అనుమతిచ్చి.. అభ్యంతరాలేంటి?

ABN , First Publish Date - 2022-10-18T08:50:05+05:30 IST

కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇచ్చి, మళ్లీ అభ్యంతరాలు వ్యక్తం చేయడం పట్ల సీఎం కేసీఆర్‌ కేంద్రంపై గుర్రుగా ఉన్నారు.

అనుమతిచ్చి.. అభ్యంతరాలేంటి?

  • కాళేశ్వరంపై సీడబ్ల్యూసీ 
  • అభ్యంతరాల పట్ల సీఎం కేసీఆర్‌ గుర్రు
  • నీటిపారుదల శాఖ అధికారులతో ఢిల్లీలో భేటీ
  • సీడబ్ల్యూసీ అభ్యంతరాలు, డీపీఆర్‌లపై చర్చ
  • సీఎం ఆదేశంతో సీడబ్ల్యూసీకి అధికారుల వివరణ
  • కేసీఆర్‌కు జ్వరం.. అక్కడే చికిత్స తీసుకుంటున్న సీఎం
  • ఆయనతో పాటు సతీమణి, కుమార్తె కూడా ఢిల్లీలోనే!

హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇచ్చి, మళ్లీ అభ్యంతరాలు వ్యక్తం చేయడం పట్ల సీఎం కేసీఆర్‌ కేంద్రంపై గుర్రుగా ఉన్నారు. ఈ పథకంపై కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించడానికి ఆయన ఢిల్లీలో అధికారులతో భేటీ అయ్యారు. అంతకు ముందు సీఎంవో ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌తో పాటు ఈఎన్‌సీలు, ఇతర అధికారులంతా హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. సోమవారం కేసీఆర్‌తో సమావేశమై, పరిస్థితులను వివరించారు. కాళేశ్వరంలో రోజుకు 2 టీఎంసీలు తరలించే పథకంతో పాటు అదనంగా ఒక టీఎంసీ కలుపుకొని తెలంగాణ దాఖలు చేసిన సవరణ ప్రాజెక్టు నివేదికపై సీడబ్ల్యూసీ 11 ప్రశ్నలను సంధించిన విషయం తెలిసిందే. అవన్నీ అత్యంత కీలకమైన ప్రశ్నలు కావడంతో.. వాటికి ఎలా జవాబు ఇవ్వాలనేదానిపై రెండు వారాలుగా అధికారులు తలలు బాదుకున్నారు. చివరికి ఆ ప్రశ్నలను నిపుణులకు పంపి, జవాబులన్నీ తయారు చేయించారు. వీటిని సోమవారం కేసీఆర్‌కు నివేదించారు. సమగ్ర నివేదిక అందించాలని సీఎం ఆదేశించడంతో అధికారులంతా సీడబ్ల్యూసీకి వెళ్లి, వివరాలు సమర్పించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సవరణ డీపీఆర్‌పై సీడబ్ల్యూసీ లేఖలపై లేఖలు రాస్తోంది. 


కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 2 టీఎంసీలతో ఏ మేరకు ఆయకట్టుకు నీరందించారు..? అదనపు టీఎంసీతో ఎంత ఆయకట్టు పెరిగిందనే దానిపై సమగ్రంగా జియోగ్రాఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(జీఐఎస్‌) మ్యాప్‌ సమర్పించాలని సెప్టెంబరు 15న ఒక లేఖ రాయగా.. 29న 11 ప్రశ్నలతో మరో లేఖను రాసింది. ఇప్పటికే కాళేశ్వరం పంపుల మునకపై విపక్షాల నుంచి ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. వీటికి కొనసాగింపుగా సీడబ్ల్యూసీ లేఖలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. అయితే సీడబ్ల్యూసీ సంతృప్తి చెందితేనే సవరణ డీపీఆర్‌కు కేంద్రం ఆమోదించి, అనుమతి లేని జాబితాలో ఉన్న అదనపు టీఎంసీ కాంపోనెంట్‌ను తొలగించే అవకాశాలున్నాయి. దీంతో నీటిపారుదల శాఖ అధికారులంతా సీఎం కేసీఆర్‌తో సమావేశమై సీడబ్ల్యూసీ ప్రశ్నలతో పాటు ప్రాజెక్టుల అనుమతుల కోసం సమర్పించిన డీపీఆర్‌ల పురోగతిని వివరించారు. సీఎం కేసీఆర్‌ దేశ రాజధానిలో మకాం వేసి వారం రోజులవుతోంది. ఆయన స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. జ్వరంతో బాధపడుతున్న ఆయన అక్కడే చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది.


 జాతీయ పార్టీ బీఆర్‌ఎ్‌సను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన తర్వాత ఢిల్లీ వచ్చిన సీఎం కేసీఆర్‌.. ఇక్కడ జాతీయ నాయకులతో కలిసి హడావుడి చేస్తారని అంతా భావించారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. ములాయం సింగ్‌ యాదవ్‌ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు గత మంగళవారం ఢిల్లీ వచ్చిన కేసీఆర్‌ అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఆయనతో పాటు సతీమణి శోభ, కవిత కూడా ఉన్నారు. కేసీఆర్‌తో పాటు వచ్చిన వినోద్‌ కుమార్‌, ప్రశాంత్‌రెడ్డి, సంతోష్‌ తదితరులు తెలంగాణ భవన్‌ నిర్మాణ పనులను పర్యవేక్షించిన తర్వాత రెండు రోజుల్లో తిరిగి వెళ్లిపోయారు. కాగా, కేసీఆర్‌ పిలుపు మేరకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు కేసీఆర్‌ దీపావళి వరకు ఇక్కడే ఉంటారేమో..! అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-10-18T08:50:05+05:30 IST