మూడో త్రైమాసికంలో మరో రూ.8,578 కోట్ల అప్పు!

ABN , First Publish Date - 2022-09-30T08:52:59+05:30 IST

అక్టోబరు 1 నుంచి ప్రారంభం కానున్న మూడో త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.8,578 కోట్ల రుణాలు సేకరించనుంది.

మూడో త్రైమాసికంలో మరో రూ.8,578 కోట్ల అప్పు!

సేకరణకు సిద్ధమైన రాష్ట్ర సర్కారు..వివరాలు వెల్లడించిన ఆర్బీఐ

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): అక్టోబరు 1 నుంచి ప్రారంభం కానున్న మూడో త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.8,578 కోట్ల రుణాలు సేకరించనుంది. ఈ మేరకు భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్బీఐ)కు అప్పుల సేకరణ సమాచారాన్ని సమర్పించింది. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రాబోయే మూడు నెలల్లో (అక్టోబరు, నవంబరు, డిసెంబరు) తీసుకోబోయే మార్కెట్‌ రుణాలకు సంబంధించిన కేలండర్‌ను ఆర్బీఐ గురువారం విడుదల చేసింది.


 అక్టోబరు 3న రూ.2,500 కోట్లు, 11న రూ.500 కోట్లు, 25న రూ.500 కోట్లు, నవంబరు 1న రూ.1,500 కోట్లు, 15న రూ.1000 కోట్లు, 29న రూ.500 కోట్ల చొప్పున రుణాలను తీసుకోబోతోంది. డిసెంబరు 6న రూ.1,500 కోట్లు, 13న రూ.578 కోట్ల అప్పు తీసుకోనుంది. ఇలా మూడో త్రైమాసికంలో మొత్తం రూ.8,578 కోట్ల రుణాలను తీసుకోబోతుందని ఆర్బీఐ తెలిపింది. ఏప్రిల్‌ నుంచి ప్రారంభమైన ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్ల అప్పులు చేసింది. మూడో త్రైమాసిక అప్పులనూ కలిపితే డిసెంబరు నాటికి మొత్తం రుణాలు రూ.28,578 కోట్లకు చేరనున్నాయి. సెక్యూరిటీ బాండ్లను విక్రయించడం ద్వారా రూ.2,500 కోట్ల అప్పును సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆర్బీఐకి ఇండెంట్‌ పెట్టింది. 12 ఏళ్ల కాల పరిమితితో రూ.1000 కోట్లు, 13 ఏళ్లతో రూ.1000 కోట్లు, 14 ఏళ్ల కాల పరిమితితో రూ.500 కోట్ల రుణం తీసుకోనుంది. అక్టోబరు 3న ఆర్బీఐ నిర్వహించే ఈ-వేలం పాట ద్వారా ఈ అప్పును సేకరించనుంది.

Read more