మునుగోడులో ముందస్తు ప్యాకేజీలు..!

ABN , First Publish Date - 2022-08-15T09:17:16+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందన్న విషయంలో ఇంకా స్పష్టత లేకపోయినా..

మునుగోడులో ముందస్తు  ప్యాకేజీలు..!

ఆధిపత్యానికి వ్యూహాలు షురూ.. ప్రజాప్రతినిధుల చేరికలపై టీఆర్‌ఎస్‌ నజర్‌

ముందస్తు ఒప్పందాలతో రాజగోపాల్‌ బ్రేకులు.. భారీగా తరలివస్తున్న నేతలు

లాడ్జ్‌లు, అద్దె ఇళ్లకు డిమాండ్‌.. టీఆర్‌ఎస్‌, రాజగోపాల్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌ 

కారెక్కిన కాంగ్రెస్‌ పార్టీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు


నల్లగొండ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందన్న విషయంలో ఇంకా స్పష్టత లేకపోయినా.. నియోజకవర్గంలో అప్పుడే రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఆధిపత్యం కోసం ప్రధాన పార్టీలు ఇప్పటినుంచే వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నెల 20న సీఎం కేసీఆర్‌ సభ, 21న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సభ, 16 నుంచి మండలాల వారీగా కాంగ్రెస్‌ సమావేశాల షెడ్యూల్‌ ఖరారు కావడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ప్రధాన పార్టీల నేతలంతా మునుగోడు బాట పట్టారు. సీఎం సభ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గంలో మండల స్థాయి సమావేశాలు పూర్తి చేసుకుని గ్రామస్థాయి సమావేశాలకు సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఉప ఎన్నిక ఖాయమని తేలినప్పటికీ పార్టీలోకి చేరికలు లేకపోవడంపై సీఎం కేసీఆర్‌ జిల్లా నేతలను ప్రశ్నించినట్లు తెలిసింది.


దీంతో ఆయా నేతలు ఇతర పార్టీల ప్రజాప్రతినిధులకు గులాబీ కండువాలు కప్పడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ‘‘భారీ ప్యాకేజీలు ఉన్నట్లు ఇప్పటికే ప్రచారం జరిగింది. మా పార్టీలో చేరాలంటే ప్యాకేజీకి సంబంధించి స్పష్టత వస్తే ఎదుటి పార్టీ వారితో ధైర్యంగా మాట్లాడి ఆపరేషన్‌ ఆకర్ష్‌ను వేగవంతం చేయొచ్చు. కానీ మాది అధికార పార్టీ అని, రాబోయే రోజుల్లో పనులు ఇస్తామని, సీఎం సభ ముగిసిన తర్వాత మాట్లాడుకుందామమని మా నేతలు చెబుతుండటంతో పార్టీలో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు’’ అని చేరికల బాధ్యతలు చూసే మండల నాయకుడొకరు ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. ‘‘కాంగ్రెస్‌ నుంచే పెద్దఎత్తున చేరికలు జరగాల్సి ఉంది. అయితే రాజగోపాల్‌రెడ్డి మొదటి నుంచే కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు చేజారిపోకుండా ఆర్థిక ప్యాకేజీ విషయంలో స్పష్టత ఇచ్చారు. సర్పంచ్‌, ఎంపీటీసీలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఇప్పటికే అందడంతో వారు మావైపు వచ్చేందుకు సుముఖంగా లేరు’’ అని ఆ నాయకుడు తెలిపారు. 


ఏర్పాట్లలోనూ పోటా పోటీ..

