రెండో విడత ఎప్పుడో?

ABN , First Publish Date - 2022-08-15T06:09:47+05:30 IST

తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత ప్రభుత్వం రాష్ట్రంలోని గొల్ల, కుర్మల ఆర్థికాభివృద్ధి కోసం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. మొదటి విడతగా ప్రారంభించినా.. ఈ పథకం ద్వారా జిల్లావ్యాప్తంగా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు.

రెండో విడత ఎప్పుడో?
గొల్ల, కుర్మలకు పంపిణీ చేసిన గొర్రెలు (ఫైల్‌)

మునుగోడు ఉప ఎన్నికతో మళ్లీ తెరపైకి గొర్రెల పంపిణీ పథకం

గొల్ల, కుర్మలతో అధికారులతో సమావేశం

లబ్ధిదారుల్లో చిగురిస్తున్న ఆశలు

మొదటి విడతలో 4వేల 332 యూనిట్ల పంపిణీ

రెండో విడతలో 740 యూనిట్లు పూర్తి

జిల్లావ్యాప్తంగా మొత్తం 3,744 మంది లబ్ధిదారుల ఎదురుచూపులు

ఆదిలాబాద్‌ టౌన్‌, ఆగస్టు 14: తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత ప్రభుత్వం రాష్ట్రంలోని గొల్ల, కుర్మల ఆర్థికాభివృద్ధి కోసం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. మొదటి విడతగా ప్రారంభించినా.. ఈ పథకం ద్వారా జిల్లావ్యాప్తంగా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. పక్క రాష్ర్టాల నుంచి యూనిట్లను కొనుగోలు చేసి ఒక్కో యూనిట్‌లో 19 గొర్రెలు, ఒక పొట్టేలుతో కలిపి మొత్తం 20 గొర్రెలను ఒక్కో లబ్ధిదారుడికి పంపిణీ చేశారు. అప్పటి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, ఉమ్మడి ఆదిలాబాద్‌  మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే జోగు రామన్న చేతుల మీదుగా గొర్రెలను పంపిణీ చేశారు. మొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గొల్ల, కుర్మలకు గొర్రెలను అందించి వారి ఆర్థికాబివృద్ధికి చేయూతనందించింది. ఈ పథకం ద్వారా జిల్లావ్యాప్తంగా మొదటి విడతలో పశు సంవర్ధక శాఖాధికారులు 4వేల 282 యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. దీంతో గొల్ల, కుర్మలు ఆర్థికంగా అభివృద్ధి చెందామన్న సంతోషంతో రెండో విడత కోసం వేల మంది గొల్ల, కుర్మలు యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాని రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో పూర్తిస్థాయిలో యూనిట్లను పంపిణీ చేసినా.. రెండో విడత పంపిణీలో మాత్రం మొదట చూపిన ఉత్సాహాన్ని చూపించ లేక పోయింది. ఈ పథకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతామన్న భావనతో ఉన్న లబ్ధిదారులు ప్రభుత్వతీరుతో నిరుత్సాహానికి గురయ్యారు. ప్రస్తుతం ఆరేళ్లు గడుస్తున్నా.. గొల్ల, కుర్మలకు యూనిట్లు పంపిణీ చేద్దామన్న ఆలోచన చేయడం లేదు. ఎట్టకేలకు ప్రస్తుతం ప్రభుత్వం మళ్లీ రెండో విడత ప్రారంభించాలన్న ఆలోచనకు రావడంతో లబ్ధిదారులు యూనిట్ల కోసం ఎదురు చూస్తున్నారు.

గొల్ల, కుర్మల ఆర్థికాభివృద్ధి కోసం..

