మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు బంద్‌!

ABN , First Publish Date - 2022-09-26T08:11:04+05:30 IST

కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను అప్పగించే విషయంలో జాప్యం చేస్తున్న రైస్‌ మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోబోతుందా? పీడీఎస్‌ బియ్యంతో దందా చేస్తున్న రైస్‌ మిల్లర్లకు ముకుతాడు వేయబోతుందా...

మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు బంద్‌!

  • వచ్చే ఖరీఫ్‌ ధాన్యాన్ని రాష్ట్ర మిల్లర్లకు ఇవ్వొద్దు
  • ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర రైస్‌ మిల్లర్లకు సీఎంఆర్‌
  • సూత్రప్రాయంగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం
  • ఎఫ్‌సీఐ అధికారులతో ఇప్పటికే చర్చలు
  • మంత్రి గంగులతో పౌరసరఫరాల కమిషనర్‌ భేటీ
  • మిడిల్‌ పాయింట్‌లో ధాన్యాన్ని నిల్వచేసే యోచన
  • రాష్ట్ర మిల్లర్లకు చెక్‌పెట్టే దిశగా సర్కారు అడుగులు


హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను అప్పగించే విషయంలో జాప్యం చేస్తున్న రైస్‌ మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోబోతుందా? పీడీఎస్‌ బియ్యంతో దందా చేస్తున్న రైస్‌ మిల్లర్లకు ముకుతాడు వేయబోతుందా? నయాపైసా ఖర్చులేకుండా మిల్లర్లకు ధాన్యం ఇచ్చి కేంద్ర ప్రభుత్వంతో తలనొప్పి కొనితెచ్చుకోవటం ఎందుకని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందా?... రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లుచూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. తెలంగాణ రైస్‌మిల్లర్లకు వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం ఇవ్వకూడదని రాష్ట్ర సర్కారు ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. 


రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కమిషనర్‌ అనిల్‌కుమార్‌ సమావేశం కావడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలుచేసి రైస్‌ మిల్లర్లకు అప్పగిస్తే.. వాళ్లు దాంతో వ్యాపారం చేస్తుండటంపై కొన్నేళ్లుగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీచేస్తున్న బియ్యాన్ని మిల్లర్లు రీసైక్లింగ్‌ చేసి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) కోటాను పూర్తిచేస్తున్నట్టు విమర్శలున్నాయి. పీడీఎస్‌ రైస్‌ అక్రమ రవాణా అవుతున్నా, మిల్లుల్లో రీసైక్లింగ్‌ అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వస్తోంది. ఒక దశలో సాధారణ బియ్యంతో పోలిస్తే పీడీఎస్‌ బియ్యం బ్లాక్‌ మార్కెట్‌ గణనీయంగా పెరిగిపోయింది. దీనికితోడు రైస్‌మిల్లర్ల వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. నిర్ణీత సమయంలో మార్గదర్శకాల ప్రకారం ఎఫ్‌సీఐకి బియ్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడిచేస్తోంది. నిబంధనలను కూడా కఠినతరం చేసింది.


 పలు సందర్భాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధవాతావరణం నెలకొనటానికి బియ్యం సేకరణే ప్రధాన కారణం కావటం గమనార్హం. అయితే మిల్లర్లకు ధాన్యం అప్పగించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తోంది. మిల్లర్లకు కేటాయిస్తున్న ధాన్యం విలువకు తగినట్లుగా కనీసం బ్యాంకు గ్యారంటీ కూడా తీసుకోవటంలేదు. ఇతర రాష్ట్రాల్లో మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి చేశారు. ప్రభుత్వం తేరగా ధాన్యం ఇవ్వటం, మిల్లర్లు దాన్ని మార్కెట్లో అమ్ముకోవటం, ఆ తర్వాత పీడీఎస్‌ బియ్యాన్ని కొని ఎఫ్‌సీఐకి అంటగట్టడం రొటీన్‌గా జరిగిపోతున్నాయి. ఆరు నెలల్లో పూర్తిచేయాల్సిన సీఎంఆర్‌ కోటాను 12 నుంచి 14 నెలలైనా పూర్తిచేసే పరిస్థితి లేకుండాపోయింది. దీనికితోడు గత ఖరీ్‌ఫలో సేకరించిన 70.22 లక్షల మెట్రిక్‌ టన్నులు, యాసంగిలో కొనుగోలుచేసిన 50.39 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యంతోపాటు... అంతకుముందు నాలుగైదు సీజన్లకు సంబంధించిన బకాయిలు కూడా రైస్‌మిల్లర్ల వద్ద ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఖరీఫ్‌ ధాన్యాన్ని కూడా తెలంగాణ రైస్‌మిల్లర్లకు అప్పగించటం సరికాదని సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. మిల్లుల్లో ఇప్పటికే కెపాసిటీకి మించి ధాన్యం ఉందని, ఇంకా ధాన్యం ఇస్తే నిర్ణీత గడువులో సీఎంఆర్‌ ఇవ్వటం సాధ్యం కాదనే ఆలోచనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. 


