ఆసిఫాబాద్‌ రెవెన్యూశాఖలో ఆడియోటేప్‌ల ప్రకంపనలు

ABN , First Publish Date - 2022-09-14T04:09:13+05:30 IST

కొద్ది కాలంగా జిల్లా రెవెన్యూశాఖలో చోటుచేసుకుంటున్న పలు అక్రమాలపై ఎట్టకేలకు జిల్లా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇందుకు సంబంధించి అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) రాజేశంను విచారణ అధికారిగా నియమించి అక్రమాలపై విచారణ చేయించారు.

ఆసిఫాబాద్‌ రెవెన్యూశాఖలో ఆడియోటేప్‌ల ప్రకంపనలు

-ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదికలు 

-కఠినచర్యలు తీసుకునేందుకు చర్యలు

-అక్రమాలపై విచారణ పూర్తి

-ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్లపై విచారణ 

-వాంగ్ములాల రికార్డు పూర్తి 

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

కొద్ది కాలంగా జిల్లా రెవెన్యూశాఖలో చోటుచేసుకుంటున్న పలు అక్రమాలపై ఎట్టకేలకు జిల్లా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇందుకు సంబంధించి అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) రాజేశంను విచారణ అధికారిగా నియమించి అక్రమాలపై విచారణ చేయించారు. ప్రధానంగా ఆసిఫాబాద్‌ పట్టణంలో ఆబాదీ భూముల వ్యవహారంలో అడ్డగోలుగా వ్యవహరించి అక్రమార్కులకు భూములను కట్టబెట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ డివిజనల్‌ అఽధికారిపై సమగ్ర విచారణ జరిపినట్టు రెవెన్యూశాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ విచారణకు సంబంధించి వివిధ అంశాలపై లోతుగా దర్యాప్తు జరిపిన అదనపు కలెక్టర్‌ పూర్తి వివరాలను వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు. నివేదికలను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జన్కాపూర్‌ సమీపంలో కోర్టు వివాదంలో ఉన్న 85సెంట్ల విలువైన స్థలానికి సంబంధించి ఆడియో టేపులు లీక్‌కావటం అది కాస్త సోషల్‌ మీడియలో పెద్దఎత్తున ప్రచారం జరగడంతో అధికారులపై ఒత్తిడి పెరిగింది. దీంతో మొత్తం ఈ వ్యవహారంలో పాత్రదారులు, సూత్రదారులు ఎవరు అన్న దానిపై అదనపు కలెక్టర్‌ కూపీలాగి ఇందులో ప్రమేయం ఉన్నట్టు భావిస్తున్న ఒక్కొక్క అధికారిని పిలిపించి వివిధ ప్రశ్నలు వేసి విచారణ నిర్వహించినట్టు తెలుస్తోంది. అప్పట్లో ఈ భూమితోపాటు ఈనాం భూములకు ఓఆర్‌సీ, బీడీపీపీ భూములకు సంబంధించి ఎన్‌వోసీలు ఏ ప్రాతిపదికన ఇచ్చారన్నదానిపై సమగ్ర విచారణ జరిపారు. 1958నుంచి 2022 వరకు ఉన్న కాస్రా పహాణిలను తెప్పించుకొని నిశితంగా పరిశీలించి నివేదిక తయారు చేసినట్టు చెబుతున్నారు. ఇందులో ఇనాం భూముల ఓఆర్‌సీ(ఆక్యూపెన్సీ రైడ్స్‌ సెర్టిఫికేట్‌) జారీని మినహాయిస్తే బీడీపీపీ(బిలాదాఖలా పరంపోగు), ఆబాదీ భూముల వ్యవహారంలో అధికారుల పాత్ర స్పష్టంగా రూఢీ అయిందని చెబుతున్నారు. దాంతో ఇందులో భాగస్వాములైన రెవెన్యూ అధికారులపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారని అంటున్నారు. ఇప్పటికే విచారణ పూర్తిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిన దరిమిలా నేడో, రేపో సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారితో సహ ఇతర అధికారులపై చర్యలు చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. దాంతో పాటు జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భూసేకరణకు సంబంధించి చోటుచేసుకున్న అవకతవకలపైనా విచారణ జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. వాస్తవానికి భూసేకరణ పనుల్లో భారీఅక్రమాలు చోటుచేసుకున్న విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ సాక్ష్యాలతో సహా ఇప్పటికే బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొక్కుబడిగా విచారణ జరిపి చేతులు దులుపుకున్న జాతీయరహదారుల విభాగంపైన కూడా ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహరంపైన కూడా విచారణ జరిపే అవకాశం ఉందని అంటున్నారు. 

