పంచాయతీ కార్యాలయాలకు భవనాలు కరువు

ABN , First Publish Date - 2022-09-29T03:38:40+05:30 IST

గ్రామపంచాయతీ కార్యాలయాలకు సొంత భవనాలు కరువయ్యాయి. అద్దె భవనాల్లో, అంగన్‌వాడీ కేంద్రాల్లో, కమ్యూనిటీ హాళ్లలో కార్యాలయాలను కొనసాగిస్తున్నారు. దీంతో పంచాయతీ పాలక వర్గానికి తిప్పలు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలనను అందించాలనే సంకల్పంతో 500పైగా జనాభా కలిగిన పల్లెలలను గుర్తించి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది.

పంచాయతీ కార్యాలయాలకు భవనాలు కరువు

- అరకొర వసతులు.. అద్దె గదుల్లో కొనసాగింపు

- నూతన జీపీలకు అసలే లేవు

- పాలకవర్గానికి తప్పనితిప్పలు

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 28: గ్రామపంచాయతీ కార్యాలయాలకు సొంత భవనాలు కరువయ్యాయి. అద్దె భవనాల్లో, అంగన్‌వాడీ కేంద్రాల్లో, కమ్యూనిటీ హాళ్లలో కార్యాలయాలను కొనసాగిస్తున్నారు. దీంతో పంచాయతీ పాలక వర్గానికి తిప్పలు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలనను అందించాలనే సంకల్పంతో  500పైగా జనాభా కలిగిన పల్లెలలను గుర్తించి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. తాత్కాలికంగా పంచాయతీ కార్యాలయాలను అద్దె భవనాలు, అంగన్‌ వాడీకేంద్రాలు, కమ్యూనిటీహాళ్లు ప్రభుత్వపాఠశాలల్లో పంచాయతీ కార్యాలయా లను ఏర్పాటు చేశారు. నూతన పాలక వర్గం కొలువుదీరి మూడు సంవత్సరాలు, నూతనపంచాయతీలు ఏర్పడి మూడున్నర సంవత్సరాల కాలం పూర్తి కావస్తున్నా పంచాయతీలకు సొంతభవనాలు లేక ప్రజలు, అధికారులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

పంచాయతీల్లో తీరని ఇక్కట్లు

జిల్లాలో 335పంచాయతీలుండగా అందులో 174పాతపంచాయతీలు. కాగా, జిల్లాలో 500పైగా జనాభా కలిగిన 161గ్రామాలను నూతనపంచాయతీలుగా అధికారులు ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన పంచాయతీలతో పాటు పాత పంచాయతీలకు కూడా భవనాల సమస్య తీవ్రంగా ఉంది. పాత పంచాయతీలలో కూడా జిల్లాలో కొన్నిచోట్ల పంచాయతీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. పాత పంచాయతీలు శిథిలావస్థకు చేరినా, అసౌకర్యాలతో కూడిన సొంతభవనాలు కొంత మేర ఉన్నప్పటికీ కొత్తపంచాయతీలకు ఆయా గ్రామాలలో  భవనాలు లేకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాల్‌ వంటి వాటిలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. పంచాయతీలు ఏర్పడి  మూడున్నర సంవత్సరాలు పూర్తవుతున్నా నేటికీ అద్దె భవనాల్లోనే కార్యాలయాలు కొనసాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో అద్దె భవనాలు లేక రేకుల షెడ్డులలో కొనసాగుతున్నాయి. 

గ్రామసభలకు చోటేది

గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు నిర్వహించడానికిగాను పాలకవర్గ సభ్యులతో సమావేశాలు నిర్వహించి తీర్మాణాలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను సరిపడ భవనాలు కావాలి. అయితే నూతనంగా ఏర్పాటు చేసిన భవనాలు ఇరుకుగా ఉండడంతో సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం ప్రతిరెండు నెలలకు ఒకసారి గ్రామసభలు నిర్వహించాలి. లేనిపక్షంలో గ్రామసర్పంచ్‌ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని పేర్కొన్నారు. గ్రామసభ నిర్వహించాలంటే గ్రామంలోని ఓటర్లు అందరు గ్రామసభకు సభ్యులే. కనీసం గ్రామసభకు పాలకవర్గ సభ్యులతో పాటు 50మంది గ్రామస్థులు హాజరు కావాలి. గ్రామంలో ఉన్న ఓటర్లను బట్టి గ్రామసభకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే కొత్త పంచాయతీలకు సొంతభవనాలు లేకపోవడమే కాకుండా ఉన్న తాత్కాలిక భవనాలు ఇరుకు గదులుగా ఉండడంతో గ్రామసభలు నిర్వహించడా నికి ఇబ్బందులు తప్పడం లేదు. పంచాయతీలకు పక్కాభవనాలు లేక పోవడంతో గ్రామసభలను ఎక్కడపడితే అక్కడే నిర్వహించాల్సి వస్తోంది. దీంతో అటు అధికారులకు, ఇటు పాలకవర్గాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇరుకు గదులు ఉండడంతో పంచాయతీ సామగ్రి భద్రపర్చుకోవడానికి అధికారులకు, సర్పంచ్‌ లకు తలనొప్పి తప్పడం లేదు. ఇప్పటికైనా నూతనంగా ఏర్పడిన పంచాయతీలకు కొత్త భవనాలను మంజూరు చేసి పాలకవర్గ సభ్యులతోపాటు ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు. 

భవనాలు నిర్మించాలి..

- పొర్తెటి రవి, సర్పంచ్‌, పెద్దసిద్ధాపూర్‌

పంచాయతీలకు భవనాలు నిర్మించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. గ్రామసభలు ఆరుబయటే జరుగుతున్నాయి. ప్రభుత్వాధికారులున్నా విధులు నిర్వహించేందుకు భవనాలు లేవు. వీలైనంత త్వరగా భవనం నిర్మించాలి.

పాలనలో ఇబ్బందులు..

- తిరుపతి, సర్పంచ్‌, అంబగట్టు

నూతన గ్రామపంచాయతీలకు భవనాలు లేని కారణంగా పాలనలో ఇబ్బం దులు కలుగుతున్నాయి. తాత్కాలికంగా పాఠశాలలో పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేసినా అందులో ఎలాంటి సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నాం. అధికారులు స్పందించి తక్షణమే భవనం నిర్మించాలి.

Updated Date - 2022-09-29T03:38:40+05:30 IST