పొరుగు రాష్ట్రాల్లో ధాన్యం మిల్లింగ్‌ 

వచ్చే ఖరీఫ్‌ ధాన్యాన్ని తెలంగాణ రైస్‌ మిల్లర్లకు బదులుగా.. పొరుగు రాష్ట్రాలకు చెందిన రైస్‌ మిల్లర్లకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన మిల్లర్లకు ఽధాన్యాన్ని అప్పగించి మిల్లింగ్‌ చేయించాలని, నిర్ణీత సమయంలో ఎఫ్‌సీఐ టార్గెట్‌ పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కసరత్తు మొదలుపెట్టింది. హైదరాబాద్‌ రీజియన్‌కు చెందిన ఎఫ్‌సీఐ జనరల్‌ మేనేజర్‌తో కూడా ఈ విషయంపై చర్చించినట్లు, జీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు పౌరసరఫరాల భవన్‌లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆ మూడు రాష్ట్రాల్లో ఎన్ని రైస్‌ మిల్లులు ఉన్నాయి? వాటి సామర్థ్యం ఎంత? ఆ రాష్ట్రాల్లో వరి పంట ఎంత విస్తీర్ణంలో సాగైంది? అక్కడ ఎంత ఉత్పత్తి వస్తుంది? తెలంగాణ ధాన్యాన్ని అక్కడికి పంపిస్తే మిల్లింగ్‌ చేయటం సాధ్యమవుతుందా? మన రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి ఏ మేరకు అవుతుంది? రైస్‌మిల్లర్లు, ట్రేడర్లు, దళారులు కొనుగోలుచేసేది పోగా.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఏమేరకు ధాన్యం వస్తుంది? ఎంత సేకరించాల్సి ఉంటుంది? అనే అంశాలపై స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పొరుగు రాష్ట్రాల అధికారులతో కూడా మాట్లాడుతున్నారు.


మంత్రి గంగులతో కమిషనర్‌ సమావేశం

మరోవైపు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ఆదివారం భేటీ అయ్యారు. తెలంగాణ రైస్‌మిల్లర్లకు ఖరీఫ్‌ ధాన్యం ఇవ్వకూడదన్న నిర్ణయం నేపథ్యంలో... వీరి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. కార్పొరేషన్‌ తనపున చేపట్టాల్సిన చర్యలు, తయారుచేయాల్సిన ప్రతిపాదనలు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పించే నివేదిక, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సీఎంఆర్‌ బకాయిలు, రైస్‌ మిల్లుల్లో ఉన్న ధాన్యం నిల్వలు, మిల్లింగ్‌ జరుగుతున్న తీరు, ఇటీవల నిర్వహించిన విజిలెన్స్‌ దాడులపై ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇదిలావుండగా సోమవారం (నేడు) మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఇదే అంశంపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఖరీఫ్‌ ధాన్యం కేటాయింపులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


మిడిల్‌ పాయింట్లలో ధాన్యం నిల్వలు

ప్రస్తుతం రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలుచేసి నేరుగా రైస్‌మిల్లులకు ప్రభుత్వం తరలిస్తోంది. నిల్వ, నిర్వహణ, మిల్లింగ్‌ అంతా అక్కడే జరుగుతోంది. బాయిల్డ్‌ రైస్‌ అయితే 68 శాతం, రా రైస్‌ అయితే 67 శాతం రికవరీ చొప్పున ఎఫ్‌సీఐ బియ్యం తీసుకుంటోంది. ఇక నుంచి రైతుల నుంచి కొనుగోలుచేసిన ధాన్యాన్ని మిడిల్‌ పాయింట్‌లలో నిల్వచేయాలనే ఆలోచనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లు తెలిసింది. మిడిల్‌ పాయింట్ల నుంచి పొరుగు రాష్ట్రాలకు ధాన్యాన్ని తరలించాలని, మిల్లింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎఫ్‌సీఐకి నేరుగా బియ్యాన్ని అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. అయితే ధాన్యాన్ని ఒకేసారి కాకుండా విడతలవారీగా తరలించే అవకాశం ఉంది.

Read more