ఢిల్లీలో ప్రశంసలు.. గల్లీలో విమర్శలా?

ABN , First Publish Date - 2022-09-30T08:33:39+05:30 IST

తెలంగాణలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఢిలీల్లో ప్రశంసిస్తున్న కేంద్రమంత్రులు..

ఢిల్లీలో ప్రశంసలు.. గల్లీలో విమర్శలా?

  • కేంద్ర మంత్రులపై హరీశ్‌ ధ్వజం
  • గ్రామీణంలో 100 శాతం గృహాలకు శుద్ధజలం
  • ప్రధాని, నీతి ఆయోగ్‌ ప్రతినిధులూ ప్రశంసించారు
  • నిధులు మాత్రం ఇవ్వడంలేదు: ఆర్థిక మంత్రి
  • అవార్డులతోపాటు నిధులూ ఇవ్వండి: ఎర్రబెల్లి

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఢిలీల్లో ప్రశంసిస్తున్న కేంద్రమంత్రులు.. రాష్ట్రానికి వచ్చి గల్లీల్లో నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణలో మిషన్‌ భగీరథ పథకాన్ని, ప్రధాని మోదీతోపాటు కేంద్ర విభాగాలు, నీతి అయోగ్‌, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు సైతం ప్రశంసించారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతరం శుద్ధజలం అందిస్తున్న రాష్ట్రంగా తాజాగా వచ్చిన అవార్డుతోపాటు ఇప్పటి వరకు మిషన్‌ భగీరథకు 20కి పైగా అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ అవార్డుతోనైనా కేంద్ర మంత్రులకు కనువిప్పు కలగాలని ఆయన ఆకాంక్షించారు. మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. డబ్ల్యూహెచ్‌వో నిబంధనల ప్రకారం మిషన్‌ భగీరథ ద్వారా నిరంతరం శుద్ధ జలాన్ని అందజేశామని హరీశ్‌ వెల్లడించారు. తెలంగాణలోని గ్రామీణప్రాంతాల్లో ఉన్న గృహాలకు 100శాతం నల్లాలద్వారా మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు దేశంలో 50 శాతం గృహాలకు కూడా నల్లా నీరు అందించలేని పరిస్థితిలో ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మిషన్‌భగీరథ పథకం నిర్వహణకు రూ.19వేల కోట్లివ్వాలని నీతి అయోగ్‌ చేసిన సూచనను, సెక్టర్‌ స్పెసిఫిక్‌, స్టట్‌ స్పెసిఫిక్‌ కింద రూ.5300 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం చేసిన ప్రతిపాదనను సైతం కేంద్రం పక్కనపెట్టిందని చెప్పారు. ఆర్థిక సంఘం ప్రతిపాదనలను పట్టించుకోని ఏకైక కేంద్ర ప్రభుత్వం ఇదేనని ఆయన ఆరోపించారు. తాగునీరు, సాగునీరు, విద్యుత్‌, ఇతర సమస్యలకు సీఎం కేసీఆర్‌ శాశ్వత పరిష్కారం చూపారని, దీంతో ఈ అంశాలపై గతంలో మాదిరిగా రాష్ట్రంలో ఆందోళనలు జరగడంలేదని హరీశ్‌ చెప్పారు. రాష్ట్రంలో సైకిల్‌ యాత్ర, మోకాళ్ల యాత్ర చేస్తున్న కొందరు నేతలు ఎక్కడైనా ఈ సమస్యలు ప్రస్తావిస్తున్నారా.. అని ఆయా పార్టీలపై వ్యంగాస్త్రాలు సంధించారు. మిషన్‌ భగీరథ అమలు వల్లే రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు విస్తరించడం లేదని, ఫ్లోరైడ్‌ సమస్యను సైతం శాశ్వతంగా నిర్మూలించగలిగామని వెల్లడించారు.


ఈ అవార్డు ప్రజలకు అంకితం

మిషన్‌ భగీరథ అమలులో భాగంగా జాతీయ జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా అక్టోబరు 2న అందుకోనున్న అవార్డును తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని, ఈ విజయం సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్రజలదేనని హరీశ్‌రావు వెల్లడించారు. అంతకుముందు మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రానికి ఒకేసారి 14 జాతీయ అవార్డులు వచ్చాయని, పనితీరును ప్రశంసిస్తూ.. అవార్డులు ఇవ్వడమే కాకుండా వాటి నిర్వహణకు నిధులిచ్చి ప్రోత్సహించాలని సూచించారు. 

Read more