ఆడియో అసలు లోగుట్టు

ఆసిఫాబాద్‌ పట్టణంలో చర్చనీయాంశంగా మారిన ఆడియో టేపుల వ్యవహారానికి సంబంఽధించి అసలు కథాకమామీషులోకి వెళ్తే ఆసిఫాబాద్‌- చంద్రాపూర్‌ జాతీయరహదారికి సమీపంలో జన్కాపూర్‌ వద్ద సినిమా థియే టర్‌ పరిసరాల్లో 35గుంటల విలువైన ప్రభుత్వ ఆబాదీ స్థలం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ భూమి విలువ రమారమి 2.5కోట్ల రూపాయల నుంచి 3.5కోట్ల రూపాయల వరకు ఉంటుంది. 2016లో జిల్లా ఏర్పడిన తర్వాత ఆబాదీ భూముల ఆక్రమణలకు సంబంధించి ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించడంతో అప్పటి కలెక్టర్‌ చంపాలాల్‌ ప్రభుత్వ భూముల గుర్తింపు కోసం సమగ్ర సర్వే చేయించారు. ఈ సర్వేలోనే థియేటర్‌ నిర్మించిన స్థలంతోపాటు మరో 35గుంటల ప్రభుత్వ స్థలాన్ని కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పట్లో ఈ స్థలాన్ని దక్కించుకునేందుకు చాలామంది ప్రయత్నాలు చేశారు. కానీ సాధ్యం కాలేదు. ఈ క్రమంలో చంపాలాల్‌ బదిలీ కావటంతో ఈ భూముల వ్యవహారం మరుగన పడింది. ఆ తర్వాత రెండేళ్లపాటు దీనిపై ఎలాంటి వివాదం ఉత్పన్నం కాలేదు. 2018లో ఈ స్థలం తనదేనంటూ శెర్ల మురళీ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దీంతో రెవెన్యూ అధికారులు కూడా కోర్టులో కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టులో ఈప్రక్రియ సాగుతుండగానే ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ అఽధికారి సదరు పిటిషనర్‌కు తరుచూ ఫోన్‌ చేసి ఆ స్థలానికి సంబంధించి డబ్బులివ్వాలని లేదంటే వేరే వాళ్లకు అమ్మి వాటా ఇవ్వాలంటూ ఒత్తిడి తేవడం ప్రారంభించారని ఈ వ్యవహారంతో ప్రమేయం ఉన్న ఓ కీలకవ్యక్తి చెబుతున్నారు. లేనిపక్షంలో మొత్తం స్థలాన్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వపరం చేస్తానంటూ బేరసారాలకు దిగారని అంటున్నారు. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి విసిగివేసారి ఈ మొత్తం వ్యవహారాన్ని రెండేళ్ల క్రితమే ఫోన్లోరికార్డు చేసి తాజాగా విడుదల చేశాడు. అయితే ఉన్నట్టుండీ ఈ వ్యవహారం ఎందుకు తెరపైకి వచ్చిందనే విషయాన్ని విశ్లేషిస్తే జాతీయ రహదారి విస్తరణలో భూసేకరణ అధికారిగా వ్యవహరిస్తున్న ఆర్డీవో వాంకి డి మండలం గోయగాం వద్ద గిరిజనులకు సంబంధించిన భూముల పరిహారం విషయంలో మోసం చేశారంటూ స్థానిక బీజేపీ నేత కొట్నాక విజయ్‌ నేతృత్వంలో జిల్లాకేంద్రంలో భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో నిరసనలకు దిగిన వ్యక్తులకు బెదిరింపు కాల్స్‌ రావడంతో రెండేళ్ల క్రితం నాటి ఈ ఆడియో టేప్‌ బయట పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపైన ఆదివాసీ సంఘాలు అదనపు కలెక్టర్‌ను కలిసి బెదిరింపుల విషయంపై కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

Updated Date - 2022-09-14T04:09:13+05:30 IST