ఉప ఎన్నికలో పోటీ తీవ్రతను అంచనా వేస్తున్న టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు ముందస్తు ఏర్పాట్లలోనూ పోటీ పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండల కేంద్రంలో ఐదు లాడ్జీలు ఉండగా సెప్టెంబరు 1 నుంచి డిసెంబరు వరకు మూడు లాడ్జీలను నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ ప్రధాన నాయకుడు ఒకరు ముందస్తుగా బుక్‌ చేసుకున్నారు. మరోవైపు నియోజకవర్గంలోని మండల కేంద్రంలో ఇళ్లకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది. హైవేపై ఉండటం, నియోజకవర్గంలోని మిగిలిన మండలాలకు రాకపోకలకు అనువుగా ఉండటంతో చౌటుప్పల్‌ మునిసిపాలిటీలో పెద్ద పెద్ద ఇళ్ల కోసం నాయకులు పోటీ పడుతున్నారు. ఎంత అద్దె అయినా పర్వాలేదు అంటూ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎన్నిక ఇన్‌చార్జి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అనుచరులు రెండు రోజులుగా ఇళ్ల కోసం వేట మొదలుపెట్టారు. మునుగోడు మండల కేంద్రంలోని చండూరు రోడ్డులో నాయకుల బస కోసం రాజగోపాల్‌రెడ్డి అనుచరులు ఇప్పటికే ఇళ్లను డిసెంబరు వరకు బుక్‌ చేసుకున్నారు. సాధారణంగా వంద గజాల షట్టర్‌ షాపునకు రూ.10 వేలు అద్దె ఉండగా, ప్రస్తుతం అది రూ.15 వేలకు చేరింది. 


సభ కోసం ఎకరానికి రూ.60 వేలు!

ఈ నెల 20న సీఎం కేసీఆర్‌ సభ అవసరాలకు 20 ఎకరాలు, 21న అమిత్‌షా సభ నేపథ్యంలో 30 ఎకరాలు ఆయా పార్టీల నేతలు సేకరించారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే రైతులు పత్తిపంట సాగు చేసుకోగా బహిరంగ సభతో ఆ పంటలు పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో రైతుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు ఎకరాకు రూ.60 వేలు చెల్లించేలా రాజగోపాల్‌రెడ్డి అనుచరులు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. అడ్వాన్స్‌గా ఎకరాకు రూ.10 వేలు చొప్పున రైతులకు చెల్లించినట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌ నేతలు సైతం అదే పద్ధతిని అవలంబిస్తున్నారు. సీఎం సభ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రత్యేకంగా సిద్ధం చేసిన ప్రచార రథాలు ఈ నెల 13 నుంచే నియోజకవర్గంలో జోరుగా తిరుగుతున్నాయి. మరోవైపు మునుగోడు బరిలో తమ పార్టీ కూడా ఉంటుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు గోడ రాతలతో ప్రచారాన్ని ప్రారంభించారు. కాగా, దళితశక్తి ప్రోగ్రాం (డీఎస్పీ) కూడా పోటీలో ఉంటుందంటూ అభ్యర్థిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బరిగెల దుర్గాప్రసాద్‌ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్‌ మహరాజ్‌ ప్రకటించారు. 



టీఆర్‌ఎ్‌సలోకి కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు

హైదరాబాద్‌: మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఆరుగురు కాంగ్రెస్‌ సర్పంచులు, ముగ్గురు ఎంపీటీసీలు ఆదివారం టీఆర్‌ఎ్‌సలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. వీరిలో సర్పంచులు గుర్రం సత్యం, జనిగల మహేశ్వరి, నందిపాటి రాధ, వంటెపాక జగన్‌ గౌడ్‌, పంతంగి పద్మ, ఎంపీటీసీ బీమనపల్లి సైదులు తదితరులున్నారు. వీరి చేరికలో మునుగోడు నుంచి టికెట్‌ ఆశిస్తున్న కంచర్ల కృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారు. మరోవైపు మునుగోడు మండలానికి చెందిన ఒక సర్పంచ్‌, నారాయణపురం మండలానికి చెందిన ఎంపీటీసీలు మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడులో గులాబీ కండువా కప్పుకున్నారు. 

Updated Date - 2022-08-15T09:17:16+05:30 IST