పండుగకు ప్రత్యేక రైళ్లు ఏవి...?

ABN , First Publish Date - 2022-09-30T03:38:23+05:30 IST

దసరా, దీపావళి పం డుగలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయలేదు. దీంతో దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సిన ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవు తున్నాయి.

పండుగకు ప్రత్యేక రైళ్లు ఏవి...?

ఉత్తర తెలంగాణకు కేటాయింపుల్లో అలసత్వం  

దసరాకు ప్రజలకు తప్పని ఇబ్బందులు 

ఆర్టీసీ అధిక ధరలతో ప్రయాణికులపై భారం

పట్టించుకోని ఉమ్మడి జిల్లా ఎంపీలు  

మంచిర్యాల, సెప్టెంబరు  29 (ఆంధ్రజ్యోతి): దసరా, దీపావళి పం డుగలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయలేదు. దీంతో దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సిన ప్రజలు ఇబ్బందులు  పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉత్తర తెలంగాణ  జిల్లాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవు తున్నాయి. హైదరాబాద్‌ జంట నగరాల నుంచి ఉత్తర తెలంగాణాలోని ఆదిలాబాద్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మంచిర్యాల ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడంలో దక్షిణ మధ్య రైల్వే జాప్యం చేస్తోంది. ఆయా ప్రాంతాల మధ్య పుష్‌పుల్‌ రైలును కూడా  ప్రకటించలేదు.

ఆర్టీసీలో చార్జీల బాదుడు....!

పండుగల పూట లక్షలాది మంది ప్రజలు సొంత ఊర్లకు ప్రయాణాలు చేస్తుంటారు. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు  ఆర్టీసీని ఆశ్రయించాల్సి వస్తుంది. ఇప్పటికే టికెట్‌ ధరలు ఆకాశాన్నంటుతుండగా పండుగ పూట మరింత పెంచే అవకాశాలున్నట్లు ప్రజలు వాపోతున్నారు.   రైలు ఛార్జీతో పోలిస్తే 5 నుంచి  6 రెట్లు బస్సులకు అధిక ధరలు వెచ్చిం చాల్సి వస్తుంది. హైదరాబాద్‌ నుంచి మంచిర్యాలకు బస్సులో ప్రయా ణించాలంటే సరాసరి రూ.500, అదే రైలులో ప్రయాణిస్తే రూ. 100 నుంచి రూ.  150 లోపు చెల్లిస్తే సరిపోతుంది. ప్రత్యేక రైళ్లు లేకపోవడంతో ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ నెలకొనే అవకాశం ఉంటుంది. ప్రయాణికుల అవస్థలు దృష్టిలో ఉంచుకొనైనా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌లు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. 

మంచిర్యాల - హైదరాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లు తప్పనిసరి....

దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి మంచిర్యాల మీదుగా ప్రత్యేక రైళ్లు నడిపించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి వయా కాజీపేట, పెద్దపల్లి మీదుగా రైళ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే కాచిగూడ నుంచి వయా పెద్దపల్లి, కాగజ్‌నగర్‌ వరకు మరొక రైలు, సికింద్రాబాద్‌ నుంచి బాసరా, బోధన్‌ మీదుగా కామారెడ్డి, నిజామాబాద్‌ వరకు రైళ్లు నడపాలి. ఉమ్మడి జిల్లా కేంద్రాల మధ్య ప్రత్యేకంగా రైళ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాజీపేట నుంచి  పెద్దపల్లి మీదుగా ఆదిలాబాద్‌, కాజిపేట నుంచి మంచిర్యాల మీదుగా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బల్లార్షా, అలాగే బోధన్‌ నుంచి కాజిపేట వయా ఆర్మూ ర్‌-జగిత్యాల-కరీంనగర్‌- పెద్దపల్లి మీదుగా  రైళ్లను ప్రారంభిస్తే  చాలా మంది ప్రజలకు సౌకర్యంగా ఉండనుంది. 

సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య రైళ్లు ప్రారంభం....

సికింద్రాబాద్‌-తిరుపతి మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను ప్రారంభి స్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే  సీపీఆర్‌వో రాకేష్‌ ఈ నెల 26న ప్రకటిం చారు. అదే మాదిరిగా సికింద్రాబాద్‌-కాజిపేట నుంచి మంచిర్యాల మీదుగా రైళ్లను ప్రారంభించకపోవడంతో ఈ ప్రాంతంపై వివక్ష చూపినట్లు అయింది. ఈ ప్రాంత ఎంపీలు, కేంద్ర మంత్రి చొరవ తీసు కొని ప్రత్యేక  రైళ్లను ఏర్పాటు  చేయాల్సిన  అవసరం ఉంది. ప్రజా ప్రతినిధులు ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం, డీఆర్‌ఎంలను ఆదేశించాలని ప్రజలు కోరుతున్నారు. 

ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలి

కామని శ్రీనివాస్‌, తాండూర్‌, లెక్చరర్‌

దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో మంచిర్యాల మీదుగా రెండు, మూడు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తిరుపతి- సికింద్రాబాద్‌ల మధ్య ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన రైల్వే అధికారులు  ఈ ప్రాంతాన్ని విస్మరించడం సరికాదు. హైదరాబాద్‌ నుంచి మంచిర్యాల మీదుగా లక్షలాది మంది ప్రజలు ప్రయాణించే అవకాశం ఉండడంతో ప్రజా ప్రతినిధులు ఈ మేరకు కృషి చేయాల్సిన అవసరం  ఉంది.   

Read more