అర్హులా? అనర్హులా?

ABN , First Publish Date - 2022-07-08T08:28:22+05:30 IST

రేషన్‌ కార్డుల రద్దును ఏకపక్షంగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో దిగొచ్చి, దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

అర్హులా? అనర్హులా?

  • రద్దుచేసిన 19 లక్షల రేషన్‌ కార్డుల పునః పరిశీలన
  • 2014లో అనర్హుల పేరుతో తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం
  • సుప్రీంకోర్టు ఆదేశాలతో దిగివచ్చి దిద్దుబాటు చర్యలు
  • ఐదో తేదీ నుంచి ప్రక్రియ షురూ.. 20 వరకూ డెడ్‌లైన్‌

హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ కార్డుల రద్దును ఏకపక్షంగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో దిగొచ్చి, దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈమేరకు షెడ్యూలును ప్రకటించి జూలై ఐదో తేదీ నుంచి పునఃపరిశీలన ప్రారంభించింది. 20 నాటికి పరిశీలన ముగించి అర్హులెవరో, అనర్హులెవరో తేల్చాలని భావిస్తోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రేషన్‌ కార్డుల ప్రక్షాళన  వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. 19 లక్షల రేషన్‌ కార్డులను ఎలాంటి విచారణ చేపట్టకుండా ఏకకాలంలో రద్దుచేయడంతో అర్హులకు అన్యాయం జరిగిందనే చర్చ కొన్నేళ్లుగా సాగుతోంది. దీనిపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌. గవాయ్‌తో కూడిన బెంచ్‌ ఏప్రిల్‌ 27న విచారణ జరిపింది. ఇంత భారీ సంఖ్యలో రేషన్‌ కార్డులను రద్దు చేయడమేంటని విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో సరైన పరిశీలన చేయకుండా.. కంప్యూటర్లలోని వివరాల ఆధారంగా ఎలా తొలగిస్తారని ప్రశ్నించింది.  కార్డుల రద్దుకు ఏ ప్రమాణాలు పాటించారో పేర్కొంటూ అఫిడవిట్‌ సమర్పించాలని.. 2016 లో కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం క్షేత్రస్థాయిలో పునః పరిశీలించాలని ఆదేశించింది. ఈమేరకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. విమర్శలకు తావు లేకుండా పరిశీలన చేపట్టాలని జిల్లాల కలెక్టర్లు, హైదరాబాద్‌ సీఆర్‌వోతో పాటు, అదనపు కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. తనిఖీల్లో అవకతవకలకు పాల్పడినట్లు తేలితే ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ అధికారులపై చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 


ఇవీ మార్గదర్శకాలు

రేషన్‌ కార్డులు రద్దైన లబ్ధిదారుల వివరాలను రేషన్‌ షాపుల నుంచి తీసుకొని నోటీసులు పంపాలి. డిలీట్‌ అయిన రేషన్‌ లబ్ధిదారుల జాబితాను అన్ని రేషన్‌ షాపులు, గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించాలి. 

అర్హులుగా తేలితే కారణాలు రాసి, వివరాలను నమోదుచేసి ఈ- పీడీఎస్‌ అప్లికేషన్‌లో ఇచ్చిన లింక్‌లో అప్‌లోడ్‌ చేయాలి.తొలగించిన కార్డులు సరైనవే అయితే అందుకుగల కారణాలను సైతం అధికారులు నివేదికలో నమోదు చేయాల్సి ఉంటుంది.

లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియలో సమస్యలుంటే జిల్లా పౌరసరఫరాల అధికారి దృష్టికి తీసుకురావాలి.


Updated Date - 2022-07-08T08:28:22+05:30 IST