పీకేతో డీల్‌ ఓకే

ABN , First Publish Date - 2022-04-24T08:10:13+05:30 IST

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

పీకేతో డీల్‌ ఓకే

  • వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కోసం
  • పనిచేసేలా ప్రశాంత్‌ కిశోర్‌తో ఒప్పందం!
  • శనివారం రోజంతా ప్రగతిభవన్‌లోనే కేసీఆర్‌తో చర్చలు.. 
  • నేడు కూడా ఇక్కడే ఎన్నికల వ్యూహకర్త
  • అటు కాంగ్రెస్‌ హైకమాండ్‌తో చర్చలు.. 
  • ఇటు టీఆర్‌ఎస్‌తో ఒప్పందంతో ఆసక్తికర పరిణామం


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌లో చేరేందుకు ఆ పార్టీ అధిష్ఠానంతో కొద్దిరోజులుగా చర్చలు జరుపుతున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఉదయం 9.30 గంటలకే ప్రగతిభవన్‌కు చేరుకున్న పీకే.. రోజంతా అక్కడే ఉండి కేసీఆర్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున వ్యూహకర్తగా పనిచేసేందుకు ఒప్పందం కుదిరినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు సంతకాలు కూడా చేసినట్లు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌ అధిష్ఠానంతో చర్చల కన్నా ముందే.. టీఆర్‌ఎస్‌ కోసం పనిచేసేందుకు ప్రశాంత్‌ కిశోర్‌ అంగీకరించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఆయన ఇప్పటికే ఓసారి రాష్ట్రానికి వచ్చివెళ్లారు. క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్‌ పరిస్థితులపై సర్వే జరిపి నివేదిక కూడా సమర్పించారు.


అయితే ఆ తరువాత జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేశారు. ఆ తరువాత కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తానంటూ ఆ పార్టీ హైకమాండ్‌ను సంప్రదించారు. ఈ మేరకు సోనియాగాంధీతో, రాహుల్‌తోనూ సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ అనుసరించాల్సిన విధానంపై ప్రజెంటేషన్‌ కూడా ఇచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేయాలని, ఏపీలో మాత్రం వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి. ఆయనను కాంగ్రెస్‌లో చేర్చుకొని ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆయన కేసీఆర్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదివారం కూడా ఆయన ప్రగతి భవన్‌లోనే ఉండనున్నట్లు తెలిసింది.

Updated Date - 2022-04-24T08:10:13+05:30 IST