సింగరేణి పై టీఆర్‌ఎస్‌ది అసత్య ప్రచారం

ABN , First Publish Date - 2022-11-16T22:40:06+05:30 IST

సింగరేణిపై టీఆర్‌ఎస్‌ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్‌ అన్నారు.

సింగరేణి పై టీఆర్‌ఎస్‌ది అసత్య ప్రచారం
మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్‌

ఏసీసీ, నవంబరు 16: సింగరేణిపై టీఆర్‌ఎస్‌ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్‌ అన్నారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థను పైవ్రేటీకరణ చేసే ప్రసక్తే లేదని రామగుండం సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారని గుర్తు చేశారు. కంపెనీ చట్టం ప్రకారం సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉన్నందున బోర్డులో మెజారిటీ సభ్యులు రాష్ట్రానికి చెందిన వారే ఉంటారని అన్నారు. సింగరేణికి సంబంధించి ఏ నిర్ణయం అయినా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ సర్వసభ్య సమావేశంలో మెజారిటీ సభ్యుల నిర్ణయం మేరకు తీసుకుంటారని చెప్పారు. మెజారిటీ సభ్యులు రాష్ట్రానికి చెందినవారైనందున సింగరేణిపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రానికే ఉందన్నారు. బొగ్గు బ్లాకుల వేలంతో సింగరేణి ప్రైవేటీకరణకు సంబంధం లేదన్నారు. 2015లో మినరల్స్‌, మైన్స్‌ డెవలప్‌మెంట్‌ రెగ్యులేటరీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు టీఆర్‌ఎస్‌ ఎంపీలు మద్దతుగా ఓటు వేశారన్నారు. 2019 వరకు రాష్ట్ర ప్రభుత్వం కోల్‌ బ్లాకుల కేటాయింపుపై ఏ విధమైన అభ్యంతరాలు వ్యక్తం చేయలేదన్నారు. సింగరేణి కోల్‌ బ్లాకుల వేలంలో పాల్గొంటే నాలుగు శాతంతోనే సింగరేణికి కోల్‌ బ్లాకులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఒరిస్సాలోని నైనీ కోల్‌ బ్లాకును సింగరేణి వేలం పాడిందని, తెలంగాణాలోని నాలుగు బొగ్గు బ్లాకుల వేలంలో ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. 2014లో దేశంలో బొగ్గు ఉత్పత్తి 500 మిలియన్‌ టన్నులు మాత్రమే ఉండగా నేడు 1000 మిలియన్‌ టన్నుల బొగ్తు ఉత్పత్తికి చేరుకుందని చెప్పారు. అది కేవలం నరేంద్రమోదదీ తీసుకున్న చర్యలవల్లనే సాధ్యపడిందన్నారు. వచ్చే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీఆర్‌ఎస్‌ అసత్య ప్రచారం చేస్తుందని విమర్శించారు. సమావేశంలో పురుషో త్తం, ఆంజనేయులు, రాజు, శ్రీదేవి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T22:40:06+05:30 IST

Read more