హైదరాబాద్‌లో మరో జంతువుల టీకా యూనిట్
ABN , First Publish Date - 2022-10-11T08:56:44+05:30 IST
హైదరాబాద్‌లో మరో జంతువుల వ్యాక్సిన్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) సిద్ధమైంది.

- రూ.700 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఐఐఎల్
- మంత్రి కేటీఆర్‌తో కంపెనీ ప్రతినిధుల భేటీ
హైదరాబాద్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో మరో జంతువుల వ్యాక్సిన్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) సిద్ధమైంది. జాతీయ డెయిరీ డెవల్‌పమెంట్ బోర్డుకు అనుబంధ సంస్థగా ఉన్న ఐఐఎల్ రూ.700 కోట్లతో ఈ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. పశువుల నోరు, పాదాలకు వచ్చే వ్యాధులకు టీకాలను ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. ఐఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్కె.ఆనంద్ కుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు ముకుల్ గౌర్, ఎన్ఎ్సఎన్ భార్గవతో పాటు సంస్థ ఉన్నతాధికారులు సోమవారం మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. తమ సంస్థ విస్తరణ ప్రణాళికలను వివరించారు. అత్యాధునిక సౌకర్యాలతో బయోసేఫ్టీ లెవెల్ 3 ప్రమాణాలతో నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటికే గచ్చిబౌలిలో ఉన్న తయారీ కేంద్రం సామర్థ్యం సంవత్సరానికి 300 మిలియన్ డోసులని, కొత్తగా ఏర్పాటు చేసే యూనిట్‌తో అదనంగా 300 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుందన్నారు.
ఇది వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారతదేశ స్వయంసమృద్ధి నిదర్శనమని ఆనంద్ కుమార్ చెప్పారు. తమ వ్యాక్సిన్‌తో పశువులకు వచ్చే తీవ్రమైన వ్యాధులు తగ్గడంతో పాటు రైతులకు, దేశానికి రూ.వేల కోట్లు ఆదా అవుతాయన్నారు. ఐఐఎల్ ఉత్పత్తులు 50 దేశాలకు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. జీనోమ్ వ్యాలీలో మరో వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషంగా ఉందని కేటీఆర్ చెప్పారు. ఈ కేంద్రంతో ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ జోరు కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.