అల్లం నారాయణకు సతీ వియోగం

ABN , First Publish Date - 2022-02-23T08:31:46+05:30 IST

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన అల్లం పద్మ (55) ఇకలేరు.

అల్లం నారాయణకు సతీ వియోగం

తీవ్ర అనారోగ్యంతో అల్లం పద్మ కన్నుమూత

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర 

‘అమ్మల సంఘం’తో ఓయూ విద్యార్థులకు అన్నం

సీఎం కేసీఆర్‌, స్పీకర్‌ పోచారం, కేటీఆర్‌, హరీశ్‌ సంతాపం

‘ఆంధ్రజ్యోతి’ సంపాదకుడు కే శ్రీనివాస్‌ నివాళులు  

నేడు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు


హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి22(ఆంధ్రజ్యోతి): తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ జీవన సహచరి, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన అల్లం పద్మ (55) ఇకలేరు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, 20 రోజుల క్రితం నిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా మూత్ర పిండాల సమస్యతో  పద్మ బాధపడుతున్నారు. అల్లం నారాయణ, పద్మ దంపతులకు కుమార్తెలు రవళి, భావన.. కుమారుడు రాహుల్‌ ఉన్నారు. పద్మ స్వస్థలం కరీంనగర్‌. 1967 మే 6న జన్మించారు. ఎంఏ, బీఈడీ పూర్తి చేశారు. 1990 నుంచి 2009 వరకు 19 ఏళ్లపాటు ఓ ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. అక్కడి నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ మహిళా జాయింట్‌ యాక్షన్‌ కమిటీ వేదికగా ప్రత్యేక రాష్ట్ర పోరులో క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో ఉమ్మడి ఏపీ పాలకులు ఓయూలోని వసతి గృహాలన్నీ తాత్కాలికంగా మూసేశారు. అదే సమయంలో పోరుబాట పట్టిన అక్కడి విద్యార్థుల ఆకలితీర్చేందుకు పద్మ ముందుకొచ్చి ‘అమ్మల సంఘం’ నెలకొల్పి.. కొన్ని వందల మంది పిల్లలకు అన్నం పెట్టారు. రాజీవ్‌ విద్యామిషన్‌ నిర్వహించిన ‘బాలికా చేతన’, సెక్షన్‌ 498ఏ పరిరక్షణ, విద్యాహక్కు చట్టం అమలు తదితర ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఫ్యామిలీ కౌన్సెలర్‌గానూ సేవలు అందించారు. మహిళా సంఘాల ఐక్య కార్యాచరణలో.. ప్రజాస్వామిక ఉద్యమాల్లో గళమెత్తారు. సామాజిక కార్యకర్త దేవితో కలిసి మూఢాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. పద్మ మృతి పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అల్లం నారాయణను ఫోన్లో పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పద్మ మృతి పట్ల స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యే క్రాంతి, వివిధ పత్రికల సంపాదకులు, సీనియర్‌ జర్నలిస్టులు ఆస్పత్రి వద్ద అల్లం నారాయణను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకుడు కె.శ్రీనివాస్‌, నెట్‌వర్క్‌ ఇంచార్జ్‌ కృష్ణ ప్రసాద్‌ నిమ్స్‌కు వెళ్లి పద్మ భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. పద్మ అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.

Read more