మరో ప్రాణం..

ABN , First Publish Date - 2022-08-31T08:20:23+05:30 IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం క్లస్టర్‌ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ)లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న మహిళల్లో మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది.

మరో ప్రాణం..

కు.ని. ఘటనలో నాలుగుకు చేరిన మరణాలు


చికిత్స పొందుతూ మరణించిన లావణ్య 

ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై సస్పెన్షన్‌ వేటు

శస్త్రచికిత్సలు చేసిన వైద్యుడి లైసెన్స్‌ రద్దు  

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

డబుల్‌ ఇళ్లు, పిల్లలకు గురుకులాల్లో చదువులు

మిగతా మహిళల ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణ

ఘటనపై విచారణ చేపట్టాం.. వారంలో నివేదిక 

కు.ని. ఆపరేషన్లకు మగవారు ముందుకు రావాలి

మీడియాతో డీహెచ్‌ డాక్టర్‌ గడల శ్రీనివాసరావు

అపోలోలో 13, నిమ్స్‌లో 12 మందికి చికిత్స


హైదరాబాద్‌/ఇబ్రహీంపట్నం, ఆగస్టు 30 (ఆంఽధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం క్లస్టర్‌ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ)లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌  చేయించుకున్న మహిళల్లో మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇబ్రహీంపట్నం మునిసిపాలిటీ పరిధిలోని సీతారాంపేట్‌కు చెందిన అవుతాపురం లావణ్య(26) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఆపరేషన్‌ తరువాత లావణ్య.. వాంతులు, విరేచనాలతో తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఈ నెల 26న ఆమెను హైదరాబాద్‌లోని ఒవైసీ ఆస్పత్రిలో చేర్పించారు.


చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది. దీంతో ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న 34 మందిలో మృతి చెందిన వారి సంఖ్య 4కు చేరింది. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సస్పెండ్‌ చేసింది. ఆపరేషన్లు చేసిన వైద్యుడి వైద్య లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేసింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా 18 మంది మహిళలను మంగళవారం ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీకి తీసుకువచ్చారు. వీరికి స్కానింగ్‌, రక్తపరీక్షలు నిర్వహించారు. మధ్యాహ్నం తర్వాత ముగ్గురిని అపోలో ఆస్పత్రికి, 11 మందిని నిమ్స్‌కు తరలించారు. మరో నలుగురికి ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే మరికొందరు మహిళలు ఆపోలో, నిమ్స్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక నల్లగొండ జిల్లా ఆస్పత్రిలో మరో మహిళ చికిత్స పొందుతోంది. కాగా, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. దాంతోపాటు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, వారి పిల్లలకు ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో అడ్మిషన్లు కల్పించాలని సర్కారు నిర్ణయించినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ తర్వాత నలుగురు మహిళలు మరణించడం చాలా బాధాకరమన్నారు. ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారని తెలిపారు. పూర్తిస్థాయి విచారణ జరిపి, వారంలోగా నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించినట్లు పేర్కొన్నారు. 


30 మందిని అబ్జర్వేషన్‌లో ఉంచాం..
కు.ని. ఆపరేషన్‌ జరిగిన 34 మందిలో మిగిలిన 30 మంది మహిళల ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా అబ్జర్వేషన్‌లో ఉంచామని డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. శస్త్రచికిత్స జరిగిన చోట ఏమైనా ఇన్ఫెక్షన్‌ ఉందా? అన్న విషయంపై కూడా దృష్టిసారించామన్నారు. ఘటనపై ప్రభుత్వం ఐదుగురు నిపుణుల బృందంతో విచారణ కమిటీని వేసిందని, దీనిపై వారంలో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అన్నారు. గతేడాది లక్షన్నర కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను చేసినట్లు వెల్లడించారు. ఈఏడాది ఇప్పటివరకు 111 క్యాంపుల ద్వారా 38 వేల కు.ని శస్త్రచికిత్సలు చేశామని, ఇంతవరకు ఎక్కడా ఇటువంటి ఘటనలు చోటుచేసుకోలేదని అన్నారు. కు.ని. ఆపరేషన్లపై ఆడిట్‌ జరుగుతోందని, సర్జన్లపై నిందలు వేయలేమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.  అలాగే మన రాష్ట్రానికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఒక క్యాంపు మోడ్‌లో చేయాల్సిన అవసరం లేదని డీహెచ్‌ అభిప్రాయపడ్డారు. ఇక కు.ని. ఆపరేషన్ల కార్యక్రమం అంతా కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ పరిధిలోనిదని తెలిపారు. న్నారు. ఒక క్యాంపు మోడ్‌లో పూర్తిగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే కు.ని. శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సర్జరీలు చేసే వైద్యులకు శిక్షణ కూడా కేంద్రమే ఇస్తుందన్నారు. 

మగవాళ్లు ముందుకురావాలి..
కు.ని ఆపరేషన్లకు మగవారు ముందుకు రావాలని డీహెచ్‌ పిలుపునిచ్చారు. మహిళల ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులుంటాయని, అలాగే పిల్లలు, కుటుంబ బాధ్యతలను చూసుకుంటారని, ఈ నేపథ్యంలో మగవారు కు.ని చేయించుకోవాలని కోరారు. మన రాష్ట్రంలో ఏటా 1.54 లక్షల కు.ని సర్జరీలు జరుగుతుంటే అందులో కేవలం 3 శాతం సర్జరీలే పురుషులు చేయించుకుంటున్నారని తెలిపారు. కాగా, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌ మంగళవారం ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీని సందర్శించారు.

Updated Date - 2022-08-31T08:20:23+05:30 IST