ర!

  • ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్లి నుదుటికి తుపాకీ పెట్టి 
  • బెదిరించారంటూ ఒకరి అరెస్టు 
  • నిందితుడు నిజామాబాద్‌ జిల్లా కల్లెడ వాసి 
  • నిందితుడి నుంచి 2 తుపాకులు,  కత్తి స్వాధీనం 
  • అందులో ఒకటి బొమ్మ తుపాకీ? 
  • నా భర్త కుట్ర లేదు.. 18లక్షల బిల్లులు పెండింగ్‌ 
  • ఎమ్మెల్యేను కలిసేందుకే వెళ్లారు
  • నిందితుడి భార్య మాజీ సర్పంచ్‌ లావణ్య 
  • పంచాయతీ రికార్డుల్లో అవకతవకలు
  • ఆర్నెల్ల క్రితం లావణ్య సస్పెన్షన్‌ 


నిజామాబాద్‌, బంజారాహిల్స్‌, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర జరిగిందన్న వార్త తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇందుకు సంబంధించి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆ జిల్లాలోని మాక్లూరు మండలం కల్లెడి గ్రామవాస్తవ్యురాలు, ఆ గ్రామ సర్పంచ్‌ పదవి నుంచి సస్పెండ్‌ అయిన లావణ్య భర్త పెద్దగాని ప్రసాద్‌గౌడ్‌. సోమవారం రాత్రి హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని జీవన్‌రెడ్డి నివాసంలోకి ప్రసాద్‌గౌడ్‌ ప్రవేశించారని, జీవనరెడ్డికి పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో పిస్తోల్‌ పెట్టి బెదిరించారని ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. అవినీతి ఆరోపణలతో సర్పంచ్‌ పదవి నుంచి లావణ్యను సస్పెండ్‌ చేయడం, అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను క్లియర్‌ చేయకపోవడంతోనే ప్రసాద్‌గౌడ్‌ ఈ ఘటనకు పాల్పడినట్లు ఆరోపణలు వ్యక్తమవవుతున్నాయి. నిందితుడి వద్ద నుంచి రెండు పిస్తోళ్లు, ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకునట్లు తెలిసింది. కాగా తన భర్త ప్రసాద్‌గౌడ్‌పై వ్యక్తమైన ఆరోపణలను లావణ్య ఖండించారు. జీవన్‌రెడ్డిని హత్య చేసేందుకు తన భర్త కుట్రపన్నలేదని చెప్పారు. ఎమ్మెల్యేను కలిసేందుకు హైదరాబాద్‌కు వెళితే, ఉద్దేశపూర్వకంగా నేరాన్ని మోపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు.


పడకగదిలోకి వెళ్లి.. నుదుటికి తుపాకీ పెట్టి

 ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12లోని జీవన్‌రెడ్డి నివాసానికి కారులో ప్రసాద్‌గౌడ్‌  చేరుకున్నారు. వాహనాన్ని బయట పార్క్‌ చేసి లోపలికి ప్రవేశించారు. అప్పటికి హాల్లో కొంత మంది పనివారు ఉండటాన్ని గమనించి విజిటర్స్‌ గదిలోకి వెళ్లారు. పనివారంతా అక్కడి నుంచి వెళ్లిపోయేదాకా వేచివుండి.. ఒక్కసారిగా లిఫ్టు ఎక్కి మూడో అంతస్తుకు చేరుకున్నారు. నేరుగా జీవన్‌రెడ్డి పడకగదిలోకి వెళ్లారు. అక్కడ తన జేబులో ఉన్న పిస్తోలు తీసి జీవన్‌రెడ్డి నుదుటికి గురిపెట్టారు. తనకు న్యాయం చేయాలని, లేదంటే చంపేస్తానని ఆయన్ను బెదిరించారు. షాక్‌లోంచి తేరుకున్న జీవన్‌రెడ్డి గట్టిగా అరవడంతో వంటమనిషి గంగాధర్‌ మిగతా సిబ్బంది అక్కడికి వచ్చి ప్రసాద్‌గౌడ్‌ను వెనుక నుంచి పట్టుకున్నారు. అతడి జేబులో కత్తి కూడా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం సిబ్బంది, బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 


ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు ప్రసాద్‌గౌడ్‌పై హత్యాయత్నం, అక్రమ చొరబాటు, ఆయుధాల వాడకం, బెదిరింపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని టాస్క్‌ఫోర్స్‌ బృందం పరిశీలించింది. కాగా ప్రసాద్‌ కారులో మరో పిస్తోల్‌ను కూడా పోలీసులు గుర్తించారు. ప్రసాద్‌గౌడ్‌ నుంచి స్వాధీనం చేసుకున్న రెండు పిస్తోళ్లలో ఒకటి బొమ్మ తుపాకీ అని సమాచారం. ఈ అయుధాలను పోలీసులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. ప్రసాద్‌గౌడ్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఇంకా ఎవరి ప్రమేయం ఉందా? అనే కోణంలో విచారిస్తున్నారు.  టీఆర్‌ఎస్‌ శ్రేణుల వివరాల ప్రకారం.. ప్రసాద్‌గౌడ్‌, లావణ్య దంపతులు చాలా కాలంగా టీఆర్‌ఎ్‌సలో పనిచేస్తున్నారు. లావణ్య రెండుసార్లు టీఆర్‌ఎస్‌ తరఫున కల్లెడి  సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. గత సర్పంచ్‌ ఎన్నికలకు ముందుకు భార్యాభర్తలు బీజేపీలో చేరారు. బీజేపీ మద్దతుతో లావణ్య సర్పంచ్‌గా గెలిచారు. తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో దంపతులు రెండేళ్ల క్రితం మళ్లీ టీఆర్‌ఎ్‌సలోకి మారారు. ఆరు నెలల క్రితం కల్లెడి గ్రామ పంచాయతీలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 


గ్రామంలో అనుమతుల్లేకుండా పనులు చేపట్టి బిల్లులు పెట్టారని, రూ.5లక్షల మేర నిధులు దుర్వినియోగమయ్యాయని గుర్తించి.. సర్పంచ్‌ పదవి నుంచి లావణ్యను, ఉప సర్పంచ్‌ పదవి నుంచి మహేశ్‌గౌడ్‌ను సస్పెండ్‌ చేశారు గ్రామ ప్రత్యేధికారిగా బాధ్యతల కోసం మండల పంచాయతీ అధికారి శ్రీనివా్‌సను నియమించారు. కాగా తన భార్యపై సస్పెన్షన్‌ వేటు వెనుక జీవన్‌రెడ్డే ఉన్నారని ప్రసాద్‌ ఆగ్రహంతో ఉన్నారు. అప్పటి నుంచి ప్రసాద్‌గౌడ్‌కు, జీవన్‌రెడ్డికి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. పలుమార్లు ఆయన, జీవన్‌రెడ్డిని కలిసి వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. ఈ క్రమంలో మూడు నెలల క్రితం ఫేస్‌బుక్‌ వేదికగా జీవన్‌రెడ్డిని ప్రసాద్‌గౌడ్‌ తీవ్ర పదజాలంతో దూషిస్తూ పోస్టు పెట్టాడు. జీవన్‌రెడ్డి వందల ఎకరాలతో పాటు భారీగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని ఆరోపించారు. తనపై వేధింపులు మానుకోకుంటే ఖబడ్దార్‌ అంటూ ఆయన్ను హెచ్చరించారు. అప్పట్లో ప్రసాద్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరంగా మారింది. రెండు నెలల క్రితం బిల్లుల విషయమై గ్రామ పంచాయతీలో ఉన్న ప్రత్యేక అధికారి శ్రీనివా్‌సను ప్రసాద్‌గౌడ్‌ నిలదీసి, చేయిచేసుకున్నారు. ఆపై ఆ అధికారిమీద కేసు కూడా పెట్టారు. ఆ తర్వాత జీవన్‌రెడ్డిని కలిసి భార్యపై సస్పెన్షన్‌ ఎత్తివేసే విధంగా సహకరించాలని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ క్రమంలో కల్లెడి సర్పంచ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేసేందుకు విచారణ చేపట్టిన అధికారులు ఆ ఫైల్‌ను ఇటీవలే నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డికి పంపారు. మరో రెండు మూడు రోజుల్లో సర్పంచ్‌పై కలెక్టర్‌ సస్పెన్షన్‌ ఎత్తివేయనున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఈ ఘటన జరగింది. 