రాష్ట్రంలో నూతన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గొల్ల, కుర్మల కోసం వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలని గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ ఫథకం గత ఆరేళ్లుగా అమలుకు నోచుకోలేక పోయింది. అయితే ఉప ఎన్నికలు జరిగిన నియోజక వర్గాలైనా హుజూరాబాద్‌, దుబ్బాక ఎన్నికలతో.. ఆయా నియోజక వర్గాలకు సీఎం కేసీఆర్‌ వరాల జల్లులు కురిపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో మునుగోడు నియోజక వర్గంలో అభివృద్ధికి బాటలు పడుతాయని స్థానిక ప్రజలు భావిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక రానున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ పథకాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే డయాలసిస్‌ వారికి రూ.2016 పింఛన్‌, కొత్త పింఛన్లు, కొత్త రేషన్‌కార్డుల జారీకి ప్రకటన చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి రెండో విడత గొర్రెల పంపిణీపై దృష్టి సారించింది. కాగా మునుగోడు ఉప ఎన్నిక మళ్లీ రాష్ట్రంలోని ఆయా వర్గాల్లో వెనుకబడి ఉన్న వారితో పాటు అర్హులైన లబ్ధిదారులందరికీ ఈ పథకాలతో పాటు సీఎం కేసీఆర్‌ మరిన్ని వరాల జల్లులు కురిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికతో నిలిచిపోయిన సంక్షేమ పథకాలు మళ్లీ ప్రజలకు చేరనున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగానే రెండో విడత గొర్రెల పంపిణీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నిక ఒక్క గొల్ల, కుర్మలకే కాకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు పింఛన్లు, రేషన్‌కార్డులు, వివిధ సంక్షేమ పథకాలు తీసుకు రానుందని చెబుతున్నారు.

లబ్ధిదారుల్లో చిగురిస్తున్న ఆశలు

నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే రాజీనామాతో రాష్ట్రంలో నిలిచిపోయిన పథకాలకు మళ్లీ ముహూర్తం ఖరారు కానుంది. ఇప్పటికే ఈ ఎన్నికను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్‌ వరాల జల్లులు కురిపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 10లక్షల మందికి కొత్త పింఛన్లు అందిస్తామ ని, డయాలసిస్‌ రోగులకు రూ.2016 పింఛన్‌, కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులకు శ్రీకారం చుట్టిందని ప్రజలు అంటున్నారు. ఈ సందర్భంలో మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ఆరేళ్ల కింద నిలిచిపోయిన గొర్రెల పంపిణీ పథకం రెండో విడత ప్రారంభంకానుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే రెండో విడతలో 740 మంది లబ్ధిదారులకు జీవాలను పంపిణీ చేయగా.. ఇందులో మిగిలిన 3,744 యూనిట్లతో పాటు ఇంకా దరఖాస్తు చేసుకున్న వారు ఎంతమంది ఉన్నారనే దానిపై అధికార యంత్రాంగం సమావేశం నిర్వహించారు. ఇలాంటి సందర్భంలో రెండో విడత యూనిట్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల్లో మరోసారి యూనిట్లను పంపిణీ చేస్తారని గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు. 

త్వరగా ప్రారంభించాలంటున్న లబ్ధిదారులు

ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గొల్లకుర్మల ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారిస్తూ రెండో విడత పథకాన్ని ప్రారంభించాలని చూడడం మంచి పరిణామని లబ్ధిదారులు అంటున్నారు. అయితే ఈ ప్రక్రియను ఆలస్యం చేయకుండా   త్వరితగతిన పథకాన్ని ప్రారంభించి యూనిట్లు ప్రారంభించాలని జిల్లాలోని పలువురు గొల్లకుర్మలు కోరుతున్నారు. ఇందులో భాగంగా ఒక్కో లబ్ధిదారుడికి 19 గొర్రెలు, ఒక పొట్టేలుతో పాటు అదనంగా మరొక పొట్టేలును అందించాలని కోరుతున్నారు. గతంలో మొదటి విడత ప్రారంభించిన క్రమంలో జిల్లావ్యాప్తంగా 4,282 మంది లబ్ధిదారులకు జీవాలను అందజేశారు. ఇందులో కొంత అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రస్తుతం రెండో విడత పంపిణీలో ఇలాంటి వాటికి తావులేకుండా పథకాన్ని ముందుకు తీసుకెళ్లి రెండో విడత కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

వచ్చే రెండు, మూడు నెలల్లో గొర్రెల పంపిణీ ఏర్పాట్లు

: కిషన్‌, జిల్లా పశువైద్యాధికారి, ఆదిలాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా గొల్ల, కుర్మలకు జీవాలను పంపిణీకి ఏర్పాట్లు చేయాలనే ఆదేశాలతోనే గొల్ల, కుర్మలతో సమావేశం నిర్వహించాం. జిల్లావ్యాప్తంగా 132 సొసైటీ సభ్యులతో యూనిట్ల పంపిణీ పై చర్చించడం జరిగింది. ప్రభుత్వం రానున్న రెండు, మూడు నెలల్లో పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. వారి ఆదేశాలు రాగానే లబ్ధిదారులకు యూనిట్లను అందజేస్తాం. 

Updated Date - 2022-08-15T06:09:47+05:30 IST