ఆ నలుగురూ మేజర్లే

ABN , First Publish Date - 2022-10-01T08:29:32+05:30 IST

సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌ మైనర్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులో..

ఆ నలుగురూ మేజర్లే

  • జూబ్లీహిల్స్‌లో మైనర్‌పై గ్యాంగ్‌ రేప్‌ కేసులో
  • జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు ప్రిన్సిపల్‌ మేజిస్ట్రేట్‌ నివేదిక
  • పోలీసు నివేదిక ఆధారంగా నలుగురిపైనే అంచనా
  • వివిధ అంశాలపై వారిని ప్రశ్నించి తుదినిర్ణయానికి!
  • ఎమ్మెల్యే కుమారుడు తీవ్ర నేరానికి పాల్పడనట్లు పోలీసులు 
  • పేర్కొన్నందున ప్రశ్నించలేదని వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌ మైనర్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఎమ్మెల్యే కుమారుడు మినహా మిగతా నలుగురినీ మేజర్లుగా పరిగణించవచ్చని జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు ప్రిన్సిపల్‌ మేజిస్ట్రేట్‌ ప్రాథమిక నిర్ణయం ప్రకటించారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు ఆరోపణలు ఎదుర్కొనగా.. వారిలో ఒకరు ఘటన జరిగిన సమయానికే 18 ఏళ్లు నిండి ఉండటంతో అతనిపై కేసు దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మిగతా ఐదుగురు మైనర్లనూ మేజర్లుగా పరిగణించాలని జూబ్లీహిల్స్‌ ఎస్‌హెచ్‌వో వేసిన పిటిషన్‌పై విచారణానంతరం శుక్రవారంనాడు మేజిస్ట్రేట్‌ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ ఐదుగురిలో 1 నుంచి 4 వరకూ ఉన్న నలుగురినీ మేజర్లుగా పరిగణనలోకి తీసుకున్నామని.. 5వ మైనర్‌ (ఎమ్మెల్యే కుమారుడు) ఆ రోజు తీవ్రమైన నేరానికి పాల్పడలేదని పోలీసులు నివేదికలో పేర్కొన్నందున అతణ్ని అసలు తాము ప్రశ్నించలేదని పేర్కొన్నారు. మిగతా నలుగురి పైనా కేసు రికార్డును జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌, 2015లోని సెక్షన్‌ 18(3) ప్రకారం నాంపల్లిలోని బాలల కోర్టుకు విచారణ నిమిత్తం ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నట్లు నివేదికలో వెల్లడించారు.


ఒక్కొక్కరినీ ప్రశ్నించి..

16 నుంచి 18ఏళ్ల లోపు ఉన్న ఆ నలుగురు యువకులను వివిధ కోణాల్లో.. ప్రశ్నించి.. వారి మానసిక, భౌతిక స్థితిగతులు, కుటుంబ నేపథ్యాల ఆధారంగా వారిని అడల్ట్స్‌ (మేజర్‌)గా పరిగణించవచ్చని నిర్ణయానికి వచ్చినట్లు జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు ప్రిన్సిపల్‌ మేజిస్ట్రేట్‌ పేర్కొన్నారు. వారి మానసిక స్థితిని అంచనా వేయడానికి.. తాము చేసిన అకృత్యం తాలూకూ పర్యవసానాలు వారికి తెలుసా లేదా అనే విషయం తెలుసుకోవడానికి.. మేజిస్ట్రేట్‌, జువెనైల్‌ బోర్డు మెంబర్‌, హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ సైకియాట్రి ప్రొఫెసర్‌.. ఆ నలుగురినీ వేర్వేరుగా ప్రశ్నించారు. వారు ఇచ్చిన సమాధానాల ఆధారంగా వేర్వేరు నివేదికలు రూపొందించారు.


నలుగురూ సంపన్న కుటుంబాలకు చెందినవారని.. తల్లిదండ్రులతో, తోబుట్టువులతో చాలా బాగా ఉంటామని వివరించారని నివేదికలో తెలిపారు. వారిలో ఇద్దరు బంధువులు, ఫుట్‌బాల్‌ క్రీడాకారులు అని.. జాతీయ ఫుట్‌బాల్‌ టీమ్‌లో ఆడారని వెల్లడించారు. మొదటి ముగ్గురికీ మద్యపానం, ధూమపానం, ఇతర దురలవాట్లు ఏవీ లేవని.. నాలుగో నిందితుడు మాత్రం అప్పుడప్పుడూ ధూమపానం చేస్తాడని పేర్కొన్నారు. నలుగురూ  చదువులో ప్రతిభ కల్గిన వారేనని.. ముగ్గురు ఇంటర్‌ చదువుతుండగా.. ఒకడు ఇంటర్‌ పూర్తి చేశాడని వివరించారు. ఒకరు గుర్రపు స్వారీ, సంగీతంలో బాగా రాణించగా.. మరొక నిందితుడు లండన్‌లో బారిస్టర్‌ చదువు చదవాలనుకున్నాడని.. ఇంకో నిందితుడు ఇటలీలో ఆర్కిటెక్చర్‌ చదవాలనే అభిలాష వ్యక్తం చేశాడని పేర్కొన్నారు. ఆ నలుగురూ కుటుంబంలో ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులకు గురి కాలేదని.. ఇంటి నేపథ్యం కారణంగా ఎన్నడూ మానసిక సమస్యలు ఎదుర్కొనలేదని.. ప్రతి విషయంలోనూ స్పష్టత, మానసిక పరిపక్వత ఉన్నాయని వెల్లడించారు.


వేర్వేరు నివేదికలు

నలుగురినీ విచారించిన సైకియాట్రీ ప్రొఫెసర్‌ సెప్టెంబర్‌ 28న, బోర్డు మెంబర్‌ సెప్టెంబర్‌ 29న.. రెండు వేర్వేరు నివేదికలు సిద్ధం చేశారు. నివేదికలు రెండూ దాదాపు ఒకేలా ఉన్నాయని జేజే బోర్డు ప్రిన్సిపల్‌ మేజిస్ట్రేట్‌ పేర్కొన్నారు. మైనర్లుగా ఉన్న ఆ నలుగురూ పరిపక్వతతోనే ఉన్నారని ప్రొఫెసర్‌, బోర్డు మెంబరు ఇద్దరూ చెప్పినప్పటికీ.. తాము చేస్తున్న నేరం తాలూకూ పర్యవసానాలపై వారికి ఉన్న అవగాహన విషయంలో మాత్రం రెండు నివేదికల్లో తేడా ఉందని తెలిపారు. ఆ అవగాహన వారికి ఉందని సైకియాట్రీ ప్రొఫెసర్‌ పేర్కొనగా.. లేదని బోర్డు మెంబర్‌ అభిప్రాయపడ్డారని ప్రిన్సిపల్‌ మేజిస్ట్రేట్‌ తన నివేదికలో పేర్కొన్నారు. నేరం చేసినప్పుడు నిందితులు మద్యం సేవించి లేరని.. పూర్తి స్పృహలోనే ఉండి నేరం చేసినందున వారిని మేజర్‌లుగా పరిగణించి కేసును 12వ అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌కు బదిలీ చేయొచ్చని సూచించారు.

Read more