50వేలకు పిస్తోలు కొనుగోలు

అసలు ప్రసాద్‌ వద్దకు పిస్తోలు ఎలా వచ్చింది? అనే దానిపై పోలీసులు దృష్టిసారించా రు. అయితే పిస్తోల్‌ కోనుగోలు చేసేందుకు ఓ వ్యక్తితో ప్రసాద్‌ బేరసారాలు చేసినట్టు వాట్సప్‌ స్ర్కీన్‌ షాట్‌లు సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఇందులో పిస్తోల్‌ కోసం రూ.50వేలు వెచ్చించి కొనుగోలు చేసినట్లుగా ఉంది. అయితే ఇందులో వాస్తవమెంత అనేది విచారణలో తేలాల్సి ఉంది. పిస్తోల్‌ను ప్రసాద్‌కు అమ్మిన వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. 


ఎమ్మెల్యే కక్ష గట్టడం సరికాదు

ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని హత్యచేసేందుకు నా భర్త ప్రసాద్‌ కుట్ర పన్నలేదు. ఎమ్మెల్యేను కలిసేందుకు హైదరాబాద్‌కు వెళితే, కావాలనే నేరం మోపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టగా రూ. 18లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ బిల్లులు ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఈ విషయమై పలుమార్లు అధికారులతో పాటు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని నేను, నా భర్త కలిసి బిల్లు ఇప్పించేలా చూడాలని కోరాం. బిల్లులు రాకపోవడంతో ప్రతి నెల రూ. 50వేల వరకు వడ్డీలు కడుతున్నాం. అందువల్లే ఎమ్మెల్యేను కలిసేందుకు నా భర్త హైదరాబాద్‌కు వెళ్లారు. ఆయనపై నిందలు మోపి, అరెస్టు చేయడం సరికాదు. అన్నీ తెలిసిన ఎమ్మెల్యే  కక్ష గట్టడం సరికాదు. నా భర్తను విడుదల చేయాలి. 

                                                                                       - లావణ్య, కల్లెడి గ్రామ సర్పంచ్‌


నిధుల దుర్వినియోగం వల్లే సర్పంచ్‌ సస్పెన్షన్‌ 

గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం చేయడం వల్లే తనిఖీలు చేసి కల్లెడి గ్రామ సర్పంచ్‌ లావణ్యను సస్పెండ్‌ చేశాం. పనులు చేసిన దానికి ఎంబీ రికార్డులు సమర్పించకపోవడం, గ్రామ పంచాయతీలో నిధులు వాడుకోవడం వల్ల ఆరు నెలల పాటు సర్పంచ్‌ను కలెక్టర్‌ నారాయణ రెడ్డి సస్పెండ్‌ చేశారు. దుర్వినియోగం చేసిన నిధులను ఈ మధ్యనే సర్పంచ్‌ లావణ్య చాలన్‌ ద్వారా చెల్లించారు. సర్పంచ్‌ సస్పెన్షన్‌ ఎత్తివేతపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. 

- జయసుధ, నిజామాబాద్‌ జిల్లా పంచాయతీ అధికారి

Updated Date - 2022-08-03T10:11:41+05:30 IST